ఆంధ్రప్రదేశ్‌లో అడుక్కోవడం నేరమా.? ఈ వార్తల్లో నిజం ఎంత?
Fact Check: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకుందని, ఎక్కడ భిక్షాటన చేసినా.. నేరంగా పరిగణించనున్నారంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో వాస్తవం ఏమిటో ఏసియానెట్ న్యూస్ తెలుగు ఫ్యాక్ట్ చెక్ లో చూద్దాం..

ఆంధ్రప్రదేశ్ లో బెగ్గింగ్ యాక్ట్ పై వచ్చిన వార్తలు ఏంటి
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అడుక్కోవడాన్ని పూర్తిగా నిషేధిస్తూ బిక్షాటన నివారణ సవరణ చట్టం 2025ని అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ద్వారా ఏపీలో ఎక్కడైనా అడుక్కుంటే అది నేరమని వీ6 వెలుగు, తెలుగు సమయం, 10టీవీ ఇతర సైట్లు పలు వార్తలు ప్రచురించాయి.
వాస్తవం ఏమిటి
Andhra Pradesh Prevention of Begging Act, 1977 పేరుతో చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భిక్షాటన (Begging)ను నిరోధించేందుకు రూపొందించిన చట్టం. ఈ చట్టం ముఖ్య ఉద్దేశ్యం ప్రజా ప్రదేశాల్లో భిక్షాటన చేయడాన్ని ఆపడం, అలాగే భిక్షాటన చేసే వ్యక్తులకు పునరావాసం కల్పించడం. 1977లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టాన్ని ప్రవేశపెట్టింది. తాజాగా ఏపీ ప్రభుత్వం ఈ చట్టంలో చిన్న చిన్న మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది.(మీరు ప్ఱభుత్వ గెజిట్ నోటిఫికేషన్ కాపీని కింద పీడీఎఫ్ ను క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు)
భిక్షాటనను నియంత్రించడం, భిక్షగాళ్లను గుర్తించి వారికి నివాసం, శిక్షణ, ఉపాధి కల్పించడం, అలాగే నేరం చేసిన భిక్షగాళ్లకు విచారణ, శిక్ష విధించడం వంటివి 1977 చట్టంలో ఉన్నాయి. చట్టంలోని 6వ, 9వ విభాగాల్లో “Leper” (కుష్ఠురోగి), “Leper Asylum” (కుష్ఠురోగుల ఆశ్రమం), “Lunatic” (పిచ్చివాడు) వంటి పదాలు ఉన్నాయి. ఇవి వికలాంగులు, కుష్ఠరోగులతో బాధపడే వ్యక్తులపై వివక్ష చూపించే పదాలుగా పరిగణించారు. ఈ కారణంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వివక్షాత్మక పదాలను తొలగించడానికి నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పరిశీలించి, 1977 భిక్షాటన చట్టంలోని 6వ, 9వ సెక్షన్లను సవరించి, వికలాంగులు, కుష్ఠరోగులతో బాధపడే వ్యక్తులపై వివక్ష చూపించే పదాలను తీసివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తాజా సవరణ తీసుకొచ్చింది.
1977 చట్టం ప్రకారం ఎలాంటి శిక్షలు ఉంటాయి..?
చివరకు 1977 చట్టం కూడా కేవలం శిక్షకోసం తీసుకురాలేదు. భిక్షాటన చేసే వారిని సమాజంలో తిరిగి స్థిరపరచడం దీని ప్రధాన లక్ష్యం. అందుకోసం. ప్రభుత్వం భిక్షాటన నిరోధక కేంద్రాలు (Beggar Homes) ఏర్పాటు చేయాలి. ఆ కేంద్రాల్లో వారికి విద్య, శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. (ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును కింద క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు)
ఈ చట్టం ప్రకారం ఎవరైనా భిక్షాటన చేస్తూ కనిపిస్తే, పోలీసులు వారిని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరు పరచవచ్చు. మొదటిసారి పట్టుబడినవారిని పునరావాస కేంద్రం (Certified Institution)లో 1 నుంచి 3 సంవత్సరాల వరకు ఉంచవచ్చు. రెండోసారి లేదా మళ్లీ భిక్షాటన చేస్తే, 3 నుంచి 10 సంవత్సరాల వరకు నిర్బంధం విధించవచ్చు. ఈ చట్టం అమలు బాధ్యత పోలీసు అధికారులు, మ్యాజిస్ట్రేట్‌లుకి ఉంటుంది. వారు భిక్షాటన చేస్తున్న వ్యక్తులను గుర్తించి, వారికి సరైన సహాయం లేదా పునరావాసం అందించే విధంగా చర్యలు తీసుకోవాలి.
చివరకు తేలింది ఏమిటి..
ఆంధ్రప్రదేశం ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవో బిక్షాటనను నేరంగా ప్రకటించడం లేదు. అందులో కొన్ని పదాలను మార్పు చేసింది. “leper asylum” అనే పదం ఇప్పుడు “asylum for persons affected by leprosy”గా మారింది. “lunatic asylum” అనే పదం ఇప్పుడు “asylum for persons with mental illness”గా మారింది. భిక్షాటన పదే పదే చేస్తున్న వాళ్లను పోలీసులు నిర్బంధించవచ్చని 1977లొ వచ్చిన చట్టమే చెబుతోంది.

