- Home
- International
- Train Hijack: పాకిస్తాన్ లో రైలు హైజాక్ చేసిన మిలిటెంట్లు ఏం డిమాండ్ చేస్తున్నారో తెలుసా.?
Train Hijack: పాకిస్తాన్ లో రైలు హైజాక్ చేసిన మిలిటెంట్లు ఏం డిమాండ్ చేస్తున్నారో తెలుసా.?
పాకిస్థాన్‌లోని వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు రైలును హైజాక్ చేసిన సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. మొత్తం 400 మంది ప్రయాణిస్తున్న రైలును ఉగ్రవాదులు తమ చేతుల్లోకి తీసుకోడంతో పాకిస్థాన్ ఆర్మీ వెంటనే అలర్ట్ అయ్యింది. ప్రయాణికులకు సురక్షితంగా కాపాడే ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రైలు హైజాక్ లేటెస్ట్ అప్టేడ్స్‌తో పాటు అసలు మిలిటెంట్ల డిమాండ్లు ఏంటి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

హైజాక్ ఎలా జరిగింది.?
బలోచిన్ ప్రావిన్సులోని క్వెట్టా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని పెషావర్‌కు మంగళవారం ఉదయం 9 గంటలకు జాఫర్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరింది. 400 మందితో ప్రయాణిస్తున్న ఈ రైలును కొంతమంది వేర్పాటు వాదులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రైలు క్వెట్టా నుంచి 160 కి.మీల దూరంలో ఉన్న సిబి నగరానికి సమీపంలో ఉన్న సొరంగాలకు చేరుకోగానే వేర్పాటు వాదులు లోకో పైలట్‌పై దాడి చేసి రైలును తమ కంట్రోల్‌లోకి తీసుకున్నారు. 8వ సొరంగం వద్ద ట్రాక్‌ను పేల్చేశారు. హైజాక్ జరిగిన వెంటనే బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఈ విషయాన్ని ప్రకటించింది.
అప్రమత్తమై పాక్ ప్రభుత్వం:
ట్రైన్ హైజాక్ జరిగిందన్న విషయం తెలిసిన వెంటనే స్పందించిన పాకిస్థాన్ ప్రభుత్వం హైజాక్ జరిగిన చోటుకి భద్రతా బలగాలను పంపించి, ప్రయాణికులను రక్షించే ఆపరేషన్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలో వేర్పాటు వాదులపై కాల్పులు జరిపి 104 మందిని రక్షించామని భద్రతా వర్గాలు వెల్లడించాయి. రక్షించిన వారిలో 58 మంది పురుషులు, 31 మంది మహిళలు, 15 మంది చిన్నారులు ఉన్నట్లు తెలిపాయి. వీరందరినీ మరో రైలులో కాచీలోని మాచ్‌కి తరలించినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు సుమారు 16 మంది మిలిటెంట్లను భద్రతా దళాలు హతమార్చినట్లు తెలుస్తోంది.
ప్రతిదాడి తప్పదని హెచ్చరిక:
పాకిస్తాన్ సైన్యం చర్మను బలూచ్ తిరుగుబాటుదారులు తీవ్రంగా ఖండించారు. తమ డిమాండ్లను సీరియస్‌గా తీసుకోకపోతే ప్రతి బుల్లెట్‌కు 10 మంది బందీలను చంపుతామని హెచ్చరించారు. పాకిస్తాన్ సైన్యం మరోసారి స్వాతంత్ర సమరయోధులపై బాధ్యతారహితంగా దాడి చేసిందని ఆరోపించారు. హైజాక్ చేసిన రైలు తమ నియంత్రణలోని ఉందని తిరుగుబాటుదారులు తెలిపారు.
మిలిటెంట్ల డిమాండ్ ఏంటి.?
పాకిస్థాన్ నుంచి బలూచిస్థాన్‌కు విముక్తి కల్పించాలని పలు బలూచ్ వేర్పాటువాద గ్రూపులు గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. చైనా సహాయంతో పాక్ ప్రభుత్వం బలూచిస్థాన్‌లో ఉన్న ప్రకృతి సంపదను దోచుకుంటోందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్, చైనాకు వ్యతిరేకంగా బలూచ్ నేషనల్ ఆర్మీ పేరిట ఓ కొత్త తీవ్రవాద గ్రూపు ఏర్పడింది. పాకిస్థాన్ నుంచి వేరుపడి స్వతంత్ర బలూచిస్థాన్‌గా ఏర్పాటు కావాలనే లక్ష్యంతో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పనిచేస్తుంది. ఇందులో భాగంగానే పాకిస్థానీ భద్రతాధికారులు, ప్రభుత్వ కట్టడాలు, స్థావరాలు ప్రత్యేకంగా చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ కింద చైనా నిధులతో నిర్మించిన కట్టడాలపై బీఎల్‌ఏ అనేక దాడులు జరిపింది.
బలూచిస్థాన్ నేపథ్యం ఇదే:
1947లో బ్రిటీష్ పాలకులు దేశాన్ని విడిచి వెళ్లిపోతూ బలూచిస్థాన్‌తో కలుపుకొని ఉన్న కలాత్ సంస్థానానికి కూడా స్వాతంత్రం ప్రకటించారు. అయితే దాని హోదా వివాదాస్పదం కావడంతో కలాత్ రాజుతో చర్చలు జరిపిన పాక్ 1948లో పాక్‌లో విలీనం చేసుకుంది. అప్పటి నుంచి మొదలైన తిరుగుబాటు ఇప్పటికీ కొనసాగుతోంది. 1948, 1958-59, 1973-77లో తిరుగుబాటు జరగగా 2004 నుంచి తమకు మరింత ఆర్థిక, రాజకీయ ప్రతిపత్తి కావాలన్న డిమాండ్లు బలూచ్ ప్రజల నుంచి పెరిగిపోయాయి. నైరుతి పాకిస్థాన్‌లో ఉన్న బలూచిస్థాన్ పాక్ మొత్తం భూభాగంలో 44 శాతం వైశాల్యం కలిగి ఉన్నప్పటికీ 24 కోట్ల జనాభాలో కేవలం 6 శాతం మాత్రమే ఇక్కడ నివసిస్తున్నారు.