వైద్యరంగంలో రష్యా సంచలనం.. క్యాన్సర్ వ్యాక్సిన్ వచ్చేసింది
Russia Develops Enteromix Cancer Vaccine: రష్యా అభివృద్ధి చేసిన mRNA ఆధారిత ‘ఎంటరోమిక్స్’ క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రీక్లినికల్ ట్రయల్స్‌లో అద్భుత ఫలితాలు చూపించిందని FMBA వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ క్యాన్సర్ రోగులలో కొత్త ఆశాలు రేపుతోంది.

క్యాన్సర్‌పై రష్యా సెన్సేషన్.. అందుబాటులోకి క్యాన్సర్ వ్యాక్సిన్
రష్యా వైద్యరంగంలో ఒక కీలక ముందడుగు వేసింది. క్యాన్సర్ చికిత్స కోసం వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. ఫెడరల్ మెడికల్ అండ్ బయోలాజికల్ ఏజెన్సీ (FMBA) అధిపతి వెరోనికా స్క్వోర్ట్సోవా ఈ విషయాన్ని ప్రకటించారు. కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా రూపొందించిన కొత్త వ్యాక్సిన్ ‘ఎంటరోమిక్స్’ వాడుకకు సిద్ధమైందని వెరోనికా తెలిపారు.
క్యాన్సర్ వ్యాక్సిన్ పై రష్యా ఏళ్ల పరిశోధన ఫలితం
క్యాన్సర్ వ్యాక్సిన్ పై పరిశోధన పలు ఏళ్లుగా కొనసాగింది. చివరి మూడు సంవత్సరాలు తప్పనిసరి ప్రీక్లినికల్ స్టడీస్‌కు కేటాయించారు. వ్లాడివోస్టోక్‌లో జరిగిన 10వ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం (EEF) సందర్భంగా స్క్వోర్ట్సోవా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సమావేశానికి 75 దేశాల నుంచి 8,400 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.
క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రీక్లినికల్ ట్రయల్స్‌లో అద్భుత ఫలితాలు
స్క్వోర్ట్సోవా వివరించిన ప్రకారం.. క్యాన్సర్ రోగులపై ట్రయల్స్ ద్వారా ఈ వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని నిర్ధారణ అయ్యింది. పునరావృత డోసులు ఇచ్చినా ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. ట్యూమర్ పరిమాణం 60% నుండి 80% వరకు తగ్గడం, వృద్ధి నెమ్మదించడం వంటి ఫలితాలు వచ్చాయి. ముఖ్యంగా, పరీక్షలలో భాగమైన వారిలో జీవనావకాశాలు పెరిగినట్లు రిపోర్టులు పేర్కొన్నాయి.
mRNA టెక్నాలజీ ఆధారంగా క్యాన్సర్ వ్యాక్సిన్
‘ఎంటరోమిక్స్’ వ్యాక్సిన్ mRNA టెక్నాలజీ ఆధారంగా క్యాన్సర్ వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. ఇదే టెక్నాలజీని కొవిడ్-19 వ్యాక్సిన్లలో ఉపయోగించారు. ఈ విధానంలో, బలహీనమైన వైరస్‌ను వాడకుండా, శరీర కణాలు ప్రత్యేక ప్రోటీన్లను ఉత్పత్తి చేసేలా ప్రేరేపిస్తాయి. వాటి ద్వారా రోగ నిరోధక వ్యవస్థ క్యాన్సర్ కణాలను గుర్తించి దాడి చేస్తుంది.
కొలన్ క్యాన్సర్ కోసం వ్యాక్సిన్
ఈ వ్యాక్సిన్ మొదటగా కొలొరెక్టల్ క్యాన్సర్ (Colon Cancer) చికిత్స కోసం వాడుకలోకి రానుంది. ఇది పెద్దప్రేగులో ప్రారంభమయ్యే క్యాన్సర్. ప్రపంచవ్యాప్తంగా ఇది మూడవ అత్యంత సాధారణ క్యాన్సర్‌గా, దీని కారణంగానే అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, మొత్తం క్యాన్సర్ కేసుల్లో 10% కేసులు ఈ రకానికి చెందినవి ఉన్నాయి.
కొలన్ క్యాన్సర్ సాధారణంగా వృద్ధుల్లో కనిపించినా, ఇటీవల యువతలో కూడా వేగంగా పెరుగుతోందని వైద్య అధ్యయనాలు చెబుతున్నాయి.
క్యాన్సర్ కోసం మరిన్ని వ్యాక్సిన్లు
స్క్వోర్ట్సోవా ప్రకారం, ప్రస్తుతం గ్లియోబ్లాస్టోమా (వేగంగా పెరుగుతున్న మెదడు క్యాన్సర్), మెలనోమా వంటి తీవ్రమైన చర్మ క్యాన్సర్లకు వ్యతిరేకంగా వ్యాక్సిన్ల అభివృద్ధి కూడా జరుగుతోంది. వీటిలో ఓక్యులార్ మెలనోమా (కళ్లలో ఏర్పడే మెలనోమా) కూడా ఉంది.
‘ఎంటరోమిక్స్’ వ్యాక్సిన్ ప్రస్తుతం రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. ఆమోదం లభించిన వెంటనే వైద్యరంగంలో వినియోగం ప్రారంభమవుతుంది. రష్యా టుడే ప్రకారం, ఇప్పటికే కొన్ని ఆంకాలజీ కేంద్రాల్లో ఇది పరిమిత వాడుకలో ఉంది.
క్యాన్సర్ వ్యాక్సిన్ల అభివృద్ధి ఇప్పటివరకు ప్రయోగ దశలో ఉన్నప్పటికీ, రష్యా ఈ రంగంలో ముందడుగు వేసింది. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ నివేదిక ప్రకారం, ప్రోస్టేట్, బ్లాడర్ వంటి కొన్ని క్యాన్సర్లకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నప్పటికీ, కొత్త ప్రయోగాలు ఆన్కాలజీలో (Oncology) కొత్త దిశలు తెరుస్తున్నాయి.
ప్రస్తుతం క్యాన్సర్‌పై పోరాటంలో రష్యా ప్రకటించిన ఈ వ్యాక్సిన్ ఒక కీలక మైలురాయి అని చెప్పవచ్చు. అంతర్జాతీయంగా ఆమోదం లభించిన తర్వాత, కోట్లాది రోగులకు ఇది ఒక కొత్త ఆశగా మారే అవకాశముంది.