Operation Sidoor : ఆపరేషన్ సిందూర్ పార్ట్ 2 కు రెడీ : రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్
Operation Sidoor : ఆపరేషన్ సిందూర్ ముగిసినా ఇప్పటికీ బారతీయుల్లో దానిపై చర్చ సాగుతుంటుంది. ఇలాంటిది స్వయంగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ 'ఆపరేషన్ సిందూర్ పార్ట్ 2' అంటూ విదేశీ గడ్డపై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

ఆపరేషన్ సిందూర్ పార్ట్ 2 కి కూడా రెడీ..
Operation Sidoor : పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత సత్తా ఏమిటో చాటిచెప్పిన ఘటన ఆపరేషన్ సిందూర్. తమతో పెట్టుకుంటే దేశంలోకి చొరబడిన ఉగ్రమూకలనే కాదు దేశం అవతల ఉన్న ఉగ్రవాదులను అంతమొందిస్తామని ఈ ఆపరేషన్ సిందూర్ ద్వారా శత్రుదేశాలకు సందేశం పంపించింది భారత్. ఈ ఆపరేషన్ ను పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులకోసం చేపట్టింది... బాంబుల వర్షం కురిపించి వందలమంది ఉగ్రవాదులను అంతమొందించింది. అయితే ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని... పాకిస్థాన్ తీరునుబట్టి పార్ట్ 2, పార్ట్ 3 ఆధారపడి ఉంటుందని తాజాగా భారత రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
విదేేశీ గడ్డపై రాజ్ నాథ్ సంచలన కామెంట్స్
రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రస్తుతం మొరాకో పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆ దేశంలోని ప్రవాస భారతీయులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ తో విబేధాలు గురించి మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ ప్రస్తావన తీసుకువచ్చారు. ఉగ్రవాదులు మానవత్వం లేకుండా వ్వహరించారని... పహల్గాంలో మతం అడిగిమరీ పర్యాటకులను కాల్చిచంపారని అన్నారు. ఇందుకు భారతసైన్యం ప్రతీకారం తీర్చుకుందని… కులమతాలు చూడకుండానే ఉగ్రవాదులను ఏరివేసిందన్నారు. ప్రధాని మోదీ త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్చను ఇచ్చారు... దీనివల్లే ఆపరేషన్ సిందూర్ సాధ్యమయ్యిందని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.
పాకిస్థాన్ రాజ్ నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశామని మంత్రి తెలిపారు. ఆ తర్వాత కూడా పాకిస్థాన్ అభ్యర్థించడం వల్లే దాడులను విరమించామని అన్నారు. మళ్లీ పాక్ రెచ్చగొట్టే చర్యలకు దిగినా, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి భారత్ లో హింసకు ప్రేరేపించినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ పార్ట్ 2, పార్ట్ 3 ఉంటుందా? ఉండదా? అనేది పాకిస్థాన్ తీరునుబట్టి డిసైడ్ అవుతుందన్నారు. ఉగ్రవాదులకు తగినవిధంగా బుద్ది చెప్పేందుకు భారత్ ఎల్లప్పుడూ రెడీగా ఉంటుందని... దేశాన్ని సురక్షితంగా ఉంచడమే తమ మొదటి కర్తవ్యమని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
యావత్ ప్రపంచం చూపు భారత్ వైపే
ప్రస్తుత ప్రభుత్వ విధానాల వల్ల అంతర్జాతీయ సమాజంలో భారత్ ప్రతిష్ట గణనీయంగా పెరిగిందని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. గతంలో అంతర్జాతీయ వేదికలపై భారత్ మాట్లాడితే దాన్ని అంత సీరియస్‌గా తీసుకునేవారు కాదు... ఈ రోజు భారత్ మాట్లాడితే ప్రపంచం మొత్తం జాగ్రత్తగా వింటుందన్నారు. భౌగోళికంగా అనేక సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని... ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలిచిందన్నారు రక్షణ మంత్రి.
గ్లోబల్ హబ్‌గా భారత్
భారత్ స్టార్టప్‌లు, ఆవిష్కరణలకు గ్లోబల్ హబ్‌గా మారుతోందని... 2014లో భారత్‌లో 500 స్టార్టప్‌లు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 1.60 లక్షలకు పెరిగిందన్నారు రక్షణ మంత్రి. 2014 లో 18గా ఉన్న యునికార్న్‌ల సంఖ్య ఈ రోజు 118కి చేరిందని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.