- Home
- International
- అవును.. భారతీయులను ఉద్దేశించి నేను మాట్లాడింది సరైంది కాదు: అమెరికా ఉపాధ్యక్షుడు
అవును.. భారతీయులను ఉద్దేశించి నేను మాట్లాడింది సరైంది కాదు: అమెరికా ఉపాధ్యక్షుడు
JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గతంలో భారత్, హెచ్-1బీ వీసాదారులపై చేసిన వ్యాఖ్యలపై తాజాగా స్పందించారు. భారతీయ నిపుణులను ఉద్దేశించి తాను ఉపయోగించిన పదజాలం సరికాదని, భారత్ విషయంలో మాట్లాడేటప్పుడు హద్దులు దాటానని అన్నారు.

భారతీయులపై వ్యాఖ్యల విషయంలో వెనక్కి తగ్గిన వాన్స్
కొన్ని రోజుల క్రితం భారతీయ నిపుణులు, హెచ్-1బీ వీసా విధానంపై జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. తాజాగా ఓ సమావేశంలో ఈ అంశంపై మాట్లాడిన ఆయన.. భారత్ విషయంలో తాను అతిగా మాట్లాడానని అంగీకరించారు. విదేశీ ఉద్యోగులను ఉద్దేశించి గతంలో ఉపయోగించిన ‘విదేశీ ఒప్పంద పనివాళ్లు’ అనే పదం సరైనది కాదని పేర్కొన్నారు. తన ప్రసంగంలో అభ్యంతరకరమైన అంశాలు ఉంటే వాటికి తానే బాధ్యత వహిస్తానని తెలిపారు. వీసా ద్వారా అమెరికాకు వచ్చే ఉద్యోగులను కించపరచడం లేదా వారిని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకోవడం తన ఉద్దేశం కాదని వివరించారు.
అమెరికా ఉద్యోగాలపైనే తన ఆందోళన అన్న వాన్స్
అమెరికా కంపెనీలు విదేశీ ఉద్యోగులను నియమించుకునే విధానం, హెచ్-1బీ వీసా వ్యవస్థ గురించి చర్చించాలనే ఉద్దేశంతోనే తాను గతంలో వ్యాఖ్యలు చేసినట్లు వాన్స్ తెలిపారు. ఈ వీసాల ద్వారా విదేశీ నిపుణులను నియమించుకునే సంస్థలు.. సంబంధిత ఉద్యోగాలకు సరిపడే అమెరికా కార్మికులు అందుబాటులో లేరని పేర్కొంటాయని అన్నారు. ఇలాంటి నియామకాల వల్ల స్థానికులకు ఉద్యోగ అవకాశాలు తగ్గే పరిస్థితులు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికాలో తరచూ ఈ సమస్య ఎదురవుతోందని, అందుకే ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు. అయితే, తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన తీరు సరిగా లేదని తాజాగా అంగీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇంతకీ వాన్స్ ఏమన్నారంటే.?
గతంలో హెచ్-1బీ వీసాల ద్వారా అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులను వాన్స్ ‘విదేశీ ఒప్పంద పనివాళ్లు’గా అభివర్ణించారు. ఈ వీసా విధానాన్ని ఉపయోగించుకునే కంపెనీలను ‘వీసా మిల్లులు’గా పేర్కొన్నారు. విదేశీ ఉద్యోగుల నియామకంపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణుల్లో చర్చకు కారణమయ్యాయి. అమెరికా సాంకేతిక రంగంలో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తాజాగా తన పదజాలం సరైనది కాదని వాన్స్ చెప్పడంతో ఈ వివాదం మరోసారి వార్తల్లోకి వచ్చింది.
వాన్స్ వ్యాఖ్యలను తప్పుబట్టిన భారత విదేశాంగ శాఖ
జేడీ వాన్స్ వ్యాఖ్యలపై భారత కేంద్ర విదేశాంగ శాఖ గతంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారతీయ నిపుణులు అమెరికాకు వెళ్లడం వల్ల వారికి ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా, అక్కడి కంపెనీలకు కూడా ప్రయోజనం కలుగుతుందని స్పష్టం చేసింది. అత్యాధునిక నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు సంస్థల అభివృద్ధికి దోహదపడతారని పేర్కొంది. పరిశోధన, ఆవిష్కరణలు, ఉత్పాదకత పెంపు, అంతర్జాతీయ పోటీలో నిలదొక్కుకోవడం వంటి అంశాల్లో నిపుణుల సేవలు ఎంతో ఉపయోగకరం అని వివరించింది. నైపుణ్యం కలిగిన ఉద్యోగుల రాక అమెరికా కంపెనీల వృద్ధికి, ఉద్యోగాల సృష్టికి కూడా తోడ్పడుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో వాన్స్ చేసిన వ్యాఖ్యలు అనవసరం అని భారత ప్రభుత్వం అభిప్రాయపడింది.
భారతీయ ఐటీ కంపెనీలపై పర్మ్ సస్పెన్షన్ నేపథ్యంలో చర్చ
కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా, విప్రో, హెచ్సీఎల్, క్యాప్జెమిని వంటి సంస్థల పేర్లు పర్మ్ (PERM – పర్మినెంట్ లేబర్ సర్టిపికేషన్ ప్రోగ్రామ్)కు సంబంధించిన సస్పెన్షన్ వ్యవహారంలో ప్రస్తావనకు వచ్చాయి. అమెరికాలో విదేశీ ఉద్యోగులను శాశ్వతంగా నియమించుకునే ప్రక్రియలో ఈ కార్యక్రమం కీలకంగా ఉంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలో విదేశీ నిపుణుల నియామకాలు, అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు అనే అంశాలపై చర్చ మరింత పెరిగింది. ఈ క్రమంలోనే గతంలో చేసిన వ్యాఖ్యలపై వాన్స్ తాజాగా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. హెచ్-1బీ వీసాదారులపై వ్యక్తిగతంగా వ్యతిరేకత లేదని, అమెరికా ఉద్యోగ మార్కెట్, నియామక విధానాలపై తన ఆందోళనను తెలియజేయడమే ఉద్దేశమని స్పష్టం చేశారు. ఆయన తాజా వివరణతో భారత్-అమెరికా మధ్య నైపుణ్య వలసలు, ఐటీ రంగంలో భారతీయుల పాత్రపై చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.

