Israel: మళ్లీ మొదలైన యుద్ధం.. దూసుకొచ్చిన మిస్సైళ్లు. అసలేం జరగనుంది.?
Israel: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. శనివారం ఇరాన్‌పై ఇజ్రాయెల్ ముందస్తు దాడి చేపట్టినట్లు ప్రకటించడంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో వరుస పేలుళ్లు సంభవించాయి.

టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ దాడి
ఫిబ్రవరి 28 (శనివారం) ఉదయం ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఇరాన్‌పై ముందస్తు సైనిక దాడి చేపట్టినట్లు అధికారికంగా ప్రకటించాయి. ఈ దాడిలో టెహ్రాన్ నగరంలోని కేంద్ర ప్రాంతాల్లో పేలుళ్లు చోటుచేసుకున్నాయని ఇరాన్ మీడియా తెలిపింది. డౌన్‌టౌన్ ప్రాంతంలో పొగ మేఘాలు కనిపించాయి. కొన్ని ప్రాంతాల్లో భవనాలు దెబ్బతిన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.
"ముందస్తు దాడి" అని ఇజ్రాయెల్ ప్రకటన
ఇరాన్ నుంచి క్షిపణులు లేదా డ్రోన్ దాడులు జరిగే ప్రమాదం ఉందనే సమాచారంతో ముందస్తుగా చర్యలు తీసుకున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ రక్షణ శాఖ ఈ చర్యను “ప్రీవెంటివ్ స్ట్రైక్”గా పేర్కొంది. ఇరాన్ నుంచి ప్రతీకార దాడులు జరిగే అవకాశంతో దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ప్రజలకు రక్షిత ప్రాంతాల దగ్గరే ఉండాలని సూచించారు. ఈ ప్రకటనతో రెండు దేశాల మధ్య ఘర్షణ మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
స్పందించిన ఇరాన్
టెహ్రాన్‌పై దాడి జరిగినట్లు ఇరాన్ అధికారికంగా ధృవీకరించింది. అయితే ఎంత నష్టం జరిగిందో, ఎంతమంది మృతి చెందారో ఇంకా ప్రకటించలేదు. ఇజ్రాయెల్ ముందస్తు దాడి పేరుతో యుద్ధాన్ని ప్రారంభించిందని ఇరాన్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రతీకార చర్యలు తీసుకునే అవకాశంపై అంతర్జాతీయ వర్గాలు దృష్టి సారించాయి.
#BREAKING#Tehranpic.twitter.com/QJGF0Ysr0M
— Tehran Times (@TehranTimes79) February 28, 2026
అణు చర్చల తర్వాత దాడి
ఇరాన్ అణు కార్యక్రమంపై పాశ్చాత్య దేశాలతో చర్చలు కొనసాగుతున్న సమయంలో ఈ దాడి జరగడం గమనార్హం. ఈ దాడి వల్ల దౌత్య ప్రయత్నాలకు దెబ్బ తగిలే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ అణు కార్యక్రమమే ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కారణంగా కొనసాగుతోంది.
ఏం జరగనుంది.?
ఇజ్రాయెల్ దాడికి ఇరాన్ ఎలా ప్రతిస్పందిస్తుందన్నది ఇప్పుడు కీలక అంశంగా మారింది. ప్రతీకారంగా క్షిపణులు లేదా డ్రోన్ దాడులు జరిగే ప్రమాదం ఉందని అంచనాలు ఉన్నాయి. ఇరాన్ ప్రతీకారం తీసుకుంటే ఈ ఘర్షణ పూర్తి స్థాయి యుద్ధంగా మారే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మధ్యప్రాచ్య ప్రాంతం మొత్తం ఈ ఉద్రిక్తత ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంది.

