- Home
- International
- Iran israel conflict: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఎందుకు మొదలైంది? ఎలా ముగిసింది.? అసలీ 12 రోజులు ఏం జరిగింది.?
Iran israel conflict: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఎందుకు మొదలైంది? ఎలా ముగిసింది.? అసలీ 12 రోజులు ఏం జరిగింది.?
ఇరాన్, ఇజ్రాయెల్‌ల మధ్య మొదలైన యుద్ధం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అమెరికా నేరుగా యుద్ధంలోకి దిగడం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అన్న భయాలు కూడా వచ్చాయి. అయితే చివరికి కథ సుఖాంతమైంది. రెండు దేశాలు కాల్పులు విరమించాయి.

అసలు యుద్ధం ఎందుకు మొదైలంది.?
ఇరాన్, ఇజ్రాయెల్‌ల మధ్య ఉద్రిక్తతలు ఇప్పటికిప్పుడు మొదలైనవి కావు. ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన రోజుల్లో ఇరాన్‌తో మంచి సత్సంబంధాలు కలిగి ఉండేది. ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న ఈ రెండు దేశాలు ఆ తర్వాత శత్రువులుగా మారాయి.
తమ శత్రు దేశాలకు ఇరాన్ మద్ధతు ఇస్తుందంటూ ఇజ్రాయెల్ ఆరోపిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్ యూరేనియం శుద్ధి ప్రక్రియను వేగవంతం చేయడం, అణ్వాయుధాల అభివృద్ధిపై అనుమానాలు ఏర్పడడంతో ఇజ్రాయెల్ అలర్ట్ అయ్యింది.
ఒకవేళ ఇరాన్ అణ్వాయుధ దేశంగా మారితే తమ అస్తిత్వమే ప్రమాదకరంగా మారుతుందని భావించిన ఇజ్రాయెల్ యుద్ధంలోకి దిగింది. దీనికి ఇరాన్ కూడా తీవ్రంగా ప్రతిఘటించింది. ఇలా రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది.
యుద్ధం ఎందుకు ఆగింది?
మొదటి నుంచి ఇజ్రాయెల్‌కు మద్ధతునిస్తూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో అణు ఒప్పందం చేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్‌పై దాడులు ఆపకపోతే తీవ్ర చర్యలు తీసుకుంటామని, అందుకు రెండు వారాల గడువు ఇస్తున్నట్లు ప్రకటించాడు.
అయితే అనూహ్యంగా ఈ ప్రకటన చేసిన రెండు రోజులకే అమెరికా ఇరాన్‌పై విరుచుకుపడింది. అత్యంత శక్తివంతమైన బీ2 బాంబర్లను ఉపయోగించి ఇరాన్‌లోని పలు అణు కేంద్రాలపై దాడి చేసింది. దీంతో యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చుతుందని అంతా భావించారు.
అయితే ఇదే సమయంలో యుద్ధం ఆపేందుకు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. యుద్ధాన్ని ఆపాలని ఇరుదేశాలను ఒప్పించారు. ఫలితంగా తాత్కాలికంగా యుద్ధ విరమణ ప్రకటన జరిగింది. అయితే ఆ తర్వాత కూడా ఇరు దేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో ట్రంప్ తీవ్రంగా స్పందించారు. మొత్తం మీద ప్రస్తుతం యుద్ధం ఆగింది. అందులోనూ ఇరాన్‌లోని అణు కేంద్రాలన్నీ ధ్వంసమయ్యాయి కాబట్టి ఇక దాడులు చేయాల్సిన అవసరం లేదని ఇజ్రాయెల్ భావించి యుద్ధాన్ని ఆపినట్లు తెలుస్తోంది.
ఈ 12 రోజులుల ఏం జరిగింది.?
జూన్ 13:
ఇజ్రాయెల్ “ఆపరేషన్ రైజింగ్ లయన్” ప్రారంభించి ఇరాన్‌లోని అణు కేంద్రాలు, క్షిపణి అభివృద్ధి స్థావరాలపై దాడులు చేసింది. ఆరుగురు అణు శాస్త్రవేత్తలు మృతి చెందగా, ఇరాన్ “ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3”తో ప్రతీకారం తీర్చింది.
ప్రజలు లక్ష్యంగా – రెండు దేశాలూ దాడులు
జూన్ 14 - 16:
ఇరాన్ దాడుల్లో ముగ్గురు ఇజ్రాయెల్ పౌరులు మృతిచెందగా 76 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ ప్రతిదాడుల్లో ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ హుస్సేన్ తైబ్ హతమయ్యాడు. టెల్‌అవీవ్‌లో ఓ భవనం కూలి 9 మంది చనిపోయారు. ఇరాన్ అధికార టీవీ, టెల్‌అవీవ్, హైఫా ప్రాంతాలు లక్ష్యంగా మారాయి.
జూన్ 17 - 19:
ఇరాన్ పేలుళ్లతో దద్దరిల్లింది. టెహ్రాన్ మొసాద్, మిలిటరీ ఇంటెలిజెన్స్ కేంద్రాలపై దాడులు చేసింది. ఇజ్రాయెల్ అరాక్, నతాంజ్ అణు కేంద్రాలు, హాస్పిటళ్లను లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ సీనియర్ కమాండర్లు హతమయ్యారు. మృతుల సంఖ్య పెరిగింది.
అమెరికా జోక్యం – ‘మిడ్‌నైట్ హ్యామర్’
జూన్ 22:
అమెరికా “ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్”తో నేరుగా యుద్ధంలోకి దిగింది. ఇరాన్‌లోని మూడు అణు శుద్ధి కేంద్రాలపై బాంబులు వేసింది. హర్మూజ్ జలసంధి మూసే అంశాన్ని ఇరాన్ పార్లమెంటు ప్రతిపాదించినా అమలు కాలేదు.
ప్రతీకార దాడులు – అమెరికా బేస్‌లు టార్గెట్
జూన్ 23:
ఇరాన్ ఖతార్‌లోని అల్‌ఉదీద్, ఇరాక్‌లోని మరో అమెరికా బేస్‌పై క్షిపణుల దాడులు చేసింది. టెల్‌అవీవ్ మాత్రం ఎవిన్ జైలు, ప్రభుత్వ కేంద్రాలను టార్గెట్ చేసింది.
కాల్పుల విరమణ
జూన్ 24:
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనతో ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని వెల్లడించారు. అయితే కొంతకాలం దాడులు కొనసాగినట్లు వార్తలు వచ్చాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడంతో ట్రంప్ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేయగా, నెతన్యాహు సైన్యం వెనక్కి తగ్గినట్లు వార్తలు వచ్చాయి.
ఇరాన్ అణు కేంద్రాలు నిజంగానే ధ్వంసమయ్యాయా.?
ఇరాన్‌లోని అణ్వాయుధ కేంద్రాలు ధ్వంసమయ్యాయని ఇజ్రాయెల్ చెబుతోంది. ఇరాన్ ఒకవేళ మళ్లీ న్యూక్లియర్ ప్రాజెక్టును మొదలు పెట్టాలంటే 15 నుంచి 20 ఏళ్లు పడుతోందని ఇజ్రాయెల్ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఇరాన్‌పై యుద్ధాన్ని ఆపి ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఇరాన్ వెర్షన్ మాత్రం దీనికి భిన్నంగా ఉంది. తాము శుద్ధి చేసిన 400 కిలోల యురేనియంను ముందుగానే వేరే చోటుకు తరలించామని చెబుతోంది. ఒకవేళ ఇరాన్ చెబుతోంది నిజమే అయితే అణు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి రెండు నుంచి మూడేళ్లు పడుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.