ATM: జూలై 1 నుంచి మారనున్న ఏటీఎమ్ రూల్స్.. ఇలా చేస్తే ఛార్జీల మోత తప్పదు
డిజిటల్ లావాదేవీలు పెరిగిన ప్రస్తుత తరుణంలో కూడా ఏటీఎమ్‌లను ఉపయోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏటీఎమ్ ఛార్జీల విషయంలో బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. జూలై 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

జూలై 1 నుంచి బ్యాంక్ సేవలపై కొత్త ఛార్జీలు
జూలై 1వ తేదీ నుంచి ICICI, HDFC వంటి ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు తమ సేవలపై వసూలు చేసే ఛార్జీల్లో మార్పులు చేయనున్నాయి. ATMలావాదేవీలు, డెబిట్ కార్డు, IMPS, నగదు డిపాజిట్ వంటి సేవలపై కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. కస్టమర్లు ఈ మార్పులను గమనించి తగిన ముందుజాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎమ్‌లు
ఈ బ్యాంక్ ఏటీఎమ్‌లు ఉపయోగించే వారు మెట్రో నగరాల్లో ప్రతి నెల 3 ATM లావాదేవీలు ఉచితం. మిగిలిన లావాదేవీలకు రూ.23 + పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు ఇది రూ. 21గా ఉండేది. ఇక చిన్న పట్టణాల విషయానికొస్తే నెలకు 5 ఏటీఎమ్ లావాదేవీలను ఉచితంగా చేసుకోవచ్చు. కాగా బ్యాలెన్స్ చెక్ లేదా ఇతర సేవలకు రూ.8.50 + పన్ను ఛార్జ్ చేస్తారు.
IMPS, నగదు తీసివేతలపై కొత్త రేట్లు
IMPS ఛార్జీలు (పన్ను ముందు) రూ.1,000 లోపు రూ. 2.50, రూ.1,000 నుంచి 1 లక్ష లావాదేవీలకు రూ. 5, అలాగే రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు రూ. 15 ఛార్జీ వేస్తారు. ఇక నెలకు మూడు సార్లు ఉచితంగా క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు. తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్‌కు రూ. 150 ఛార్జ్ చేస్తారు. ఒకే నెలలో రూ.1 లక్ష మించితే – రూ.1,000కు రూ. 3.5 లేదా రూ. 150 (ఏది ఎక్కువైతే అది).
డెబిట్ కార్డు, డిపాజిట్ సేవలపై కొత్త ఛార్జీలు
సాధారణ డెబిట్ కార్డుకు వార్షిక రుసుము రూ. 300 కాగా గ్రామీణ ఖాతాదారులకు ఇది రూ. 150గా నిర్ణయించారు. కొత్త కార్డు తీసుకోవాలనుకుంటే రూ. 300 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. నగదు లేదా చెక్ డిపాజిట్, డిమాండ్ డ్రాఫ్ట్ విషయానికొస్తే రూ. 1000కి రూ. 2 చెల్లించాలి. అలాగే కనీస ఛార్జ్ రూ. 50, గరిష్టంగా రూ. 15,000 వరకు ఉంటుంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై పరిమితులు
డ్రీమ్11, ఎమ్‌పీఎల్ వంటి యాప్‌లలో నెలకు రూ. 10,000 మించి ఖర్చు చేస్తే, అదనంగా 1% ఫీజు వసూలు చేస్తారు.. గరిష్ఠంగా నెలకు రూ. 4,999గా ఉంటుంది. ఇక పేటీఎమ్, మొబిక్విక్, ఫ్రీఛార్జ్ వంటి వాలెట్లలో రూ. 10,000కి మించి డిపాజిట్ చేస్తే 1 శాతం ఫీజు చెల్లించాలి.
ఇక అద్దె చెల్లింపులకు 1% ఛార్జ్ – గరిష్ఠంగా ₹4,999గా ఉంటుంది. అలాగే ఇంధన వ్యయాలు రూ. 15,000 మించితే 1% ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. విద్యుత్, నీరు, గ్యాస్ వంటి యుటిలిటీ బిల్లులకు రూ. 50,000 మించితే కూడా 1% ఛార్జ్ వసూలు చేస్తారు.