స్వీట్లను ఇందుకే తినాలనిపిస్తుందా?
ఒక్కోసారి తీపిని ఖచ్చితంగా తినాలనిపిస్తుంది. అయితే దీన్ని మనం చాలా సహజంగా చూస్తాం. కానీ స్వీట్లంటే మరీ ఎక్కువ ఇష్టంగా అనిపించడం సహజం కాదని నిపుణులు అంటున్నారు. ఈ కోరిక వెనుక ఎన్నో కారణాలు ఉండొచ్చు. అవేంటంటే..
Image: Getty Images
తీపిని రోజూ తినే వారు చాలా మందే ఉన్నారు. కానీ స్వీట్లు ఆరోగ్యానికి అంత మంచివి కావు. ఇవి మన ఆరోగ్యాన్ని ఎన్నో విధాలా దెబ్బతీస్తాయి. నిజమేంటంటే.. తీపిని తినాలనిపించడం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. అవేంటంటే..
బ్లడ్ షుగర్
రక్తంలో చక్కెర స్థాయిలు బ్యాలెన్స్ లో లేనప్పుడు ఇలా స్వీట్లను తినాలనే కోరికలు కలుగుతాయి. తీపి ఆహారాలు లేదా పానీయాలను తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు 'సమతుల్యం' అవుతాయి.
మానసికంగా కుంగిపోవడం
కొంతమంది మానసికంగా కుంగిపోయినప్పుడు లేదా ఒత్తిడికి గురైనప్పుడు స్వీట్లను తినడం కోసం ఆరాటపడుతుంటారని నిపుణులు అంటున్నారు. చక్కెర శరీరంలోకి చేరినప్పుడు 'డోపామైన్' ఉత్పత్తి అవుతుంది. ఇది ఒక హార్మోన్. ఇది మనల్ని సంతోషంగా, ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది.
వ్యసనం
కొంతమంది ఎప్పుడూ స్వీట్లు తింటుంటారు. అలాగే వీటిని ఎక్కువసేపు తినకుండా అస్సలు ఉండలేరు. ఈ వ్యసనం కూడా స్వీట్ల కోరికకు దారితీస్తుంది.
తినకుండా ఎక్కువ సేపు కూర్చున్న తర్వాత కూడా కొందరు స్వీట్ల కోసం ఆరాటపడుతుంటారు. అలాగే క్రమం తప్పకుండా తినే వంటకాలు పరిమితమైనవి. సుపరిచితమైనవి. కానీ అప్పుడప్పుడు స్వీట్ల కోసం ఆరాటపడతారు.
పోషక లోపాలు
శరీరంలో కొన్ని రకాల పోషకాలు తగ్గినా కూడా స్వీట్లపై వ్యామోహం ఉంటుందట. ముఖ్యంగా మెగ్నీషియం, జింక్, క్రోమియం వంటి పోషకాలు తగ్గితే స్వీట్లను తినాలనిపిస్తుంది.
నిద్ర సమస్య
నిద్ర సరిగ్గా లేకపోయినా కూడా మీకు స్వీట్లను తినాలనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిద్ర సమస్యల వల్ల కలిగే హార్మోన్ల మార్పుల వల్ల ఈ రకమైన తీపి కోరిక కలుగుతుంది.