నైట్ సరిగ్గా నిద్రపట్టడం లేదా? ఈ లోపమే కారణం కావచ్చు..
మనం ఆరోగ్యంగా ఉండడానికి కడుపునిండా తిండి.. కంటినిండా నిద్ర చాలా అవసరం. కానీ ప్రస్తుతం చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. మరీ ఈ సమస్యకు కారణాలెంటీ? విటమిన్ల లోపం వల్ల నిద్ర సమస్య వస్తుందా? ఏం చేస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చో తెలుసుకుందాం.

నైట్ సరిగ్గా నిద్రపట్టడం లేదా? నిద్రపోయినా అలసిపోయినట్లు అనిపిస్తుందా? అయితే, మీకు విటమిన్ B6 లోపం ఉండవచ్చు. సాధారణంగా ఈ విటమిన్ లోపం వల్ల చర్మ సమస్య, తలలో దురద, మానసిక ఒత్తిడి, చిరాకు లాంటి సమస్యలు వస్తాయి. కానీ నిద్రపై కూడా ఈ విటమిన్ ప్రభావం చూపిస్తుందట. మంచి నిద్రకు విటమిన్ B6 చాలా అవసరమంటున్నారు నిపుణులు.
ఎందుకు ముఖ్యం?
సెరోటోనిన్ ఉత్పత్తి:
సెరోటోనిన్ ఒక న్యూరోట్రాన్స్మిటర్. ఇది మంచి మానసిక స్థితిని కలిగించే హార్మోన్. ఇది మంచి నిద్ర, మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి చాలా అవసరం. విటమిన్ B6 ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లాన్ని సెరోటోనిన్‌గా మార్చడానికి సహాయపడుతుంది.
మెలటోనిన్‌ను నియంత్రిస్తుంది:
సెరోటోనిన్.. మెలటోనిన్ హార్మోన్‌గా మార్చబడుతుంది. ఈ హార్మోన్ శరీరంలో సర్కేడియన్ రిథమ్‌ను నియంత్రిస్తుంది. ఇది నిద్రపోయే సమయం అని శరీరానికి సంకేతం ఇస్తుంది. శరీరంలో విటమిన్ B6 లోపం ఉంటే, అది మెలటోనిన్ లోపానికి దారితీస్తుంది. దీనివల్ల రాత్రి నిద్రపోవడంలో ఇబ్బంది కలుగుతుంది.
సుఖ నిద్రకు
మానసిక ఒత్తిడిని నియంత్రిస్తుంది:
మానసిక స్థితిని మెరుగుపరచడంలో విటమిన్ B6 సహాయపడుతుంది. అంతేకాదు, ఈ విటమిన్ మెదడులో సంతోషకరమైన హార్మోన్ ఉత్పత్తికి దోహదపడి, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఫలితంగా నిద్ర బాగా పడుతుంది.
ఈ పదార్థాల్లో..
వెన్న, ఆకుకూరలు, ధాన్యాలు, శనగలు, బంగాళాదుంపలు, అరటిపండ్లు, చికెన్, సాల్మన్, ట్యూనా వంటి వాటిలో విటమిన్ B6 పుష్కలంగా ఉంటుంది.
డాక్టర్ సలహా..
రెండు వారాలకు పైగా రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోతే వెంటనే డాక్టర్ ను సంప్రదించి.. విటమిన్ B6 పరీక్ష చేయించుకోవాలి. ఎందుకంటే లక్షణాల ద్వారా B6 లోపాన్ని గుర్తించలేము.