దగ్గు, జలుబు తొందరగా తగ్గాలంటే ఇలా చేయండి
వర్షాకాలంలో దగ్గు, జలుబు వంటి సమస్యలు రావడం సర్వసాధారణం. అయితే తరతరాలుగా అనుసరిస్తున్న కొన్ని సాంప్రదాయ చిట్కాలు దగ్గు, జలుబును తొందరగా తగ్గిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
రుతుపవనాల రాకతో కొన్ని సమస్యలొచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ సీజన్ లో దగ్గు, జలుబు లు ఎక్కువగా వస్తుంటాయి. కానీ ఈ రెండు సమస్యలు అంత తొందరగా తగ్గవు. అయితే తరతరాలుగా మన అమ్మమ్మలు అనుసరిస్తున్న కొన్ని సంప్రదాయ చిట్కాలు మాత్రం వీటి నుంచి తొందరగా ఉపశమనం కలిగిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పసుపు పాలు
పసుపులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అందుకే దీన్ని ప్రతి భారతీయ ఇంట్లో వాడుతారు. పసుపులో శోథ నిరోధక లక్షణాలు ఉంటాయి. ఇలాంటి పసుపు దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందడానికి ఎంతో సహాయపడుతుంది. ఇందుకోసం ఒక గ్లాస్ గోరువచ్చని పసుపు పాలను రాత్రి పడుకునే ముందు తాగితే గొంతులో చికాకు తగ్గి బాగా నిద్రపడుతుంది. పసుపు శోషణను పెంచడానికి మీరు చిటికెడు నల్ల మిరియాల పొడిని కూడా వేయొచ్చు. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఉదయం దగ్గు తగ్గే వరకు తాగండి. ఇది మీకు దీర్ఘకాలిక ఉపశమనాన్ని కలిగిస్తుంది.
నీలగిరి చెట్టు ఆకులు
జలుబు వల్ల ఒక్కోసారి జ్వరం కూడావస్తుంది. జలుబు నాసికా కుహరం వాపుకు కూడా కారణమవుతుంది. అయితే నీలగిరి చెట్టు ఆకుల సారంలో ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి నాసికా రద్దీని తగ్గించడానికి, శ్లేష్మాన్ని బయటకు పంపడానికి సహాయపడతాయి. ఇందుకోసం టీ లేదా నూనెను ఉపయోగించొచ్చు. యూకలిప్టస్ దగ్గును తగ్గించడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. నీలగిరి ఆకుల ఆయిల్ లేదా యూకలిప్టస్ కలిగిన బామ్లను మీ ఛాతీ, గొంతుకు రుద్దడం లేదా ఆవిరి పీల్చడం వల్ల దగ్గు, జలుబు తొందరగా తగ్గుతాయి.
కర్పూరం పీల్చడం
కర్పూరం భారతీయ ఇంటిలో ఒక ముఖ్యమైన పదార్ధం. కర్పూరం దగ్గును తగ్గించే నిరోధకంగా పనిచేస్తుంది. జలుబు కారణంగా దగ్గు, తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మంచి ఫలితాల కోసం మీరు తక్కువ పరిమాణంలో పీల్చాలని నిపుణులు చెబుతున్నారు. ఒక టేబుల్ స్పూన్ పై రెండు నుంచి మూడు కర్పూరం బాల్స్ వేసి మంటలు వచ్చే వరకు వేడి చేయాలి. వేడిని ఆపివేసి, పొగలు ఆవిరి కావడం ప్రారంభించినప్పుడు నెమ్మదిగా పీల్చండి. కర్పూరం తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. శ్వాసకోశ బాధ నుంచి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది.
అల్లం, తేనె రసం
అల్లం శోథ నిరోధక ప్రభావాలకు ప్రసిద్ది చెందింది. తేనె గొంతు నొప్పిని ఉపశమనం చేయడానికి సహాయపడుతుంది. దురద, గొంతు నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి.. కొద్దిగా అల్లం తురిమి మరిగే నీటిలో కలపండి. అది మరిగిన తర్వాత అందులో కొద్దిగా తేనె కలిపి వేడి/గోరువెచ్చని నీటిని రోజుకు రెండు మూడు సార్లు తాగాలి. ఈ మిశ్రమం గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగించడానికి, సౌకర్యాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.