ప్రైవేట్ భాగంలో దురదకు కారణం ఇదే.. !
చాలా మంది ఆడవారికి యోనిలో దురద పెడుతుంటుంది. ఈ సమస్య వల్ల అసౌకర్యానికి గురవుతారు. ఈ సమస్య రాకూడదంటే ఆడవాళ్లు ప్రైవేట్ భాగాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఆడవారి శరీరంలోని సున్నితమైన అవయవాలలో యోని ఒకటి. అందుకే దీనిపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు. అయితే చాలా మంది ఆడవారు యోని ఆరోగ్యం గురించి, దాని పరిశుభ్రత గురించి అస్సలు పట్టించుకోరు. ఇది యోని ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అంతేకాదు దీనివల్ల యోనిలో విపరీతమైన దురద పెడుతుంది. దీనివల్ల నలుగురిలో ఇబ్బందిగా ఫీలవుతారు. అసలు యోనిలో దురద రావడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మురికి చేతులతో యోనిని తాకడం
కొందరు మర్చిపోయి చేతులను క్లీన్ చేసుకోకుండా యోనిని తాకుతారు. అప్పుడు మీ చేతులకు ఉన్న బ్యాక్టీరియా, ఫంగస్ యోనికి అంటుకుంటాయి. దీనివల్ల యోనిలో సంక్రమణ ప్రమాదం పెరుగుతుంది. అంతేకాదు అక్కడ విపరీతమైన దురద పెడుతుంది. అందుకే ఇలాంటి సమస్య రాకూడదంటే యోనిని ముట్టుకునే ముందు మీ చేతులను శుభ్రంగా కడగండి. అలాగే మీ గోర్లను చిన్నగా కత్తిరించండి. మీ భాగస్వామికి కూడా ఇది వర్తిస్తుంది.
కండోమ్లను ఉపయోగించకపోవడం
మీరు అసురక్షిత శృంగారంలో పాల్గొంటుంటే.. మీ యోని ఆరోగ్యం రిస్క్ లో పడే అవకాశముంది. ఎందుకంటే దీనివల్ల హానికరమైన బ్యాక్టీరియా, ఫంగస్ ఒకరినుంచి మరొకరికి బదిలీ అవుతాయి. దీని వల్ల యోని దురద పెడుతుంది. ఇలాంటి సమస్య రావొద్దంటే సెక్స్ సమయంలో కండోమ్ ను ఖచ్చితంగా ఉపయోగించాలి. అలాగే సెక్స్ తర్వాత యోనిని పూర్తిగా క్లీన్ చేయాలి. లేకపోతే యోని దురదతో పాటుగా యోని ఇన్ఫెక్షన్ సమస్య వస్తుంది.
సెక్స్ తర్వాత మూత్ర విసర్జన చేయకపోవడం
సెక్స్ తర్వాత మూత్ర విసర్జన చేయడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే దీని వల్ల మీ మూత్రాశయం, యోనిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా బయటకు వెళ్లిపోతుంది. దీనివల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, యోని దురద వంటి సమస్యలు రావు.
చక్కెరను ఎక్కువగా తీసుకోవడం
చక్కెర, తీపి ఆహారాలను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. కానీ వీటిని ఎక్కువగా తీసుకుంటే యోని ఆరోగ్యం రిస్క్ లో పడుతుంది. ఇది ఈస్ట్ ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. ఎక్కువ చక్కెర యోని దురదకు కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చక్కెర మన మొత్తం ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి సాధ్యమైనంతవరకు దీనిని తగ్గించండి. ఒకవేళ మీకు డయాబెటిస్ ఉంటే మీ యోని ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే డయాబెటిస్ ఉన్న మహిళలకు యోని దురద ఎక్కువగా ఉంటుంది.
సింథటిక్ ప్యాంట్ ధరించడం
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సింథటిక్ ప్యాంటీలను ధరించే అలవాటు యోని సంక్రమణకు దారితీస్తుంది. ఎందుకంటే సింథటిక్ ప్యాంటీలోకి గాలి ప్రవహించదు. దీని వల్ల అక్కడ ఎక్కువ చెమటపడుతుంది. దీంతో అక్కడ బ్యాక్టీరియా, ఫంగల్ బాగా పెరుగుతుంది. ఇది దురదకు కారణమవుతుంది. అలాగే సంక్రమణ ప్రమాదం కూడా పెరుగుతుంది. అందుకే వదులుగా, కాటన్ ప్యాంట్లను ధరించండి.