ఈ కెమికల్స్ తల్లిపాలను కూడా విషం చేస్తున్నాయి... ఇంతకూ ఏమిటీ PFAS?
ప్రస్తుతం మనిషి బ్రతుకే కెమికల్స్ మయం అయిపోయింది. తినే తిండి నుండి కట్టుకునే బట్టదాక ప్రతిదీ రసాయనాలతో తయారయ్యేవే. చివరకు అత్యంత స్వచ్చమైన తల్లిపాలను కూడా ఈ కెమికల్స్ విషం చేస్తున్నాయి.

Per-and Polyfluoroalkyl Substances (PFAS)
Per-and Polyfluoroalkyl Substances (PFAS) : ప్రస్తుతం మనిషి సకల సౌకర్యాలను కోరుకుంటున్నాడు... ఈ ప్రయత్నంలోనే ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. అభివృద్ది పేరిట జరుగుతున్న ప్రకృతి విధ్వంసం మనిషి ప్రాణాలమీదకు తెస్తోంది. ఇప్పటికే డిల్లీ వంటి నగరాల్లో వాయుకాలుష్యం తారాస్థాయికి చేరుకుంది... అక్కడి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఒక్క డిల్లీ పరిస్థితే కాదు యావత్ ప్రపంచం పరిస్థితి ఇలాగే మారింది. చివరికి పరిస్థితి ఏ స్థాయికి చేరిందంటే చిన్నారులకు ఎన్నో పోషకాలను అందించే తల్లిపాలు కూడా విషపూరితం అవుతున్నాయి. ఇది మానవాళికి ఏ స్థాయిలో ప్రమాదం పొంచివుందో హెచ్చరిస్తోంది.
Per-and Polyfluoroalkyl Substances (PFAS)
మానవ శరీరంలోకి ప్రమాదకర కెమికల్స్ ఎలా చేరుతున్నాయి :
PFAS అని పిలువబడే పెర్- ఆండ్ పాలీఫ్లోరోఅల్కైల్ పదార్థాలు చాలా ప్రమాదకరమైనవి. అయితే ఇవి నీరు, వేడి, నూనెల, గ్రీజు వంటి పదార్థాలకు నిరోధకంగా పనిచేస్తాయి. అంటే వీటివల్ల ప్రభావితం కాకుండా వుండే సింథటిక్ రసాయనాల సమూహం అన్నమాట. అందువల్లే ఈ రసాయనాలను మనుషులు నిత్యం ఉపయోగించే వస్తువుల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు.
ఆహార ప్యాకేజింగ్, కుక్ వేర్, ఫుడ్ ప్రాసెసింగ్, దుస్తులు,అగ్నిమాపక, కార్పెంటింగ్, మెటల్ ప్లేటింగ్, ఫోటో ఇమేజింగ్, సెమీ కండక్టర్ వంటివాటిలో PFAS కెమికల్స్ ను విరివిగా ఉపయోగిస్తున్నారు. సౌందర్య సాధనాలు, శీతలకరణ, పురుగుమందులు వంటి ఉత్పత్తులలో ఉపయోగిస్తున్నారు. ఇలా ఇప్పుడు కాదు 1950 నుండే పారిశ్రామిక ఉత్పత్తుల్లోనే కాదు సామాన్య మానవులు కూడా ఈ ప్రమాదకర కెమికల్స్ ను వాడుతున్నారు. దీని వాడకం క్రమక్రమంగా పెరుగుతూ ఇప్పుడు మరింత ప్రమాదకర స్థాయికి చేరింది.
ఈ కెమికల్ నీరు, గాలి, వేడికికి ప్రభావితం కాదు... అందువల్ల వాతావరణంలో చాలాకాలం అలాగే వుండిపోతుంది. అందువల్లే వీటిని "ఫరెవర్ కెమికల్స్" అనికూడా పిలుస్తుంటారు. ఒక్క మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ PFAS కెమికల్స్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.
ఇవి పండ్లు, కూరగాయలు, చేపలు, మాంసం, గుడ్లు వంటి అహారపదార్థాలతో పాటు తాగునీటిని కూడా కలుషితం చేస్తున్నాయి. వీటిద్వారా మన శరీరంలోకి ఈ ప్రమాదకర కెమికల్స్ చేరిపోతున్నాయి. ఇటీవల కాలంలో మనిషి రక్త నమూనాల్లో కూడా ఈ కెమికల్ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. చివరకు తల్లి ద్వారా కడుపులోని పిండానికి, తల్లిపాల ద్వారా పిల్లలకు కూడా విషం చేరుతోంది.
Per-and Polyfluoroalkyl Substances (PFAS)
PFAS కెమికల్స్ వల్ల వచ్చే జబ్బులు :
PFAS రసాయనాలు ప్రాణాంతక క్యాన్సర్ కు దారితీస్తాయి. అలాగే థైరాయిడ్, కాలేయం సమస్యలు, మూత్రపిండాల వ్యాధులకు ఇవి కారణం అవుతున్నాయి. హార్మోన్స్ అసమతుల్యానికి కూడా ఈ కెమికల్స్ కారణం అవుతున్నాయి.
ఈ కెమికల్స్ చిన్నారులపై ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి. తల్లి కడుపులోని ఈ కెమికల్స్ పెరుగుదల దశలోని పిండంపై అటాక్ చేస్తాయి... దీంతో బిడ్డ తక్కువ బరువుతో జన్మించడం, వంధ్యత్వానికి దారితీసే అవకాశం ఉందని శాస్త్రీయ అధ్యయనాలు సూచించాయి. పిండ అసాధారణ అభివృద్దికి కూడా ఈ కెమికల్స్ కారణం అవుతాయి.
ఇక పాల ద్వారా కూడా పుట్టిన బిడ్డలోకి ఈ PFAS కెమికల్స్ చేరుతున్నాయి. ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి ప్రమాదకర కెమెకల్స్ పై నిషేధం విధించాలని... సామాన్య ప్రజలే కాదు పారిశ్రామిక వినియోగానికి కూడా అనుమతించకూడదనే డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ PFAS కెమికల్స్ ప్రమాధాన్ని గుర్తించిన ప్రభుత్వాలు ప్రజారోగ్యం దృష్ట్యా వీటిపై నిషేధం విధిస్తున్నాయి.