టేస్టీ టేస్టీ మలైలడ్డు స్వీట్ రెసిపీ.. ఇంట్లోనే ఎలా తయారు చేయాలో తెలుసా?
మలై లడ్డు (Malai Laddu) పేరు వినగానే నోరూరుతుంది. ఈ లడ్డూలు పేరుకు లాగానే చాలా రుచిగా (Delicious) ఉంటాయి. పాలను బాగా మరిగించి చేసే ఈ స్వీట్ ఐటమ్ ఆరోగ్యానికి కూడా మంచిది. సరైన కొలతలతో చేసుకుంటే ఈ లడ్డూ బయట దొరికే స్వీట్ షాపు స్టైల్ లో వస్తాయి. తక్కువ పదార్థాలతో తయారు చేసుకునే ఈ స్వీట్ ఐటమ్ తయారీ విధానం చాలా సులభం. ఇంకెందుకు ఆలస్యం ఈ మలై లడ్డు తయారీ విధానం గురించి తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు: ఒక లీటరు చిక్కటి గేదె పాలు (Thick buffalo milk), 100 గ్రాముల పంచదార (Sugar), ఒక టీ స్పూన్ నిమ్మ రసం (Lemon juice), ఒక టేబుల్ స్పూన్ నెయ్యి (Ghee), సగం టీ స్పూన్ యాలకుల పొడి (Cardamom powder), పావు కప్పు పాల పొడి (Milk powder).
తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న కడాయిని పెట్టి అందులో ఒక లీటర్ చిక్కటి గేదె పాలు వేసి మరిగించుకోవాలి. అలాగే ఇందులో 100 గ్రాముల పంచదార (Sugar) కూడా వేసి రెండుమూడు పొంగులు రానివ్వాలి. ఆ తరువాత తక్కువ మంట (Low flame) మీద ఉంచుకుని అంచుల వెంబడి ఏర్పడుతున్న మీగడను తీస్తూ పాలలో వేసి బాగా మరిగించుకోవాలి.
ఇలా ప్రతి 30 సెకన్లకు ఒకసారి అంచుల వెంబడి ఏర్పడుతున్న మీగడను (Cream layer) తీస్తూ పాలలో కలుపుతూ పాలను మరిగించుకోవాలి. ఇలా పాలను తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. పాలు సగం పైగా ఇమిరిపోయాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం (Lemon juice) వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిసేపటికి పాలు క్రీంలా తయారవుతాయి.
అప్పుడు ఇందులో పావుకప్పు పాల పొడి (Milk powder) వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, సగం టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి (Mix well). ఇలా బాగా కలుపుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి అంచులకు పలుచగా కోవా మిశ్రమాన్ని లేయర్ గా స్ప్రెడ్ చేసుకోవాలి.
ఇలా స్ప్రెడ్ చేసుకున్నా కోవా మిశ్రమాన్ని ఆరు గంటల పాటు చల్లారనివ్వాలి (Let cool). కోవా చల్లారిన తరువాత గట్టిపడుతుంది. ఇప్పుడు అర చేతికి నెయ్యి రాసుకుని ఈ మిశ్రమాన్ని ఉండలుగా చుట్టుకోవాలి. లడ్డూలను జీడిపప్పు పలుకులతో గార్నిష్ (Garnish) చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన మలై లడ్డు రెడీ.
ఈ లడ్డూలు నాలుగు రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఎదిగే పిల్లలు ఈ లడ్డూలను తీసుకుంటే చాలా మంచిది. ఆయుర్వేద పరంగా మైగ్రేన్ (Migraine) ఉన్నవారు ఈ స్వీట్ ను తిని పడుకుంటే 15 రోజుల్లో మైగ్రేన్ తగ్గుతుంది. అలాగే ఈ లడ్డూను తీసుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ (Health Benefits) కలుగుతాయి.