బెంగాలీ స్పెషల్ స్వీట్ కోవా పాలపూరీ ఇలా చేస్తే టెస్ట్ అదిరిపోతుంది!
కోవా పాలపూరి (Kova Palapuri) పేరు వినగానే నోరూరుతోంది కదా. ఇది బెంగాలీ స్పెషల్ స్వీట్ ఐటమ్ (Bengali Special Sweet Item). స్వీట్ బాగా ఇష్టపడే వారు కోవా పాలపూరీలను ఒకసారి ట్రై చేయండి. ఈ స్వీట్స్ చాలా రుచిగా ఉంటుంది. ఈ స్వీట్ జ్యూసీగా తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ స్వీట్ రెసిపీ తయారీ విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు: ఒక లీటరు చిక్కటి పాలు (Milk), ఒక కప్పు మైదా (Maida), సగం కప్పు పంచదార (Sugar), రెండు టేబుల్ స్పూన్ ల నెయ్యి (Ghee), సగం కప్పు కోవా (Kova), పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము (Green coconut grater), చిటికెడు ఉప్పు (Salt), పావు కప్పు పాలపొడి (Milk powder), 1/3 కప్పు బాదం పొడి (Almond powder), ఒక టీ స్పూన్ యాలకుల పొడి (Cardamom powder), ఢీ ఫ్రైకి సరిపడా ఆయిల్ (Oil).
తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద మందపాటి కడాయిని పెట్టి అందులో ఒక లీటరు చిక్కటి పాలను (Milk) వేసుకుని 1/3 కప్పు పంచదార (Sugar) వేసి మరిగించుకోవాలి. పాలను బాగా కలుపుతూ లీటరు పాలు అర లీటర్ అయ్యేవరకు మరిగించుకోవాలి. పాలు మరిగించుకోవడానికి కనీసం 25 నుంచి 30 నిమిషాల సమయం పడుతుంది.
పాలు మరిగేలోపు పూరిల కోసం ఒక గిన్నెలో ఒక కప్పు మైదా, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి (Mix well). ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా సాధ్యమైనంత గట్టిగా కలుపుకోవాలి (Mix tightly). పిండిని లూజుగా కలిపితే కోవాను స్టఫింగ్ చేసే సమయంలో బయటకు వచ్చేస్తుంది. కనుక సాధ్యమైనంత గట్టిగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు కోవా స్టఫింగ్ (Kova stuffing) కోసం ఒక గిన్నెలో సగం కప్పు కోవా, రెండు టీ స్పూన్ ల పంచదార, పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము, చిటికెడు ఉప్పు (Pinch of salt) వేసి బాగా కలుపుకోని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలుపుకున్న పూరి మిశ్రమాన్ని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. పూరి ఉండలలో కోవాను స్టఫింగ్ చేసి నెమ్మదిగా పూరీల్లా వత్తుకోవాలి.
ఇప్పుడు పూరీలను వేయించుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టి ఢీ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా మరుగుతున్న సమయంలో వత్తుకున్న కోవా పూరీలను వేసి ఎక్కువ మంట (High flame) మీద వేయించుకోవాలి. ఇప్పుడు లీటర్ పాలను వేడి చేయగా తయారైన అరలీటరు పాలలో పావు కప్పు పాలపొడి, 1/3 కప్పు బాదం పొడి, ఒక టీస్పూన్ యాలకులపొడి, ఒక టీస్పూన్ నెయ్యి (Ghee) వేసి బాగా కలుపుకోవాలి.
పాలు మరి కాస్త చిక్కగా అయ్యేవరకు మరిగించుకోవాలి. పాలు కనీసం 300ml అయ్యేవరకూ కలుపుతూ మరిగించుకోవాలి. అప్పుడు వేయించుకున్న పూరీలను పాలలో వేసి మరో ఐదు నిమిషాల పాటు ఎక్కువ మంట మీద మరిగించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి (Let cool). అంతే ఎంతో రుచికరమైన కోవా పాలపూరి రెడీ (Ready).