గోరుచిక్కుడు పల్లి కూర ఇలా చేస్తే భలే రుచిగా ఉంటుంది తెలుసా?
గోరుచిక్కుడు (Goruchikkudu) ఆరోగ్యానికి మంచిది. గోరుచిక్కుడుతో అనేక వంటలను వండుకోవచ్చు. గోరుచిక్కుడు, పల్లీలతో చేసుకునే కూర భలే రుచిగా ఉంటుంది.

గోరుచిక్కుడు అంటే ఇష్టపడని వారు కూడా ఇలా కూర వండుకుంటే ఎంతో ఇష్టంగా అడిగి మరీ చేయించుకుని తింటారు. ఈ కూర తయారీ విధానం సులభం. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం గోరుచిక్కుడు పల్లి కూర (Goruchikkudu palli curry) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు: పావుకిలో గోరుచిక్కుడు (Goruchikkudu) కాయలు, సగం కప్పు పల్లీలు (Peanuts), నాలుగు లవంగాలు (Cloves), ఒక ఇంచు దాల్చిన చెక్క (Cinnamon), కొన్ని మిరియాలు (Pepper), పది వెల్లుల్లి (Garlic) రెబ్బలు, ఐదు పచ్చి మిరపకాయలు (Green chilies), కొత్తిమీర (Coriander) తరుగు, రెండు కరివేపాకు (Curry leaves) రెబ్బలు, ఒక ఉల్లిపాయ (Onion), రెండు టమోటాలు (Tomatoes), రుచికి సరిపడా ఉప్పు (Salt), రెండు టేబుల్ స్పూన్ల నూనె (Oil).
తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి పల్లీలను దోరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పల్లీలు చల్లారాక తొక్క తీసేయాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర తరుగు, వేయించుకున్న పల్లీలు (Fried Peanuts), పచ్చిమిరపకాయలు, కొన్ని నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ (Grind finely) చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు గోరుచిక్కుడుకాయలను తీసుకొని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు (Onion slices) వేసి దోరగా ఫ్రై (Fry) చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత కరివేపాకు రెబ్బలు వేసి ఫ్రై చేసుకోని గోరుచిక్కుడు ముక్కలు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
గోరుచిక్కుడు బాగా ఫ్రై అయిన తరువాత టమోటా ముక్కలను వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. గోరుచిక్కుడు, టమోటాలు బాగా మగ్గిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లి మిశ్రమాన్ని (Peanuts mixture) వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి (Cook well). గోరుచిక్కుడు బాగా ఉడికిన తరువాత చివరిలో కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
అంతే ఎంతో రుచికరమైన (Delicious) గోరుచిక్కుడు, పల్లీల కూర రెడీ. ఈ కూర వేడి వేడి అన్నంలోకి భలే రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీ కుటుంబ సభ్యులకు తప్పక నచ్చుతుంది. ఇలా ఎప్పటికప్పుడు కొత్త వంటలను ట్రై చేస్తూ కొత్త రుచులను ఆస్వాదించండి. ఇలా ఆరోగ్యాన్ని (Health) పెంచే వంటలను వండుకోండి.. అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండండి..