సాక్సులు లేకుండా షూస్ వేసుకుంటే ఏమౌతుందో తెలుసా?
కొంతమంది సాక్సులు వేసుకోకుండా కేవలం బూట్లను మాత్రమే వేసుకుంటుంటారు. కానీ ఈ అలవాటు వల్ల ఎన్నిచర్మ సమస్యలు వస్తాయో తెలుసా?
ఈ రోజుల్లో సాక్సులు లేకుండా బూట్లను వేసుకోవడం ట్రెండీగా మారింది. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా దీన్ని ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా యూత్ సాక్సులను వేసుకోవడమే మర్చిపోయారు. ఇది ఈ రోజుల్లో ట్రెండే అయినా మీ ఆరోగ్యానికి మాత్రం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
సాక్సులు లేకుండా షూస్ వేసుకుంటే స్టైలిష్ గా కనిపిస్తారు. ఇది నిజమే కానీ.. సేఫ్టీ మాత్రం కాదు. అవును ఇలా సాక్సులు లేకుండా మీరు కేవలం షూస్ ను మాత్రమే వేసుకుంటే మీ ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. అసలు ఈ అలవాటు వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఫంగల్ ఇన్ఫెక్షన్
సాక్సులు లేకుండా షూస్ ను ఎక్కువ సేపు వేసుకుంటే పాదాలలో ఖచ్చితంగా చెమట పడుతుంది. ఇది సర్వ సాధారణ విషయం. అయితే సాక్సులు ఈ చెమటను గ్రహించి పాదాలను పొడిగా ఉంచడానికి సహాయపడతాయి. కానీ మీరు సాక్సులు లేకుండా బూట్లను వేసుకుంటే పాదాలలో తేమ ఎక్కువసేపు ఉంటుంది. దీని వల్ల ఫంగస్, బ్యాక్టీరియా ప్రమాదం బాగా పెరుగుతుంది. ఇది మిమ్మల్ని బాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, అథ్లెట్స్ ఫుట్ ఇన్ఫెక్షన్ వంటి వ్యాధుల బారిన పడేస్తుంది.
పాదాలలో బొబ్బలు
సాక్సులు మన పాదాలకు, బూట్లకు మధ్య రక్షణ కవచంలాగా పనిచేస్తాయి. అయితే మీరు చాలా సేపటి వరకు సాక్సులు లేకుండా బూట్లను వేసుకుని నడిచినా, పరిగెత్తినా పాదాలలో బొబ్బలు ఖచ్చితంగా వస్తాయి. అంతేకాదు ఇది మీకు దురద, చికాకును కలిగిస్తుంది. ఇదీ కాకుండా సాక్సులు వేసుకోకుండా కేవలం బూట్లను మాత్రమే వేసుకుంటే ఒక్కోసారి షూస్ టైట్ గా కూడా అనిపించొచ్చు. దీనివల్ల మీ పాదాలకు గాయాలయ్యే ప్రమాదం ఉంది. టైట్ షూస్ కు సాక్సులు వేసుకుంటే ఈ సమస్య చాలా వరకు తగ్గుతుంది.
పాదాల చర్మం ఇన్ఫెక్షన్
ఎక్కువ సేపు సాక్సులు లేకుండా షూస్ ను వేసుకోవడం పాదాలలో తేమ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఘర్షణ కూడా ఏర్పడుతుంది. దీనివల్ల చర్మ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువైతే సెల్యులైటిస్ వంటి ప్రమాదకరమైన సమస్యలు వస్తాయి. దీన్ని మొదట్లో గుర్తించకపోతే పరిస్థితి సీరియస్ గా మారుతుంది. అందుకే మీ పాదాలలో ఏదైనా ఇన్ఫెక్షన్ చాలా రోజులు ఉంటే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి.
shoes
మురికి వాసన
సాక్సులు లేకుండా షూస్ ను వేసుకోవడం వల్ల మీ పాదాల్లో తేమ బాగా పెరుగుతుంది. దీంతో పాదాలలో బ్యాక్టీరియా పెరుగుతుంది. దీనివల్ల మీ పాదాల నుంచి తరచుగా మురికి వాసన వస్తుంది. ముఖ్యంగా సాక్సులు లేకుండా లెదర్ షూస్ ను ఎప్పుడూ వేసుకునే వారి నుంచి మురికి వాసన ఎక్కువగా వస్తుంది. దీనివల్ల మీరు కొన్ని కొన్ని సార్లు ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సమస్యలేమీ రావొద్దంటే సాక్సులు లేకుండా బూట్లను వేసుకోవడం మానుకోండి. దీనితో పాటుగా సాక్సులను రోజూ శుభ్రం చేస్తూ వేసుకోవడం అలవాటు చేసుకోండి.