చలికాలంలో జీర్ణశక్తిని పెంచే అద్భుత ఆహార పదార్థాలు ఇవే!
చలికాలంలో చాలా మందిలో ఎదురయ్యే సమస్య అజీర్తి సమస్య (Indigestion problem). చలి కాలంలో వీచే చల్లని గాలుల కారణంగా బద్ధకం, నిద్ర లాంటివి ఆవరిస్తాయి. దీంతో శరీరానికి శారీరకశ్రమ అందక జీర్ణశక్తిని (Digestion) పెంచే ఎంజైమ్ల ఉత్పత్తి తగ్గి అజీర్తి సమస్యలు ఏర్పడతాయి. పేగులలో మలం పేరుకుని పోయి మల విసర్జన సాఫీగా జరుగదు.

ఈ కారణంగా మలబద్దకం సమస్య కూడా ఏర్పడుతుంది. కనుక తిన్న ఆహారం తేలికగా జీర్ణం కావాలన్నా, మలబద్దకం సమస్యలు తగ్గాలన్నా మనం తీసుకునే ఆహారంలో శరీరానికి వెచ్చదనాన్ని అందించే పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను చేర్చుకుంటే జీర్ణశక్తి పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
తిన్న ఆహారం తేలికగా జీర్ణం కాకపోవడం, కడుపు నొప్పి, కడుపులో మంట వంటి సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా చలికాలంలో జీర్ణశక్తి మందగిస్తుంది. దీంతోపాటు శరీరంలో వ్యాధి నిరోధక శక్తి (Immunity)కూడా తగ్గుతుంది. ఈ సమస్యలన్నింటిని అధిగమించడానికి మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు (Proteins), మంచి కొవ్వు ఉన్న ఆహార పదార్థాలను చేర్చుకోవడం మంచిది.
ఇవి శరీరంలో జీర్ణశక్తిని పెంచే ఎంజైమ్ల ఉత్పత్తిని మెరుగుపరిచి జీర్ణక్రియను సులభతరం చేస్తాయి.రోజువారీ ఆహార జీవనశైలిలో తాజా కూరగాయలు (Vegetables), ఆకుకూరలు (Leafy greens), పండ్లు, ఫలాలు, పాలు, నెయ్యి, గింజధాన్యాలు వంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. వీటిని తీసుకుంటే జీర్ణశక్తిని పెంచే ఎంజైమ్ల ఉత్పత్తి మెరుగుపడి జీర్ణక్రియ సులభతరం అవుతుంది.
చలికాలంలో అజీర్తి సమస్యలను తగ్గించుకోవడానికి లోపలినుంచి వెచ్చదనాన్ని అందించే గింజలు, పప్పులు, నువ్వులు, ఎండుఫలాలు వంటివి తీసుకోవడం మంచిది. తృణధాన్యాలతో (Cereals) పాటు ప్రోటీన్లు, మంచి కొవ్వు ఉన్న ఆహార పదార్థాలను శరీరానికి అందించాలి. మాంసము (Meat), చేపలను ఎక్కువగా తీసుకోవాలి.
శరీరానికి శక్తిని అందించి ఆరోగ్యంగా ఉంచడానికి క్యారెట్, ముల్లంగి, బంగాళదుంప, వెల్లుల్లి, ఉల్లి, బీట్రూట్, చిలగడదుంప, మెంతికూర, పాలకూర వంటి పోషకాలు కలిగిన వాటిని తీసుకోవడం ఉత్తమం. చలికాలంలో ఏర్పడే ఇన్ఫెక్షన్లను (Infections) తగ్గించి వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి ఆవాలు, ఇంగువ, నల్లమిరియాలు, మెంతులు, వాము వంటి సుగంధ ద్రవ్యాలు (Spices) ఉపయోగపడతాయి.
ఇవి శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని అందించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఇది శరీరంలో రక్తప్రసరణ మెరుగుపరచి జీర్ణవ్యవస్థకు సహాయపడే ఎంజైమ్ల ఉత్పత్తిని పెంచుతాయి. ముఖ్యంగా చలికాలంలో తులసి (Basil), అల్లంలను (Ginger) ఎక్కువగా తీసుకుంటే ఇవి శరీరానికి వెచ్చదనాన్ని అందించడంతో పాటు జీర్ణవ్యవస్థను సులభతరం చేస్తాయి.
చాలామంది చలికాలంలో నీటిని ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడరు. ఇది కూడా అజీర్తి సమస్యకు ప్రధాన కారణం. కనుక శరీరానికి కావలసిన నీటిని అందించడం మన బాధ్యత. ఎక్కువ మసాలా పదార్థాలను తీసుకోరాదు. వీటితో పాటు శరీరానికి కొంత శారీరక శ్రమను అందించడం అవసరం. వ్యాయామం (Exercise), యోగా (Yoga) వంటివి శరీరానికి వెచ్చదనాన్ని అందించి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి.