మూత్రంలో మంట, అసాధారణ ఉత్సర్గకు కారణాలేంటో తెలుసా?
యోని ఉత్సర్గ ఒక సాధారణ సంఘటన. కానీ మూత్రవిసర్జన చేసేటప్పుడు కడుపు నొప్పితో పాటుగా ఉత్సర్గలో ఆకస్మిక మార్పులు రావడం ఆరోగ్యానికి అస్సలు మంచివి కాదని నిపుణులు అంటున్నారు.
యోని ఉత్సర్గ మహిళల యోనిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది రావడం సర్వసాధారణం. సాధారణంగా యోని ఉత్సర్గ తెలుపు లేదా స్పష్టమైన ద్రవంలా కనిపిస్తుంది. అయినప్పటికీ ఈ ఉత్సర్గ రంగు, స్థిరత్వం, వాసనలో మార్పులు ఉంటే ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లాల్సిందే. ఎందుకంటే ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను సూచిస్తుంది. ముఖ్యంగా మూత్రవిసర్జన సమయంలో కడుపు నొప్పితో పాటుగా ఉత్సర్గ వస్తే ఇది తీవ్రమైన అంతర్లీన అనారోగ్యానికి సంకేతం కావొచ్చు. ఈ లక్షణాలను గుర్తించి సమస్యను తొందరగా పరిష్కరించుకోవాలి. దీంతో మీ పునరుత్పత్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
మూత్ర విసర్జన చేసేటప్పుడు కడుపు నొప్పి, అసాధారణ ఉత్సర్గ
మూత్ర విసర్జన చేసేటప్పుడు చాలా మంది ఆడవాళ్లకు పొత్తి కడుపు నొప్పి, తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి. దీనివల్ల మూత్రవిసర్జన ఇబ్బందిగా, అసౌకర్యంగా ఉంటుంది. ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కు సంకేతం కావొచ్చు. మూత్ర విసర్జన చేసేటప్పుడు పొత్తికడుపు తిమ్మిరి, అసాధారణ యోని ఉత్సర్గ లేదా రెండింటి కలయిక వచ్చినప్పుడు హాస్పటల్ కు చూపించుకోవడం మంచిది. మూత్రవిసర్జన సమయంలో అసాధారణ యోని ఉత్సర్గ లేదా పొత్తికడుపులో నొప్పికి దారితీసే ఎన్నో అంశాలు ఉండొచ్చు. అందులో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఈస్ట్ ఇన్ఫెక్షన్
అసాధారణ యోని ఉత్సర్గకు అత్యంత సాధారణ కారణాలలో ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఒకటి. యోనిలో బ్యాక్టీరియా, ఈస్ట్ లు సమతుల్యంగా ఉంటాయి. అయితే ఈ సమతుల్యత దెబ్బతిన్నప్పుడు.. ఇది ఈస్ట్ ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. మూత్రవిసర్జన చేసేటప్పుడు యోనిదగ్గర దురద, మంటతో పాటుగా మందపాటి, తెలుపు రంగులో ఉండే అసాధారణ యోని ఉత్సర్గ ఈస్ట్ ఇన్ఫెక్షన్ కు సాధారణ లక్షణం. సాధారణంగా దీనికి యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్ మందులను సిఫారసు చేస్తారు. ఏదేమైనా మందులు వాడే మందు డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
బాక్టీరియల్ వాగినోసిస్
యోనిలో బ్యాక్టీరియా, ఈస్ట్ సమతుల్యంగా ఉంటాయి. అయితే దీనిలో యోనిలో బ్యాక్టీరియా ఎక్కువగా పెరిగినప్పుడు.. ఇది బ్యాక్టీరియా వాగినోసిస్ కు దారితీస్తుంది. అసాధారణమైన యోని ఉత్సర్గ ఈ సంక్రమణకు సాధారణ లక్షణం. ఇది బూడిద-తెలుపు రంగులో ఉంటుంది. అలాగే ఉత్సర్గకు దుర్వాసన వస్తుంది. ఈ సంక్రమణకు యాంటీ బయాటిక్స్ మందులను వాడుతారు.
లైంగిక సంక్రమణ అంటువ్యాధులు
క్లామిడియా, గోనేరియా వంటి ఎన్నో ఎస్టీఐలు ఉన్నాయి. ఇవి అసాధారణ యోని ఉత్సర్గ, మూత్రవిసర్జన సమయంలో కడుపు నొప్పికి దారితీస్తాయి. మీకు లైంగిక సంక్రమణ వ్యాధులు ఉన్నట్టు అనిపిస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్
మూత్రవిసర్జన సమయంలో కడుపు నొప్పి రావడానికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కూడా ఒక కారణమంటున్నారు నిపుణులు. యూటీఐ అనేది ఒక బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది ఆడవారిలో మూత్ర మార్గాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది లైంగిక కార్యకలాపాలు, అపరిశుభ్రత, డయాబెటిస్ వంటి అంతర్లీన అనారోగ్య సమస్యల వంటి ఎన్నో కారణాల వల్ల వస్తుంది.
గర్భాశయ క్యాన్సర్
ఈ రకమైన క్యాన్సర్ గర్భాశయం ముందు భాగాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఎక్కువగా అసాధారణ యోని ఉత్సర్గ, మూత్రవిసర్జన సమయంలో కడుపు నొప్పితో పాటు కటిలో నొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది. వ్యాధిని ముందుగానే గుర్తించడం వల్ల ఈ సమస్యను చికిత్సతో తగ్గించుకోవచ్చు.