ఒంట్లో వేడి తగ్గాలంటే..!
ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. దీనివల్ల శరీరంలో వేడి అమాంతం పెరుగుతుంది. దీనివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం ఒంట్లో వేడిని తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.

ఎండాకాలం వచ్చిందంటే ఒంట్లో వేడి విపరీతంగా పెరిగిపోతుంది. దీన్ని వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఎన్నో సమస్యలు వస్తాయి. ఎండాకాలంలో ఈ వేడి వల్ల శరీరం బాగా అలసిపోతుంది. అలాగే శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. ఎండలకు శరీరం చల్లగా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Image: Getty Images
కొబ్బరి నీరు
కొబ్బరి నీరు అత్యంత ఆరోగ్యకరమైన వేసవి పానీయం. శరీరాన్ని పునరుద్ధరించడానికి, రిఫ్రెష్ గా ఉంచడానికి కొబ్బరి నీరు ఎంతో సహాయపడుతుంది. కొబ్బరి నీరు వేసవి వేడిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఎందుకంటే దీనిలో ఎలక్ట్రోలైట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని రీహైడ్రేట్ చేస్తాయి. ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి. కొబ్బరి నీరు జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది.
Image: Getty Images
మజ్జిగ
మజ్జిగ తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. జీవక్రియ మెరుగుపడుతుంది. గట్ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. మజ్జిగలో శరీరాన్ని చల్లబరిచే ప్రోబయోటిక్స్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది మీ ఆర్ద్రీకరణ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
కీరదోసకాయలు
కీరదోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు దీనిలో ఫైబర్, విటమిన్ బి 1, విటమిన్ బి 2, విటమిన్ బి 3, విటమిన్ బి 5, విటమిన్ బి 6, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ సి, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, జింక్ లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ మలబద్దకాన్ని నివారిస్తాయి. శరీరం నుంచి విషాన్ని తొలగిస్తాయి. ఎండాకాలంలో ఈ కీరదోసకాయ మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. అందుకే మీకు అలసట అనిపించినప్పుడల్లా మీ శక్తి స్థాయిలను పెంచడానికి వీటిని తినండి.
సిట్రస్ పండ్లు
నారింజ, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి వేడి వాతావరణంలో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలో వాటర్ కంటెంట్ తో పాటుగా విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. అవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి, శక్తి స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి. అంతేకాదు వేడి ఉష్ణోగ్రతల వల్ల కలిగే చర్మ సమస్యలను తగ్గించుకోవడానికి విటమిన్ సి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
పుచ్చకాయ
ఎండాకాలంలో పుచ్చకాయను ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే పుచ్చకాయలో 90 శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. అంతేకాదు దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ బి 6, విటమిన్ సి, పొటాషియం, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని చల్లగా ఉండటానికి సహాయపడతాయి. పుచ్చకాయ మీ కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది సహజంగా మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.