Health Tips: ఎలక్ట్రిక్ ట్రూత్ బ్రష్ కొనాలనుకుంటున్నారా.. అయితే నిజనిజాలు తెలుసుకోవాల్సిందే?
Health Tips: మార్కెట్లోకి ఎలక్ట్రిక్ బ్రష్ వచ్చి చాలా రోజులు అయింది. దానిమీద ఇప్పుడిప్పుడే అందరికీ అవగాహన ఏర్పడుతుంది. అయితే మాన్యువల్ టూత్ బ్రష్ మంచిదా లేదంటే ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ మంచిదా ఇప్పుడు తెలుసుకుందాం.
పళ్ళు తోముకోవటంలో మన ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సాగింది అంటే వేప పుల్లల దగ్గర నుంచి ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ల వరకు అని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రతిదానికి ఎలక్ట్రిక్ వస్తువులు వాడటం అలవాటయింది కదా అందుకే టూత్ బ్రష్ మాత్రం ఎలక్ట్రిక్ ది ఎందుకు ఉండకూడదు..
అనుకున్నారో ఏమో ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ లని మార్కెట్లోకి తీసుకువచ్చారు వ్యాపారులు. అయితే ఇది ఎంతవరకు మంచిది.. మాన్యువల్ టూత్ బ్రష్ మంచిదా, ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ మంచిదా అంటే దేనికి ఉండే విలువలు దానికి ఉన్నాయి. దేనికి ఉండే ఉపయోగాలు దానికి ఉన్నాయి అంటున్నారు నిపుణులు.
ఈ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్లు కూడా సాధారణ టూత్ బ్రష్ మాదిరిగానే ఉంటాయి. వీటిని ఆన్ చేసినప్పుడు ఈ బ్రష్ మీ దంతాల చుట్టూ తిరుగుతాయి. తద్వారా దంతాలని క్లీన్ చేస్తాయి. ఇక ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ లు ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ లలో టైం సదుపాయం కూడా అందించబడుతుంది.
దీనిలో మీరు మీ దంతాలను ఎంతసేపు బ్రష్ చేయాలో సెట్ చేయవచ్చు. ఎలక్ట్రిక్ బ్రష్ తో బ్రష్ చేసినప్పుడు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు ఇది ఆన్ చేసిన వెంటనే దానంతట అదే దంతాలని శుభ్రపరచడం ప్రారంభిస్తుంది. అయితే దీని వాడకం వలన సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి.
ఎలక్ట్రిక్ బ్రష్ వాడినప్పుడు వచ్చే వైబ్రేషన్, ఫాస్ట్ మూవింగ్ చిగుళ్ళకి అంత మంచిది కాదు. ఈ విషయంలో మాన్యువల్ బ్రషింగ్ ఎంతో ఉత్తమం. మాన్యువల్ బ్రష్ ని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడికి పడితే అక్కడకి తీసుకు వెళ్ళవచ్చు కానీ ఎలక్ట్రిక్ బ్రష్ తీసుకువెళ్లాలంటే అంత సులువు కాదు.
ధర కూడా రెండింటి విషయంలో చాలా తేడా ఉంటుంది. అలాగే మ్యాన్యువల్ బ్రష్ ఎంత బలం పెట్టి తోముకోవాలి తెలియక చాలామంది పళ్ళని గట్టిగా తోముకుంటారు. ఇది చిగుర్లకి అసలు మంచిది కాదు. కాబట్టి కొనేటప్పుడే ఆలోచించి, అన్ని గమనించి కొనుక్కోండి.