ఈ ఆహార పదార్ధాలతో మలబద్ధకం సమస్యకు గుడ్ బై.. ఏం తినాలంటే?
మలబద్ధకం (Constipation) సమస్య ప్రస్తుత కాలంలో చాలా మందిని ఇబ్బందిపెడుతోంది. ఈ సమస్యను తేలికగా తీసుకుంటే శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు (Illness issues) తలెత్తే అవకాశం ఉంటుంది.

ఈ సమస్య తలెత్తడానికి ముఖ్య కారణం తీసుకునే ఆహారంలో ఫైబర్ లోపం. కనుక శరీరానికి తగిన మోతాదులో ఫైబర్ ను అందించడం ముఖ్యం. మరి తీసుకోవలసిన ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మన ఆహార జీవనశైలిలో మార్పులు, సరైన సమయానికి భోజనం చేయకపోవడం, జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడం, నీరు తక్కువగా తాగడంతో ఈ సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్య ఉన్నప్పుడు తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాదు, గ్యాస్ తో పొట్ట మొత్తం ఉబ్బినట్లుగా ఉండటం, పుల్లటి తేన్పులు, మలవిసర్జన సాఫీగా జరగకపోవడం, చికాకు (Irritation), మానసిక ఒత్తిడి (Mental stress) వంటి సమస్యలతో సతమతమవుతారు.
మలబద్ధకం సమస్య నడుము నొప్పి, మొలలు వంటి ఇతర సమస్యలకు దారితీస్తుంది. కనుక మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఫైబర్ (Fiber) అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే శరీరానికి సరిపడు నీటిని సేవించాలి. అప్పుడే జీర్ణప్రక్రియ (Digestion) మెరుగుపడి తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యి మలవిసర్జన సాఫీగా జరుగుతుంది. దీంతో మలబద్దకం సమస్యలు తగ్గుతాయి.
అలాగే భోజనం చేశాక వెంటనే పడుకున్నా, ఎక్కువసేపు కూర్చున్నా ఈ సమస్య ఏర్పడుతుంది. కనుక భోజనం చేశాక పది నిమిషాల పాటు నడక (Walk) తప్పనిసరి. అలాగే రోజువారీ ఆహార జీవనశైలిలో (lifestyle) కొన్ని రకాల పండ్లు, కూరగాయలను, ఆహార పదార్థాలను చేర్చుకుంటే మలబద్ధకం సమస్యలకు దూరంగా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. బీన్స్, బఠాణీ, క్యారెట్, తాజా ఆకుకూరలు వంటి వాటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది.
వీటిని తీసుకుంటే శరీరానికి కావలసిన ఫైబర్ లభించి మలవిసర్జన (Defecation) సాఫీగా జరుగుతుంది. అలాగే పైనాపిల్, బత్తాయి, సపోటా, అరటి పండ్లు, అవకాడో, యాపిల్, జామకాయ వంటి ఇతర పండ్లు మలవిసర్జన సాఫీగా జరిగేందుకు సహాయపడతాయి. డేట్స్, బాదం, ఎండు ద్రాక్ష, ఆప్రికాట్స్, ఫిగ్స్ వంటి డ్రై ఫ్రూట్స్ (Dry Fruits) లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి మలవిసర్జన సాఫీగా జరిగేందుకు సహాయపడతాయి.
అలాగే మొలల వంటి భయంకర సమస్యలను కూడా తగ్గిస్తాయి. అలాగే నీటిశాతం అధికంగా ఉన్న దోసకాయ, పుచ్చకాయ, బొప్పాయి వంటి వాటిని తీసుకుంటే కడుపు శుభ్రపడి మలబద్ధకం సమస్యలు తలెత్తవు. అలాగే నిమ్మకాయను (Lemon) రోజులో ఏదో ఒక విధంగా తీసుకుంటే అజీర్తి (Indigestion), గ్యాస్ వంటి సమస్యలు తగ్గి ఉదరభాగం ఆరోగ్యంగా ఉండడంతో మలవిసర్జన సాఫీగా జరుగుతుంది.
పెరుగు (Yogurt), ఓట్ మీల్, బార్లీ, నానబెట్టిన సబ్జా గింజలు మలబద్ధకం సమస్యను ఎదుర్కోవడానికి సహాయపడతాయి. అలాగే రోజులో చిన్నపాటి వ్యాయామాలు (Exercises) కూడా మలబద్ధకం సమస్యను తగ్గిస్తాయి. ఇలా మన జీవనశైలిలో కొన్ని మార్పులు, ఆహార పదార్థాలు, వ్యాయామాలు మలబద్ధకం సమస్యను తగ్గించడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.