దీపావళి 2023: పండుగ సీజన్ లో హెవీగా తింటే గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలొస్తయ్.. ఇలా చేశారంటే సమస్య మాయం..!
Diwali 2023: ముందే దీపావళి.. ఈ పండగకు పిండివంటలు, స్వీట్లను ఓ పట్టు పట్టకుండా అస్సలు ఉండలేరు. ఇతర రోజుల్లో కంటే పండుగ సమయంలోనే హెవీగా తింటుంటాం. ఎందుకంటే వంటకాలు అలా ఉంటాయి మరి. కానీ హెవీగా తినడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి. అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో వీటిని నిమిషాల్లో తగ్గించుకోవచ్చు.
హిందువుల అతి పెద్ద పండుగైన దీపావళి పండుగ రానే వచ్చేసింది. ఐదు రోజుల పాటు జరిగే ఈ పండుగ ధనత్రయోదశితో ప్రారంభమైంది. దీపాల పండుగే దీపావళి. దీని కోసం చాలా మంది కొన్ని రోజుల ముందు నుంచే అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ఇంటి డెకరేషన్ అయినా, తినే ఆహారాలైనా ఇలా పండుగ కోసం కొన్ని రోజుల ముందే అన్ని సిద్ధం చేసుకుంటారు. అయితే పండుగ వేళ చాలా మంది వారు రెగ్యులర్ గా తినేవాటిని స్కిప్ చేస్తారు. అలాగే అవసరానికి మించి తింటుంటారు.
ఇలా అతిగా తినడం వల్ల మలబద్ధకం, గ్యాస్ వంటి కడుపునకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ఇవి మనల్ని ఎనర్జిటిక్ గా లేకుండా చేస్తాయి. అయితే ఈ సమస్యలను కొన్ని వంటింటి చిట్కాలతో కొన్ని నిమిషాల్లోనే తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటో చూసేద్దాం పదండి.
పుష్కలంగా నీరు తాగాలి
గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు వచ్చినప్పుడు మీరు ముందుగా చేయాల్సిన పని నీటిని పుష్కలంగా తాగడం. అవును నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ మీ శరీరం నుంచి మూత్రం ద్వారా బయటకు పోతాయి. దీంతో సమస్య వెంటనే తగ్గుతుంది.
సోంపు
సోంపు ఆహారాన్ని జీర్ణం చేయడానికి బాగా సహాయపడుతుంది. ఇందుకోసం సోంపును కాసేపు వేయించి గ్రైండ్ చేసుకోండి. దీనిని గోరువెచ్చని నీటిలో కలిపి తాగండి. లేదా అలాగే నమిలి సోంపును తినండి. సోంపు ఎంజైమ్లను తయారు చేయడానికి సహాయపడుతుంది. దీంతో జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది. ఆహారం బాగా జీర్ణమవుతుంది.
నెయ్యి
నెయ్యి ప్రతిఒక్క ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది. నెయ్యి ఒక సహజ భేదిమందు. అంటే నెయ్యిలో బ్యూటిరిక్ ఆమ్లం అనే మూలకం ఉంటుంది. ఇది ప్రేగు కదలిక, మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బెల్లం, వేడినీటితో నెయ్యి కలిపి తింటే త్వరగా ఉపశమనం లభిస్తుంది.
fiber
ఫైబర్
పండగైనా సరే.. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని వీలైనంత ఎక్కువగా తినండి. ఆపిల్, నారింజ, బొప్పాయి, క్యారెట్లు, ముల్లంగి, బ్రోకలీ, చిలగడదుంపలు, బచ్చలికూర, బీన్స్, ఓట్స్, చిరుధాన్యాలు, జొన్న వంటి తృణధాన్యాల్లో ఫైబర్ మెండుగా ఉంటుంది. అందుకే వీటిని ఖచ్చితంగా తినండి. ఫైబర్ తినడం వల్ల మలం మృదువుగా మారుతుంది. మలబద్దకం సమస్య పోతుంది.
ప్రోబయోటిక్స్
పెరుగు వంటి ప్రోబయోటిక్స్ ను తీసుకోవడం వల్ల కూడా మలబద్దకం నుంచి ఉపశమనం పొందొచ్చు. ఎందుకంటే వీటిలో బిఫిడోబాక్టీరియం లాక్టిస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది.