రాత్రి భోజనం చేసిన తర్వాత 2 యాలకులను నమిలితే ఈ సమస్యలన్నీ దూరం
మసాలా దినుసుల్లో యాలకులు ఒకటి. అయితే ఈ యాలకులను ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత నమిలితే నోటి దుర్వాసన పోవడం నుంచి బాగా జీర్ణం అవ్వడం వరకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

యాలకులు
యాలకులు జస్ట్ ఒక మసాలా దినుసే అయినా దీనిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. చాలా మంది వీటిని ఫుడ్ లోనే వాడుతుంటారు.కానీ ఈ యాలకులను ఉపయోగించి మనం ఎన్నో సమస్యలను తగ్గించుకోవచ్చు. నిజం చెప్పాలంటే ఈ మసాలా దినుసు మన ఆరోగ్యానికి ఒక వరం లాంటిదే. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత రెండు యాలకులను నమలడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మెరుగైన జీర్ణక్రియ
ఈ రోజుల్లో చాలా మంది జీర్ణసమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య ఉన్నవారికి యాలకులు మంచి మెడిసిన్ లా పనిచేస్తాయి. మీరు గనుక ప్రతిరోజూ రాత్రి భోజనం చేసిన తర్వాత రెండు యాలకులను నమిలితే జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. యాలకులను నమిలితే తిన్నది అరగడానికి అవసరమైన జీర్ణ ఎంజైమ్లు రిలీజ్ అవుతాయి. దీనివల్ల తిన్నది తొందరగా జీర్ణం అవుతుంది. అలాగే ఎసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
నోటి దుర్వాసన
చెప్పుకోరు కానీ చాలా మందికి నోట్లో నుంచి దుర్వాసన వస్తుంటుంది. ఈ సమస్య నుంచి గట్టెక్కించడానికి కూడా యాలకులు సహాయపడతాయి. మీరు రోజూ తిన్న తర్వాత రెండు యాలకులను నమిలితే నోట్లో నుంచి దుర్వాసన రావడం తగ్గుతుంది. అలాగే మీ శ్వాస ఫ్రెష్ గా ఉంటుంది. యాలకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోట్లో పెరిగే బ్యాక్టీరియాను తొలగిస్తుంది. దీంతో నోట్లో నుంచి దుర్వాసన రావడం తగ్గుతుంది.
నిద్ర సమస్యల నుంచి ఉపశమనం
ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. కానీ కంటినిండా నిద్రలేకపోతే లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే యాలకులు మీకు బాగా నిద్రపట్టడానికి సహాయపడతాయి. రాత్రిపూట భోజనం చేసిన తర్వాత యాలకులను నమిలితే మీ మనస్సు ప్రశాంతంగా అయ్యి నిద్రపడుతుంది. యాలకుల్లో ఉండే కొన్ని సమ్మేళనాలు సెరోటోనిన్ అనే హార్మోన్ ను పెంచి ఒత్తిడిని తగ్గించి నిద్రపట్టేలా చేస్తాయి. కాబట్టి నిద్రలేమి సమస్యలున్నవారికి యాలకులు ప్రయోజనకరంగా ఉంటాయి.
రక్తపోటు నియంత్రణ
అధిక రక్తపోటు ప్రమాదకరమైన సమస్య. ఇది ఎన్నో రోగాలకు దారితీస్తుంది. అందుకే రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి. అయితే బీపీని కంట్రోల్ చేయడానికి యాలకులు బాగా సహాయపడతాయి. ఈ మసాలా దినుసుల్లో ఉండే పొటాషియం, మెగ్నిషియం లు బీపీని కంట్రోల్ చేస్తాయి. మీరు రాత్రిపూట యాలకులను నమిలితే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మీ గుండె హెల్తీగా ఉంటుంది.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది
బరువు తగ్గాలనుకునే వారికి కూడా యాలకులు సహాయపడతాయి. యాలకుల్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ జీవక్రియను పెంచి కేలరీలను కరిగించడానికి సహాయపడతాయి. అంతేకాదు ఇవి శరీరంలోని విషాన్ని బయటకు పంపడానికి కూడా సహాయపడతాయి.