థైరాయిడ్ పేషెంట్లు పాలు తాగొచ్చా?
ప్రస్తుత రోజుల్లో థైరాయిడ్ ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. చాలా మంది చిన్న వయసులోనే థైరాయిడ్ బారినపడుతున్నారు. ఈ సమస్యపై జనాల్లో చాలా సందేహాలు ఉన్నాయి. థైరాయిడ్ ఉంటే ఏం తినాలి? ఏం తినకూడదు? ఏం తాగాలి? ఏం తాగకూడదు? ఇలా అన్ని ప్రశ్నలే. వాటిలో మేజర్ గా వినిపించేది థైరాయిడ్ సమస్య ఉన్నవారు పాలు తాగొచ్చా లేదా అని. దానికి నిపుణులు ఏం సమాధానం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ థైరాయిడ్ బారిన పడుతున్నారు. మన శరీరంలోని థైరాయిడ్ గ్రంథి థైరాయిడ్ హార్మోన్‌ను సరిగ్గా ఉత్పత్తి చేయలేనప్పుడు థైరాయిడ్ సమస్య వస్తుంది. దీనివల్ల అలసట, ఒత్తిడి, ఆందోళన, నిరాశ లాంటి సమస్యలు ఎదురవుతాయి.
ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరి
థైరాయిడ్ సమస్య ఉన్నవారికి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ చాలా అవసరం. ఏం తినాలి? ఏం తినకూడదనే విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి. అయితే చాలా మంది వారికి వారే కొన్ని పదార్థాలు తినడం, తాగడం మానేస్తూ ఉంటారు. ఎక్కువగా పాలు తాగడం ఆపేస్తారు. పాలలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల అది థైరాయిడ్ మందుల ప్రభావాన్ని తగ్గిస్తుందని వారు నమ్ముతుంటారు.
పాలు తాగొచ్చా?
థైరాయిడ్ ఉన్నవారు పాలు తాగడం మంచిది. పాలలో విటమిన్-డి ఉంటుంది. ఇది థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పాలలోని కాల్షియం, ప్రోటీన్, అయోడిన్ థైరాయిడ్ రోగుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. థైరాయిడ్ ఉన్నవారు పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవచ్చు.
ఎప్పుడు తాగకూడదు?
థైరాయిడ్ మందు వేసుకున్న వెంటనే పాలు తాగకూడదు. కనీసం 4 గంటల తర్వాత తాగాలి. పాలు, పాల ఉత్పత్తుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది థైరాయిడ్ మందులపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి థైరాయిడ్ మందు వేసుకునే ముందుగాని తర్వాతగాని పాలు, కాల్షియం ఉన్న ఆహారాలు తినకూడదు.
ఈ రకం పాలు తాగకూడదు
థైరాయిడ్ ఉన్నవారు పాలు తాగడం మంచిదే కానీ, హైపర్ థైరాయిడిజం ఉన్నవారు కొవ్వు ఎక్కువగా ఉన్న పాలు తాగకూడదు. కొవ్వు తక్కువగా ఉన్న పాలు లేదా ఆర్గానిక్ పాలు తాగడం మంచిది.