అరటిపండ్లను తింటే మూత్రపిండాలు దెబ్బతింటాయా?
అరటిపండ్లను తింటే గుండె బలపడుతుంది. తక్షణ శక్తి అందడంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందుతారు. కానీ అరటిపండును రోజూ తినడం సేఫేనా?

banana
ఎలాంటి సమస్య వచ్చినా పండ్లు తినాలని చాలా మంది చెబుతుంటారు. ఎందుకంటే పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెప్తారు. అయితే ప్రతి పండు తన స్వంత ప్రయోజనాలను కలిగి ఉంటుంది. పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు పండ్లను తినాలని సలహానిస్తుంటారు. కానీ కొన్నిసార్లు కొన్ని పండ్లు కూడా ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అందులో అరటిపండు ఒకటి. మోతాదుకు మించి అరటిపండును తింటే ప్రయోజనాలకు బదులుగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అరటిపండును ఒకటి కంటే ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం శరీరానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
banana
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అరటిపండును తింటే మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే కొన్ని సమస్యలు కూడా వస్తాయి. అరటిపండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి మంచిది కాదని వైద్యులు అంటున్నారు. ఇది మూత్రపిండాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.
కిడ్నీ పేషెంట్లు అరటిపండ్లను తినడం పూర్తిగా మానేయాలని డాక్టర్లు చెబుతున్నారు. ఒక మీడియం సైజ్ అరటిపండులో తొమ్మిది శాతం లేదా 422 మిల్లీ గ్రాముల పొటాషియం ఉంటుంది. రక్తంలో పొటాషియం పరిమాణం 3 నుంచి 5 MEQ వరకు మాత్రమే ఉండాలి. ఇది అంతకంటే ఎక్కువగా ఉంటే రక్తంపై చెడు ప్రభావం కూడా పడుతుంది. రోజుకు రెండు కంటే ఎక్కువ మీడియం సైజు అరటిపండ్లను తినకూడదు. ఎందుకంటే మనం రోజంతా బంగాళాదుంపలు, పాలకూర, దానిమ్మ వంటి అనేక ఇతర వస్తువులను తింటాం. వాటిలో పొటాషియం తగిన మోతాదులో ఉంటుంది. శరీరానికి హాని కలగకుండా ప్రతి ఆహార పదార్థాన్ని నిర్ణీత పరిమాణంలోనే తినాలి.
అరటిపండ్లలో ఉండే పోషకాలు
అరటి పండ్లలో కార్బోహైడ్రేట్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి -6, కాల్షియం, సోడియం, ఐరన్, జింక్, పొటాషియం వంటి ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటుగా గ్లూకోజ్, ఫ్రక్టోజ్ కూడా ఉంటాయి. అరటి పండును క్రమం తప్పకుండా తీసుకుంటే మన శరీరానికి ఎన్నో పదార్థాలు అందుతాయి. మీరు కిడ్నీ పేషెంట్ అయితే డాక్టర్ సలహా మేరకు మాత్రమే అరటిపండ్లు తినండి. అది కూడా ఎంత, ఎప్పుడు, ఎలా తినాలో ప్రతీది తెలుసుకోండి.
అరటిపండ్ల వల్ల కలిగే ప్రయోజనాలు
జిమ్, మార్నింగ్ వాక్, వర్కౌట్స్, ఎక్సర్ సైజ్ ల తర్వాత రెగ్యులర్ గా అరటిపండ్లు తినడానికి చాలా మంది ఇష్టపడతారు. ఇందులో విటమిన్ బి6 ఉంటుంది. ఇది శరీర బలాన్ని, మానసిక బలాన్ని పెంచడానికి పని సహాయపడుతుంది. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. వీటితో పాటు బరువు పెరగడం, ఒత్తిడి, నెలసరి నొప్పి, గుండె సమస్యలు, నిద్ర సమస్యలకు అరటి పండు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలంటే ఉదయాన్నే ఏమీ తినకుండా ఆఫీసుకు వెళ్లే వారు అరటిపండ్లను తక్షణ ఆహారంగా తీసుకోవచ్చు. రెండు అరటిపండ్లు తింటే చాలు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.
అరటిపండ్లు ఎవరు తినకూడదు?
ఎసిడిటీ ఉన్నవారు అరటిపండ్లను తినకూడదు.ఎందుకంటే అరటిపండు ఎసిడిటీని పెంచుతుంది. అలాగే గర్భధారణ సమయంలో అరటిపండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల అలర్జీ సమస్యలు వస్తాయి. అరటిపండ్లలో లేటెక్స్ అనే పదార్థాలు ఉంటాయి. ఇవి అలెర్జీలకు కారణమవుతాయి. అరటిపండు పోషకాల నిధి. అయినప్పటికీ గర్భిణులు దీనిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. అరటిపండ్లలో ఉండే ఎక్కువ కేలరీలు బరువు పెరగడానికి కారణమవుతాయి. అందుకే బరువు ఎక్కువున్న వారు వీటిని తినకపోవడమే మంచిది.