ఈ కూరగాయలు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.. రోజూ తింటున్నారా? లేదా?
డ్యాన్స్ చేస్తూ, బైక్ పై వెళుతూ, రోడ్డుపై నడుస్తూ, వ్యాయామం చేస్తూ కుప్పకూలి గుండెపోటుతో ప్రాణాలు విడుస్తున్నవారిని రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం.. ఏదేమైనా ఇలాంటి ఘటనలు మనల్ని హెచ్చరిస్తున్నట్టే.. గుండె ఆరోగ్యం పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మనకు కూడా అలాంటి పరిస్థితి ఎదురుకావొచ్చంటున్నారు నిపుణులు.

heart health
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది చనిపోవడానికి గుండె జబ్బులే ప్రధాన కారణమంటున్నాయి సర్వేలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఇది సంవత్సరానికి 17 మిలియన్లకు పైగా మరణాలకు కారణమవుతోంది. అయితే మొక్కల ఆధారిత జీవనశైలిని అవలంబించడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎలాంటి శాకాహార ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆకుపచ్చ కూరగాయలు
ఆకుపచ్చ కూరగాయలు గుండెను ఆరోగ్యంగా ఉంచే విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలతో నిండి ఉంటాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి మన శరీరాన్ని రక్షిస్తాయి. కాలే, బచ్చలికూర వంటి ఆకుపచ్చ కూరగాయలలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.
బెర్రీలు
బెర్రీలు తీయగా, టేస్టీగా ఉండటమే కాదు వీటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ పండ్లలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు వంటి బెర్రీలలో ఆంథోసైనిన్లు ఉంటాయి. ఇవి పండ్లకు రంగులను ఇచ్చే వర్ణద్రవ్యాలు. ఈ వర్ణద్రవ్యాలు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా కూడా పనిచేస్తాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడతాయి. ఈ మంట గుండె జబ్బులకు కూడా దారితీస్తుంది.
ఓట్స్
ఓట్స్ లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. వీటిలో బీటా-గ్లూకాన్ అని పిలువబడే ఒక రకమైన ఫైబర్ కూడా ఉంటుంది. ఇది గట్ లో మందపాటి జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది. అలాగే శరీరంలోని అనవసరమైన కొలెస్ట్రాల్ నుు తొలగిస్తుంది. మీ ఆహారంలో ఓట్స్ ను చేర్చడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చెడు కొలెస్ట్రాల్ గుండె జబ్బులకు దారితీస్తుంది.
Image: Getty Images
చిక్కుళ్లు
చిక్పీస్, కాయధాన్యాలు, బీన్స్ వంటి చిక్కుళ్లు మొక్కల ఆధారిత ప్రోటీన్ కు గొప్ప వనరు. వీటిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. చిక్కుళ్లలో మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. రక్తపోటు ఎక్కువగా ఉంటే గుండె జబ్బులు వస్తాయి.
Image: Getty Images
గింజలు, విత్తనాలు
గింజలు, విత్తనాల్లో మోనోశాచురేటెడ్, పాలీఅన్శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిలో ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. బాదం, వాల్ నట్స్, చియా విత్తనాలు, అవిసె గింజలు వంటి గింజలు, విత్తనాలలో యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడానికి బాగా సహాయపడతాయి.