కాసేపు ఎండలో కూర్చుంటే ఇన్ని లాభాలున్నాయా?
చలికాలంలో ఉదయాన్నే ఎండలో కూర్చుంటే వెచ్చగా ఉంటుంది. ఇది చలి నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చలికాలంలో చలి నుంచి తమను తాము రక్షించుకోవడానికి దినచర్యలో ఎన్నో మార్పులు చేసుకుంటారు. ఈ సీజన్ లో ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం, దుస్తుల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. వీటన్నిటితో పాటుగా చలికాలంలో జనాలు తరచుగా ఎండను ఆస్వాదిస్తూ కనిపిస్తారు. వణికించే చలిలో కాసేపు ఎండలో కూర్చుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఇది చలినుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
గుండెకు మేలు
సూర్యరశ్మి నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే మీ మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తోడ్పడుతుంది.
మానసిక స్థితి మెరుగు
సూర్యరశ్మి న్యూరోట్రాన్స్మిటర్ విడుదలను ప్రేరేపిస్తుంది. ఇది ఆనందం, మంచి భావాలను పెంచడానికి దోహదం చేస్తుంది. ఈ విధంగా సన్ బాత్ మీ మానసిక స్థితిని మెరుగుపరచడానికి ఎంతగానో సహాయపడుతుంది.
విటమిన్ డి
మనం ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్ డి చాలా చాలా అవసరం. ఈ విటమిన్ డి మన ఎముకలను, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.కాగా చలికాలంలో సూర్యరశ్మి మీ శరీరం విటమిన్ డి ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఇది బలమైన ఎముకలు, ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థ, మంచి మానసిక స్థితికి అవసరం.
మంచి నిద్ర
ఉదయం సూర్యుడి సహజ కాంతిలో కాసేపు కూర్చోవడం వల్ల మీ శరీరం అంతర్గత గడియారం నియంత్రణలో ఉంటుంది. ఇది మీరు రాత్రిళ్లు ప్రశాంతంగా పడుకోవడానికి సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తి
సూర్యరశ్మి నుంచి వచ్చే విటమిన్ డి మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే మీ శరీరం సంక్రమణతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది మిమ్మల్ని ఎన్నో రోగాలకు దూరంగా కూడా ఉంచుతుంది.
ఆరోగ్యకరమైన చర్మానికి అవసరం
సూర్యరశ్మిలో కాసేపు కూర్చోవడం వల్ల శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మ సమస్యలను తగ్గిస్తుంది. అలాగే మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఎనర్జీ లెవల్స్ ని పెంచుతుంది
చలికాలలో తరచుగా సోమరిగా, బద్ధకంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో.. మీరు కాసేపు సూర్యరశ్మిలో ఉండటం వల్ల మీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే అలసట భావన నుంచి ఉపశమనం కలిగిస్తుంది.