తిన్న ఫుడ్ మంచిగా అరగాలంటే వీటిని తాగితే చాలు!
ఆరోగ్యంగా ఉండడానికి ఫుడ్ తీసుకోవడం ఎంత ముఖ్యమో.. అది సరిగ్గా జీర్ణం కావడం కూడా అంతే ముఖ్యం. రోజూ ఉదయాన్నే కొన్ని డ్రింక్స్ తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అవేంటో ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

నిమ్మరసం, తేనె వాటర్
నిమ్మరసం, తేనె రెండూ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. తేనె యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. గోరువెచ్చని నీటిలో సగం చెక్క నిమ్మరసం, ఒక స్పూన్ తేనె కలిపి తాగండి. ఈ డ్రింక్.. జీర్ణ ఎంజైమ్‌లను, కాలేయ పనితీరును ప్రేరేపిస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
దోసకాయ, పుదీన వాటర్
దోసకాయలో విటమిన్లు, ఖనిజాలు, పొటాషియం ఉంటుంది. పుదీనా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. దోసకాయ ముక్కలను, తాజా పుదీనా ఆకులను ఒక గ్లాస్ వాటర్ లో వేసి కనీసం గంటపాటు నానబెట్టి తాగాలి. దోసకాయ, పుదీన వాటర్ శరీరానికి తగినంత నీటిని అందించడంతో పాటు కడుపులో మంట వంటి సమస్యలను తగ్గిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
ఆపిల్ సైడర్ వెనిగర్, తేనె
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఫిల్టర్ చేయని ఆపిల్ సైడర్ వెనిగర్, ఒక టీస్పూన్ తేనె కలిపి తాగాలి. ఈ డ్రింక్ రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. భోజనానికి 15-20 నిమిషాల ముందు తాగితే మంచిది.
అల్లం, లెమెన్ టీ
అల్లం, లెమెన్ టీ.. బరువు, ఒత్తిడి తగ్గడానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి సహాయపడుతుంది. కొన్ని అల్లం ముక్కలను 10 నిమిషాలపాటు నీటిలో మరగనివ్వాలి. తర్వాత కొద్దిగా నిమ్మరసం, తేనె కలపాలి. ఈ మిశ్రమం తాగడం ద్వారా కడుపులో మంట, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.
అలొవెరా, నిమ్మరసం
అలొవెరా, నిమ్మరసం జీర్ణక్రియకు సహాయపడతాయి. అలొవెరా యాంటీ ఇన్ఫ్లమేటరి లక్షణాలను కలిగి ఉంటుంది. నిమ్మరసం జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్ ల ఉత్పత్తిని పెంచుతుంది. ఒక గ్లాసు నీటిలో తాజా కలబంద గుజ్జు, కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకుంటే సరిపోతుంది.
సోంపు వాటర్
ఒక టేబుల్ స్పూన్ సోంపును ఒక గ్లాసు నీటిలో ముందురోజు రాత్రి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే వడకట్టి తాగాలి. సోంపు ఉబ్బరం, తిమ్మిరిని తగ్గిస్తుంది. ఇది పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది.
గ్రీన్ స్మూతీ
గ్రీన్ స్మూతీలు విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. జీర్ణక్రియకు సహాయపడతాయి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, నీరు, పాలు, పెరుగు వంటి వాటితో గ్రీన్ స్మూతీ తయారు చేసుకోవచ్చు.
పసుపు నీళ్లు
పసుపు నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. అర టీస్పూన్ పసుపును ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో వేసి బాగా కలిపి తాగాలి. పసుపు శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ వాటర్ తాగడం ద్వారా గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.