వీళ్లు పొరపాటున కూడా బ్రెడ్ తినకూడదు.. ఎందుకో తెలుసా?
చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు బ్రెడ్ ని చాలామంది ఇష్టంగా తింటారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా, లేదా స్నాక్స్ గా బ్రెడ్ ని తింటుంటారు. కానీ కొన్ని సమస్యలున్నవారు బ్రెడ్ తినడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదో ఇక్కడ చూద్దాం.

బ్రెడ్ ఎవరు తినకూడదు?
బ్రెడ్ మన రోజువారీ ఆహారంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్, సాయంత్రం స్నాక్స్ ఇలా అన్ని వేళలా బ్రెడ్ ని తింటున్నాము. గోధుమలతో చేసిన బ్రెడ్‌లో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు ఉంటాయి. అవి జీర్ణక్రియను సక్రమంగా ఉంచడానికి, శరీరానికి శక్తిని అందించడానికి సహాయపడతాయి. కానీ వైట్ బ్రెడ్‌లో ఫైబర్ తక్కువగా, చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల అది బరువు పెరిగేలా చేస్తుంది. బ్రెడ్ లో ఉండే అధిక కార్బోహైడ్రేట్లు కొందరిలో అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. కాబట్టి బ్రెడ్ ఎవరు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
డయాబెటిస్ ఉన్నవారు
మధుమేహం ఉన్నవారు బ్రెడ్ తినకపోవడమే మంచిది. సాధారణంగా మార్కెట్లో దొరికే వైట్ బ్రెడ్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది. దీని వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉండదు. గోధుమ బ్రెడ్ లేదా మల్టీగ్రేన్ బ్రెడ్ ఆరోగ్యకరంగా అనిపించినా, వాటిలో కూడా ఎక్కువ మైదా లేదా గ్లూటెన్ ఉంటే, రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగవచ్చు. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ సలహా ప్రకారం మాత్రమే బ్రెడ్ తీసుకోవాలి.
బరువు తగ్గడానికి ట్రై చేసేవారు
ఊబకాయం లేదా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారు కూడా బ్రెడ్‌ను తినకపోవడం మంచిది. బ్రెడ్‌లో ఉన్న రిఫైన్‌డ్ కార్బోహైడ్రేట్స్ శరీరంలో త్వరగా చక్కెరగా మారి కొవ్వుగా నిల్వ ఉంటాయి. వైట్ బ్రెడ్ లేదా సాఫ్ట్ బన్‌లలో ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అవి తిన్న వెంటనే మళ్లీ ఆకలి వేస్తుంది. ఫలితంగా మరింత తినాల్సి వస్తుంది. ఆటోమెటిక్ గా బరువు పెరుగుతారు.
గుండె సమస్యలు
గుండె సమస్యలు లేదా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు కూడా బ్రెడ్‌ను మితంగా తినడం మంచిది. చాలా బ్రెడ్‌లలో ట్రాన్స్ ఫ్యాట్స్ లేదా హై ఫ్రక్టోజ్ సిరప్ వంటివి ఉంటాయి. ఇవి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. ప్రత్యేకించి ప్యాక్డ్ బ్రెడ్‌లలో ఎక్కువకాలం నిల్వ ఉండటానికి కొన్ని రసాయనాలను కలుపుతుంటారు. ఇవి హార్మోన్‌లపై ప్రభావం చూపవచ్చు.
సెలియాక్ వ్యాధి ఉన్నవారు
సెలియాక్ వ్యాధి లేదా గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్నవారు బ్రెడ్ తినడం పూర్తిగా మానుకోవాలి. గోధుమ పిండిలో ఉండే గ్లూటెన్ అనే ప్రోటీన్ ఈ వ్యాధితో బాధపడుతున్న వారి శరీరంలో చిన్న ప్రేగులను దెబ్బతీస్తుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు, పొట్ట నొప్పి, గ్యాస్, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనపడతాయి. గ్లూటెన్ లేకుండా తయారు చేసిన స్పెషల్ బ్రెడ్‌లు మార్కెట్లో దొరుకుతాయి. కానీ అవి కూడా అందరికీ పడకపోవచ్చు.