మడమ నొప్పికి కారణాలెన్నో.. లైట్ తీసుకున్నారో మీ పని అంతే..!
మన శరీరం మొత్తం బరువు మన చీలమండలపై ఉంటుంది. మనం కుర్చీలో కూర్చున్నా మన శరీర సమతుల్యతను కాపాడటానికి చీలమండలు పనిచేస్తాయి. అసలు మడమ నొప్పి ఎందుకు కలుగుతుందో తెలుసా?

కొన్ని సార్లు ఎక్కువసేపు నిలబడటం, ఎక్కువ దూరం నడవడం వల్ల మడమల్లో నొప్పి వస్తుంది. సాధారణంగా ఇలాంటి నొప్పి రెస్ట్ తర్వాత తగ్గిపోతుంది. కానీ కొంతమందికి రెస్ట్ తీసుకున్నా, రాత్రి నిద్రపోయిన తర్వాత కూడా మరుసటి రోజు ఉదయాన్నే మడమల నొప్పులు వస్తుంటాయి. దీనిని ప్రమాదకరమైన సమస్యగా భావించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మడమ నొప్పి దీర్ఘకాలిక రన్నింగ్ వల్ల వస్తుంది. కానీ ఈ నొప్పి ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులను సూచిస్తుంది. ఉదయం నిద్రలేచిన తర్వాత కూడా నొప్పి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. అసలు ఈ నొప్పికి కారణాలేంటంటే..
ప్లాంటార్ ఫాసిటిస్
మడమ నొప్పి ప్లాంటార్ ఫాసిటిస్ వల్ల కూడా వస్తుంది. ఈ సమస్య వల్ల ఉదయం నిద్ర లేచిన తర్వాత, ఎక్కువసేపు కూర్చున్న తర్వాత లేదా ఎక్కువసేపు నిలబడిన తర్వాత మడమలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. ఈ నొప్పి భరించలేని విధంగా వస్తుంది. ఇది మీ మొత్తం దినచర్యను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ నొప్పి కొన్ని రోజుల్లోనే తగ్గుతుంది. ఒకవేళ తగ్గకపోతే వెంటనే హాస్పటల్ కు వెళ్లడం మంచిది. లేదంటే ఇది భరించలేని విధంగా మారుతుంది. జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ మెడికల్ సైన్స్ లో ప్రచురితమైన కిబ్లెర్ ఎల్ టిఎల్ అధ్యయనం ప్రకారం.. కండరాలు బిగుసుకుపోవడం వల్ల నొప్పి ఎక్కువగా ఉంటుంది.
యూరిక్ యాసిడ్ పెరగడం
మడమ నొప్పికి ఎన్నో కారణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వీటిలో యూరిక్ యాసిడ్ సమస్య కూడా ఉంది. శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు మడమలో నొప్పి పెరుగుతుంది.
కిడ్నీ రోగుల్లో యూరిక్ యాసిడ్ సమస్య ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కృత్రిమ ప్రోటీన్ సప్లిమెంట్లు, మాంసాహార ప్రోటీన్ ను తీసుకోవడం వల్ల యూరిక్ ఆమ్లం పెరుగుతుంది. వీటితో పాటు మాంసం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ కూడా పెరుగుతుంది. దీని వల్ల అరికాళ్లలో చాలా చోట్ల వ్యర్థ పదార్థాలు పేరుకుపోతాయి. ఇది మడమలో నొప్పిని పెంచుతుంది. ప్రోటీన్ ను తీసుకోవడాన్ని తగ్గిస్తే ఈ సమస్యను నివారించొచ్చు. మడమ నొప్పికి అధిక ప్రోటీన్ ప్రధాన కారణాలలో ఒకటి.
కఫ్ కండరాల బిగుతు
మడమల నొప్పికి కఫ్ కండరాలు బిగుసుకుపోవడం కూడా ఒక కారణమే. కఫ్ కండరాలు బిగుసుకుపోవడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. అరికాళ్లు బిగుసుకుపోవడం, హై హీల్స్ ను వేసుకోవడం, ఒకే చోట కూర్చోవడం వంటివి దీనికి కారణాలు. కఫ్ కండరాలు అరికాళ్ళలోని కణజాలాలు, కండరాలతో కలిసి ఉంటాయి. వారిపై ఒత్తిడి పెరిగినప్పుడు ఈ నొప్పి కలుగుతుంది. మడమలో నొప్పి పెరగడం వల్ల నడవడానికి ఇబ్బంది కలుగుతుంది. అయితే కొన్ని స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. మడమల నొప్పులు పోవాలంటే వాటిని సాగదీయాలి.
ఇందుకోసం మెట్లపై కాలి వేళ్లతో నిలబడి, మడమను పైకి లాగండి. ఈ ప్రక్రియను 25 నుంచి 30 సార్లు చేయండి.