TV Shape: టీవీలు ఇదే ఆకారంలో ఎందుకు ఉంటాయి.? అసలు లాజిక్ ఏంటంటే..
TV Shape: టీవీలు ఏ ఆకారంలో ఉంటాయి.? అదేం ప్రశ్న. ఏ టీవీ అయినా ఉండేది రెక్టాంగిల్ షేప్‌లోనే ఉంటాయి అంటారా.? అయితే టీవీలు ఇదే షేప్‌లో ఎందుకు ఉంటాయని ఎప్పుడైనా ఆలోచించారా.?

టీవీ ఎప్పుడూ చతురస్రంలోనే ఎందుకు ఉంటుంది?
టీవీ మన రోజువారీ జీవితంలో భాగమైపోయింది. వార్తలు, సినిమాలు, సీరియల్స్, క్రీడలు… అన్నీ టీవీ ద్వారానే చూస్తున్నాం. అయితే ఒక విషయం మీరు గమనించారా? టీవీ ఆకారం ఎప్పుడూ చతురస్రం లేదా ఆయతాకారంలోనే (నాలుగు మూలలు 100 డిగ్రీల కోణంలో ఉంటాయి) ఉంటుంది. గుండ్రంగా లేదా త్రిభుజంగా ఎందుకు ఉండదు? దీనికి స్పష్టమైన కారణాలే ఉన్నాయి.
టీవీ కంటెంట్‌కి సరిపోయే ఆకారం
టీవీలో ప్రసారం అయ్యే వీడియోలు ప్రత్యేక నిష్పత్తిలో తయారవుతాయి. ప్రస్తుతం ఎక్కువగా వాడే నిష్పత్తి 16:9. ఈ నిష్పత్తి ఆయతాకార స్క్రీన్‌కు పూర్తిగా సరిపోతుంది. సినిమా, టీవీ షోలు, న్యూస్ ఛానల్స్ అన్నీ ఇదే ఫార్మాట్‌లో రూపొందుతాయి. టీవీ ఆకారం మారితే వీడియో పూర్తి స్థాయిలో కనిపించదు.
16:9 నిష్పత్తి ఎలా వచ్చింది?
1950 నుంచి 1980 మధ్యకాలంలో టీవీల్లో 4:3 నిష్పత్తి వాడేవారు. అప్పటి కంటెంట్ కూడా అదే విధంగా తయారయ్యేది. తర్వాత టెక్నాలజీ మారింది. స్క్రీన్ పెద్దదైంది. సినిమా అనుభూతి ఇంట్లోనే రావాలనే ఉద్దేశంతో 16:9 నిష్పత్తిని తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటివరకు టీవీ సైజ్ ఎంత పెరిగినా ఈ నిష్పత్తి మారలేదు.
గుండ్రం లేదా ట్రై యాంగిల్ అయితే ఏమవుతుంది.?
టీవీ గుండ్రంగా లేదా త్రిభుజంగా ఉంటే కంటెంట్ సగం కట్ అయిపోతుంది. వీడియో మూలలు కనిపించవు. చూడటానికి అసౌకర్యంగా ఉంటుంది. 1950లలో CRT టీవీలు బయటకు గుండ్రంగా కనిపించినా లోపల డిస్‌ప్లే మాత్రం ఆయతాకారంగానే ఉండేది. టెక్నాలజీ అభివృద్ధి కావడంతో బయట స్క్రీన్ కూడా ఆయతాకారంగా మారింది.
మన మెదడు అలవాటు పడిన ఆకారం
మన చుట్టూ ఉన్న ఫోటో ఫ్రేములు, మొబైల్ స్క్రీన్, ల్యాప్‌టాప్, కిటికీలు… అన్నీ ఎక్కువగా ఆయతాకారంలోనే ఉంటాయి. మన మెదడు కూడా ఈ ఆకారానికి అలవాటు పడిపోయింది. LCD, LED టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ ఆకారంలో స్క్రీన్ తయారు చేయడం సులభమైంది. తక్కువ స్థలం తీసుకుంటుంది. కళ్లకు ఇబ్బంది కలగదు. అందుకే టీవీకి ఇదే ఆకారం స్థిరపడిపోయింది. టీవీ చతురస్రం ఆకారంలో ఉండటానికి కారణం కేవలం డిజైన్ కాదు. కంటెంట్ ఫార్మాట్, టెక్నాలజీ సౌలభ్యం, మన మెదడు అలవాట్లు… అన్నీ కలిసి ఈ ఆకారాన్ని నిర్ణయించాయి.

