బంగారం, వెండి కొనడం ఆపేయండి.. భవిష్యత్తులో ఇక మెటల్‌దే హవా
Copper Price: బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. దీంతో చాలా మంది వీటిపై పెట్టుబడి పెడుతున్నారు. అయితే ఈ రెండింటితో పాటు మరో మెటల్ ధరలు కూడా పెరగనున్నాయని నిపుణులు అంటున్నారు.

బంగారం తర్వాత ఇప్పుడు రాగి హవా
విలువైన లోహాలు అనగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేవి బంగారం, వెండి. ఈ రెండింటిపైనే పెట్టుబడిదారుల దృష్టి ఎక్కువగా ఉంటోంది. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. తాజాగా రాగి ధరలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కాపర్ ధర 12,000 డాలర్ల స్థాయిని దాటడం విశేషంగా మారింది. దీంతో రాగి కూడా విలువైన లోహాల జాబితాలో కీలక స్థానానికి చేరుతోంది.
2025లో లోహాల ధరల పెరుగుదల ఎలా ఉంది?
2025 సంవత్సరంలో బంగారం ధర దాదాపు 70 శాతం పెరిగింది. వెండి ధర అయితే ఆశ్చర్యకరంగా 140 శాతం ఎగబాకింది. ఇదే సమయంలో రాగి ధర 35 శాతం పెరగడం మార్కెట్ నిపుణులను ఆలోచనలో పడేసింది. 2009 తర్వాత ఇంత భారీగా కాపర్ ధర పెరగడం ఇదే మొదటిసారి. ఈ కారణంగానే కొందరు నిపుణులు రాగిని “కొత్త బంగారం”, “కొత్త వెండి”గా అభివర్ణిస్తున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ ఎనర్జీ ప్రభావం
రాగికి డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణం టెక్నాలజీ రంగం. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో కాపర్ వినియోగం భారీగా పెరిగింది. ఒక ఎలక్ట్రిక్ కారులో సాధారణ కారుతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ రాగి అవసరం అవుతోంది. డేటా సెంటర్లు, సౌర విద్యుత్ ప్రాజెక్టులు, విండ్ ఎనర్జీ ప్లాంట్లు కూడా రాగిపై ఆధారపడుతున్నాయి. గ్రీన్ ఎనర్జీ వైపు ప్రపంచం అడుగులు వేస్తుండటంతో రాగి ప్రాధాన్యం మరింత పెరిగింది.
భౌగోళిక రాజకీయాలు, అమెరికా సుంకాల ప్రభావం
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు రాగి మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. కొన్ని దేశాల్లో గనుల కార్యకలాపాలు మందగించడం సరఫరాపై ఒత్తిడిని పెంచింది. దీనికి తోడు అమెరికా విధించిన సుంకాలు కూడా కీలకంగా మారాయి. భవిష్యత్తులో ధరలు ఇంకా పెరుగుతాయన్న అంచనాలతో పెట్టుబడిదారులు రాగిని నిల్వ చేసుకోవడం మొదలుపెట్టారు. దీని వల్ల మార్కెట్లో అందుబాటులో ఉన్న సరఫరా తగ్గింది.
ఉత్పత్తి తగ్గుదల, పెట్టుబడిదారుల ఆసక్తి
రాగి ఉత్పత్తి ఖర్చులు పెరగడం కూడా మరో సమస్యగా మారింది. కొత్త గనులు ప్రారంభించేందుకు అనుమతులు ఆలస్యం కావడం, పర్యావరణ నిబంధనలు కఠినంగా మారడం ఉత్పత్తిని పరిమితం చేస్తున్నాయి. అదే సమయంలో పెట్టుబడిదారులు రాగిని భవిష్యత్తు లోహంగా చూస్తూ పెట్టుబడులు పెడుతున్నారు. డిమాండ్ వేగంగా పెరుగుతుండగా సరఫరా అంతగా పెరగకపోవడంతో ధరలు పైకి ఎగబాకుతున్నాయి.

