మొత్తం గుడ్డు తినాలా? లేకపోతే ఓన్లీ ఎగ్ వైట్ నే తినాలా?
గుడ్డు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అయితే కొంతమంది ఒక గుడ్డు తిన్నా.. దాంట్లో ఎల్లోను అస్సలు తినరు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఒక గుడ్డును మొత్తం తినాలా? లేకపోతే ఓన్లీ తెల్ల సొననే తినాలా? తెలుసుకుందాం పదండి.
రోజూ ఒక గుడ్డును తింటే మన ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు. ఎందుకంటే గుడ్డులో ఉండే రకరకాల ప్రోటీన్లు, విటమిన్లు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయినప్పటికీ.. గుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్, కొవ్వులు ఎక్కువ మొత్తంలో ఉంటాయి, అందుకే చాలా మంది గుడ్డులోని పచ్చసొనను పారేస్తుంటారు.
గుడ్డులో పచ్చసొన కంటే తెల్లసొనే మన ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది. ఎందుకంటే దీనిలో కొవ్వులు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటాయి. అలాగే కేలరీలు కూడా తక్కువ మొత్తంలో ఉంటాయి. పోషకాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి.
గుడ్డు తెల్లసొన తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
1. కేలరీలు తక్కువగా ఉంటాయి
ఒకగుడ్డులో తెల్లసొన 90 శాతం నీటితో తయారవుతుంది. దీనిలో కేలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. ఒక పెద్ద సైజు గుడ్డు తెల్లసొనలో 17 కేలరీలు మాత్రమే ఉంటాయి. కాగా దీనిలో కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉండవు. కాబట్టి మీరు వెయిట్ లాస్ అవుదామనుకుంటే ఎగ్ వైట్ ఆమ్లెట్ లేదా ఎగ్ వైట్ బ్రేక్ ఫాస్ట్ ను తినండి.
2. ప్రోటీన్
ఎగ్ వైట్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ ప్రోటీన్ మాత్రం పుష్కలంగా ఉంటుంది. ఒక పెద్ద సైజు గుడ్డు తెల్లసొనలో 4 గ్రాముల ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, ఇది మొత్తం గుడ్డులోని ప్రోటీన్ లో 67 శాతం.
దీనిలో మీ శరీరానికి అవసరమైన తొమ్మిది అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. అందుకే దీన్ని తింటే మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. కండరాలను నిర్మించడానికి కూడా ఇది మీకు సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఫుడ్ అనే చెప్పాలి.
3. కొలెస్ట్రాల్ ఫ్రీ
ఎగ్ వైట్ లో కొలెస్ట్రాల్, కొవ్వు అసలే ఉండదు. అందుకే ఇది గుండెకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే గుడ్డు పచ్చసొనలో మాత్రం కొవ్వులు, కొలెస్ట్రాల్ ఉంటాయి. ఎగ్ వైట్ లో కొవ్వు మొత్తమే ఉండదు.
4. పొటాషియం
ఒక పెద్ద సైజు ఎగ్ వైట్ లో 54 మి.గ్రా పొటాషియం ఉంటుంది. ఇది గుండెను, ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే మొత్తం శరీర పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది బీపీని నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది.
రోజుకు ఎన్ని ఎగ్ వైట్లు తినాలి?
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. రోజుకు రెండు గుడ్ల తెల్ల సొనను తినొచ్చు. అయితే ఇది మీరు ఆ రోజు ఏం తినాలనుకుంటున్నారు?ఆ ఆహారం పోషక కూర్పుపై ఆధారపడి ఉంటుంది. అలాగే మొత్తం గుడ్ల మాదిరిగానే గుడ్డులోని తెల్లసొనను కూడా సరిగ్గా ఉడికించి తినాలి.
గుడ్డు తెల్లసొన దుష్ప్రభావాలు
ఎగ్ వైట్ కొవ్వు లేదా కార్బోహైడ్రేట్లు లేని ప్రోటీన్ వనరు. అయినప్పటికీ దీన్ని మోతాదులోనే తినాలి. కొన్నిసార్లు ఈ ప్రోటీన్లు అలెర్జీకి కారణమవుతాయి.
అలాగే ఎగ్ వైట్ ను బాగా ఉడికించి తినకపోతే ఫుడ్ పాయిజనింగ్ కు కారణమవుతుంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. తెల్లసొనను ద్రవం నుంచి మొత్తం ఘనపదార్థాలకు మార్చే స్థాయికి వండటం ఫుడ్ పాయిజనింగ్ ను నివారించడంలో సహాయపడుతుంది.
గుడ్డులోని తెల్లసొన తినడం వల్ల వచ్చే మరో సమస్య ఏంటంటే? దీనిలో అవిడిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది మన శరీరంలో నీటిలో కరిగే విటమిన్ బయోటిన్ శోషణను నిరోధిస్తుంది. కానీ ఇలా చాలా తక్కువ సార్లు జరుగుతుంది.
గుడ్డులోని తెల్లసొన వర్సెస్ మొత్తం గుడ్లు: ఏం తినాలి?
మొత్తం గుడ్డు తినాలా? లేకపోతే ఓన్లీ ఎగ్ వైట్ నే తినాలా? అనేది మీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే మాత్రం ఓన్లీ ఎగ్ వైట్ ను మాత్రమే తినండి. ఇకపోతే మొత్తంలో గుడ్డులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. గుడ్డు పచ్చసొనలో యాంటీఆక్సిడెంట్లు - లుటిన్, జియాక్సంతిన్ ఉన్నాయి.
ఇవి వయస్సు-సంబంధిత కంటి సమస్యలను, కంటిశుక్లం వంటి సమస్యలు రాకుండా కాపాడుతాయి. ఆప్తాల్మాలజీ & విజువల్ సైన్స్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. గుడ్డు పచ్చసొనలో విటమిన్ ఎ, విటమిన్ బి 12, విటమిన్ బి 2, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి.
ఎగ్ వైట్ లోకేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. వీటిలో కొవ్వులు లేదా కొలెస్ట్రాల్ ఉండవు, అయితే రోజుకు రెండు కంటే ఎక్కువ ఎగ్ వైట్ లను తినకూడదు.