Ridge Gourd: వర్షాకాలంలో బీరకాయ తింటే ఏమౌతుంది?
బీరకాయలతో రకరకాల కూరలను చేసుకోవచ్చు. ఈ కూరగాయతో చేసిన ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. కానీ దీన్ని వానాకాలంలో తింటే ఏమౌతుందో తెలుసా?

బీరకాయ
ఎండాకాలం, చలికాలంతో పోలిస్తే వానాకాలంలోనే మనకు లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే ఈ సీజన్ లో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు. ముఖ్యంగా ఈ సీజన్ లో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చల్లగా ఉందని వేడివేడిగా ఏవి పడితే అవి తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. నిజానికి ఏ కాలంలో అయినా కూరగాయలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి తింటే మన ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు. అయితే వర్షాకాలంలో చాలా మంది కొన్ని కూరగాయల్ని పక్కన పెట్టేస్తుంటారు. కూరగాయల్లో బీరకాయ ఒకటి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. వర్షాకాలంలో బీరకాయను తింటే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వర్షాకాలంలో బీరకాయను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
వర్షాకాలంలో బీరకాయను ఎలాంటి భయం లేకుండా తినచ్చు. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ కూరగాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది
బీరకాయ మీరు హెల్తీగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఎలా అంటే ఈ కూరగాయలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఫైబర్ మెండుగా ఉంటుంది. ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉందన్న భావనను కలిగిస్తుంది. దీనివల్ల మీరు ఈజీగా బరువు తగ్గుతారు.
ఇమ్యూనిటీ పెరుగుతుంది
బీరకాయలో రకరకాల విటమిన్లతో పాటుగా విటమిన్ సి కూడా మెండుగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి దీన్ని వానాకాలంలో తింటే మీ ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. దీంతో మీరు వానాకాలంలో దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటారు.
బ్లడ్ షుగర్ తగ్గుతుంది
డయాబెటీస్ పేషెంట్లకు బీరకాయ ఎంతో మేలు చేస్తుంది. వర్షాకాలంలో బీరకాయను తినడం వల్ల మీ శరీరంల ఇన్సులిన్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి షుగర్ పేషెంట్లు వానాకాలంలో బీరకాయను తినొచ్చు.
హిమోగ్లోబిన్ స్థాయిలు
బీరకాయ కూరను తింటే హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఈ కూరగాయలో ఇనుము పుష్కలంగా ఉంటుంది. ఇది మీ శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ ను పెంచడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చర్మానికి మేలు
బీరకాయను తింటే మన చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ కూరగాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరాన్ని చల్లబరచడానికి సహాయపడుతుంది. అలాగే మన చర్మానికి మంచి మేలు చేస్తుంది. బీరకాయను తింటే కొన్ని చర్మ సమస్యలు కూడా తగ్గిపోతాయి.
అపానవాయువు సమస్య
బీరకాయ వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా దీన్ని తక్కువ మోతాదులో తినడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఎక్కువగా తింటే అపానవాయువు (పిత్తులు) సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు.