ఉదయాన్నే అరటి పండ్లు తింటే ఏమౌతుంది?
అరటిపండ్లు మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తింటే వెంటనే ఎనర్జీ అందడంతో పాటుగా హెల్తీగా ఉంటారు. మరి ఈ అరటిపండ్లను ఉదయాన్నే తినడం మంచిదా? కాదా? ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పండ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ప్రతిరోజూ రెండు మూడు రకాల పండ్లను తింటే మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా అందుతాయి. దీంతో పోషకాల లోపం అసలే ఉండదు. మనల్ని ఆరోగ్యంగా ఉంచే పండ్లలో అరటి ఒకటి. చాలా మంది అరటిపండ్లను ప్రతిరోజూ తింటుంటారు. ఈ అరటిపండ్లు తక్కువ ధరే కాబట్టి వీటిని వారానికి సరిపడా కొని తింటుంటారు.
అరటిపండును కాలాలతో సంబంధం లేకుండా ఎప్పుడైనా తినొచ్చు. దీన్ని తింటే శరీరానికి వెంటనే బలం వస్తుంది. బాడీ హెల్తీగా ఉంటుంది. అయితే రాత్రిళ్లు మన మెటబాలిజం తక్కువగా ఉంటుంది. కాబట్టి అరటిపండ్లను ఉదయాన్నే తినడం మంచిదంటారు ఆరోగ్య నిపుణులు. మరి ఉదయాన్నే అరటిపండ్లను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పోషకాలు
అరటి పండ్లలో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఫ్రక్టోజ్, సుక్రోజ్, గ్లూకోజ్ వంటి సహజ చక్కెరలు పుష్కకలంగా ఉంటాయి. ఇవి ఒక రోజుకు అవసరమైన కొలెస్ట్రాల్, కొవ్వు లేని శక్తిని మన శరీరానికి అందిస్తాయి. దీంతో మీకు అలసట ఉండదు. బలహీనత తగ్గుతుంది.
గుండె ఆరోగ్యం
ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ.. గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అయితే అరటిపండు మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. రోజూ ఉదయాన్నే ఒక అరటిపండును తింటే శరీరంలో అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది.
ఇమ్యూనిటీ పవర్
ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారికి దగ్గు, జలుబు, జ్వరం, ఇన్ఫెక్షన్లు తరచుగా వస్తుంటాయి. ఇలాంటి వారు ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ఆహారాలను ఖచ్చితంగా తినాలి. అయితే అరటిపండ్లు మన రోగనిరోధక శక్తిని పెంచడానికి బాగా సహాయపడతాయి. ఈ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోజూ ఉదయాన్నే ఒక అరటిపండును తింటే మీ శరీరానికి రోగాలతో పోరాడే సామర్థ్యం కలుగుతుంది.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది
చాలా మంది బరువు పెరిగిపోతామేమోనని అరటిపండ్లను తినకుండా ఉంటారు. కానీ మీరు రోజూ ఒక అరటిపండును తినడం వల్ల ఎలాంటి బరువు పెరగరు. నిజానికి అరటిపండు మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఈ పండులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. దీంతో మీరు రోజులో ఎక్కువగా తినలేరు. ఇది మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది
అరటి పండ్లు ఒక్క శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. ఈ పండ్లలో పుష్కలంగా విటమిన్ బి6 ఉంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అలాగే మానసిక స్థితిని స్థిరంగా ఉంచుతుంది. ఉదయాన్నే ఒక అరటిపండును తింటే మీరు రోజంతా రీఫ్రెష్ గా ఉంటారు. ఎనర్జిటిక్ గా పనులను చేసుకుంటారు.