వంట చిటికెలో పూర్తికావాలంటే ఈ టిప్స్ ఫాలో కావాల్సిందే!
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి పని ఫాస్ట్ గా చేయాల్సిందే. ముఖ్యంగా వంట. టైంకి వంట చేయకపోతే అన్ని పనులు ఆలస్యమైపోతాయి. కాబట్టి చాలామంది మహిళలు ఉదయాన్నే హడావిడిగా వంట చేస్తుంటారు. కానీ కొన్ని సింపుల్ చిట్కాలతో వంటను చిటికెలో పూర్తిచేయవచ్చు తెలుసా?

కిచెన్ టిప్స్
రుచికరమైన వంట చేయడం అంత సులభమేమి కాదు. కరెక్ట్ టైంకి వంట చేయకపోతే ఇంట్లో పిల్లలు, పెద్దలు ఇబ్బందిపడతారు. పిల్లల స్కూలు, ఆఫీసు పనులు, కుటుంబ బాధ్యతల మధ్యలో వంట చేయడం ఒక సవాలుగా మారింది. కానీ సరైన పద్ధతి, ప్రణాళిక, కొన్ని స్మార్ట్ టిప్స్ పాటిస్తే వంట చిటికెలో పూర్తవుతుంది. టైం కూడా ఆదా అవుతుంది.
ప్లానింగ్ ముఖ్యం
వంట చిటికెలో పూర్తికావాలంటే ప్లానింగ్ చాలా ముఖ్యం. ఉదయం లేచిన తర్వాత ఏం వంట చేయాలో ఆలోచించటం కంటే, రాత్రే ఏం చేయాలో నిర్ణయించుకుంటే మరుసటి రోజు టెన్షన్ ఉండదు. అవసరమైన కూరగాయలు, పప్పులు, మసాలాలు సిద్ధంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం ద్వారా ఉదయం టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. అంతేకాదు ఉల్లిపాయలు, టమాటాలు లేదా అవసరమైన కూరగాయలను ముందుగానే కట్ చేసి ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకుంటే చాలా సమయం ఆదా అవుతుంది.
కిచెన్ ఆర్గనైజేషన్
వంట ఫాస్ట్ గా చేయాలంటే ముందు కిచెన్ ని చక్కగా సర్దుకోవాలి. ఏది ఎక్కడుందో తెలిస్తే వంట వేగంగా పూర్తిచేయవచ్చు. కాబట్టి తరచుగా ఉపయోగించే పదార్థాలు, వస్తువులను (నూనె, ఉప్పు, మసాలాలు, స్పూన్ల వంటివి) స్టౌ దగ్గరే ఉండేలా సెట్ చేసుకోవాలి. వంట మరింత వేగంగా పూర్తి కావాలంటే స్మార్ట్ కిచెన్ గాడ్జెట్స్ ఉపయోగించడం మంచిది. ప్రెషర్ కుక్కర్, మిక్సీ, ఇండక్షన్ స్టౌ వంటివి శ్రమ, సమయాన్ని ఆదా చేస్తాయి.
కొలత వేసుకోవడం
వంటకాలలో వేసే మసాలాల పరిమాణం ముందుగానే నిర్ణయించుకోవడం కూడా సమయాన్ని ఆదా చేస్తుంది. ప్రతి సారి ఉప్పు, కారం కొలవడం కంటే ఒక కొలత స్పూన్ పెట్టుకోవడం మంచిది. అలాగే వంట చేస్తున్నప్పుడు ఫోన్ చూడటం, కాల్స్ మాట్లాడటం వల్ల టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి వంట చేసే టైంలో ఫోన్ పక్కన పెట్టడం మంచిది. అంతేకాదు వంట చేస్తూ కిచెన్ క్లీన్ చేస్తే.. క్లీనింగ్ కోసం మళ్లీ ప్రత్యేకంగా టైం కేటాయించాల్సిన అవసరం ఉండదు.
ఒత్తిడి వద్దు
వంట వేగంగా పూర్తికావాలంటే శారీరకంగా, మానసికంగా రిలాక్స్‌గా ఉండటం కూడా చాలా అవసరం. మనసులో ఒత్తిడి ఉంటే దాని ప్రభావం వంటలపై కూడా పడుతుంది. హ్యాపీగా, ఎంజాయ్ చేస్తూ వంట చేస్తే.. రుచి ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది.