Summer food: ఇలా చేస్తే.. కీరదోస ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది!
కీరదోస ఆరోగ్యానికి చాలామంచిది. మరీ ముఖ్యంగా వేసవికాలంలో కీరదోసను ఎక్కువగా తీసుకుంటారు. ఎండవేడి నుంచి శరీరాన్ని కాపాడి కావాల్సిన పోషకాలు అందిస్తుంది. మరి కీరను ఎక్కువ రోజులు తాజాగా ఎలా ఉంచాలో ఇక్కడ తెలుసుకుందాం.

కీరదోస తినడానికి రుచిగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీన్ని పచ్చిగా లేదా సలాడ్‌గా తినవచ్చు. ఇందులో ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గడానికి ఇది మంచి ఎంపిక. వేసవిలో దీన్ని తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ కీరను సరిగ్గా నిల్వ చేయకపోతే త్వరగా పాడైపోతుంది. కీరదోసన పాడవకుండా ఎక్కువ రోజులు తాజాగా ఎలా ఉంచాలో ఇక్కడ చూద్దాం.
ఎలా నిల్వ చేయాలి?
కీరదోసకాయ చూడటానికి గట్టిగా కనిపించినా లోపల మెత్తగా ఉంటుంది, త్వరగా పాడవుతుంది. కీరదోస ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే, దాన్ని ఫ్రిజ్‌లో పెట్టేటప్పుడు కొన్ని పద్ధతులను పాటిస్తే వారం రోజుల వరకు తాజాగా ఉంటుంది.
బాగా తుడవాలి
కీరదోసకాయను నీటితో బాగా కడిగిన తర్వాత ఒక గుడ్డతో బాగా తుడిచి ఆ తర్వాతే ఫ్రిజ్‌లో పెట్టాలి. తుడిచిన తర్వాత అలాగే ఉంచకుండా టిష్యూ పేపర్‌లో చుట్టి ఉంచండి. ఇలా ఉంచడం వల్ల కాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
పదేపదే బయటకు తీయొద్దు
కీరదోసను ఫ్రిజ్‌లో ఉంచిన తర్వాత పదే పదే బయటకు తీయకుండా ఉండాలి. అవసరమైనప్పుడు మాత్రమే బయటకు తీయాలి. అలాగే బయటకు తీసిన తర్వాత ఎక్కువసేపు బయట ఉంచడం మంచిది కాదు.
కట్ చేసిన కీరను..
కట్ చేయని కీరదోస కాయ కంటే కట్ చేసిన కాయ త్వరగా పాడవుతుంది. కాబట్టి కట్ చేసిన కీరను గాలి చొరబడని డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో ఉంచాలి. తొక్క తీసిన కాయ మిగిలితే దాన్ని ప్లాస్టిక్ కవర్‌లో సరిగ్గా చుట్టి ఫ్రిజ్‌లో పెట్టడం మర్చిపోవద్దు.