రోజూ ఇడ్లీ ఒకేలా తిని బోర్ కొడుతోందా.? పెరుగుతో ఇలా చేయండి, ఎగబడి తినడం ఖాయం..
చాలా మందికి టిఫిన్ అనగానే ఇడ్లీ గుర్తొస్తుంది. ఇన్‌స్టాంట్ ఇడ్లీ మిక్స్‌లు అందుబాటులోకి రావడం, తయారీ విధానం కూడా సులభంగా ఉండడంతో చాలా మంది ఇడ్లీని చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే రోజూ చట్నీతో తిని బోర్ కొడుతోందా.? మీ కోసమే ఒక వెరైటీ ఇడ్లీ కాంబినేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

దాదాపు చాలా మంది ఇళ్లలో టిఫిన్ కోసం ఇడ్లీలను చేస్తుంటారు. వారంలో కచ్చితంగా మూడు రోజులు ఇడ్లీలు చేస్తుంటారు. అయితే ఎక్కువసార్లు ఇడ్లీలు తింటే బోర్ కొట్టడం ఖాయం. మరీ ముఖ్యంగా ఇంట్లో చిన్నారులు ఇడ్లీ అనగానే ముఖాన్ని పక్కకు తిప్పుకుంటారు. కానీ దహీ ఇడ్లీ చేసి పెడితే లొట్టలేసుకొని తింటారు. దహీ వడ గురించి విన్నాం కానీ ఈ దహీ ఇడ్లీ ఏంటని అనుకుంటున్నారా.? ఇంతకీ దహీ ఇడ్లీని ఎలా తయారు చేస్తారు.? ఇందుకోసం కావాల్సిన పదార్థాలు ఏంటి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు:
దహీ ఇడ్లీ తయారు చేసుకోవడానికి వీలైనంత వరకు మెత్తగా ఉండే 5 ఇడ్లీలను తీసుకోవాలి. అనంతరం సరిపడ పెరుగు, ఉప్పు, చక్కెర, సరిపడ నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమర్చి తరుగు, ఇంగువా, కొన్ని దానిమ్మ గింజలు, చల్ల మిరపకాయలను తీసుకోవాలి.
తయారీ విధానం:
ముందుగా పెరుగును తీసుకొని కాస్త పలుచగా అయ్యేందుకు నీటిని కలుపుకోవాలి. అనంతరం అందులో ఉప్పు, చక్కెర వేసుకొని కలుపుకోవాలి. ఫ్రిజ్‌లో పెడితే బాగుంటుంది. ఇడ్లీలు తయారు కాగానే పోపు కోసం సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చసుకోవాలి. అనంతరం అన్ని దినుసులను వేసి వేయించాలి.
ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని వాటిలో ఇడ్లీలను తీసుకోవాలి. అనంతరం వాటిపై పెరుగును పొరలాగా పోసుకోవాలి. అప్పటికే తయారు చేసుకున్న తాలింపును ఇడ్లీలపై వేసుకోవాలి. అలాగే కాస్త పచ్చి మిర్చి తరుగు, దానిమ్మ గింజలను వేసుకోవాలి. అంతేనండి ఎంతో రుచికరంగా ఉండే దహీ ఇడ్లీ రడీ అయినట్లే. ఒకవేళ మీ పిల్లలు ఇడ్లీ తినడానికి ఇష్టపడకపోయినా, ఇడ్లీలు మిగలినా ఇలా చేసేయండి.