ఇంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేయాలి?
పిల్లల నుంచి పెద్దల వరకు ఫ్రెంచ్ ఫ్రైస్ ను ఎంతో ఇష్టంగా తింటుంటారు. క్రిస్పీగా, టేస్టీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ ను చూస్తేనే నోట్లో నుంచి లాలాజలం వస్తుంటుంది. ఎప్పుడూ బయటే కాకుండా.. ఈ సారి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంట్లో తయారుచేసుకుని తినండి.
సాయంత్రం స్నాక్స్ లో ఫ్రెంచ్ ఫ్రైస్ ను తినేవారు చాలా మందే ఉన్నారు. ఇక చిన్నపిల్లలైతే ఎప్పుడు పడితే అప్పుడు వీటిని తింటుంటారు. ఫ్రెంచ్ ఫ్రైస్ ను ఒక్క పిల్లలే కాదు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. బయటకొనే మాదిరిగానే ఇంట్లోనే ఫ్రెంచ్ ఫ్రైస్ ను ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మీరు కొనుక్కొని తినే ఫ్రెంచ్ ఫ్రైస్ లాగే ఇంట్లో తయారుచేయాలనుకుంటే పెద్ద సైజు బంగాళాదుంపలను తీసుకోండి. ఈ బంగాళాదుంపల పొట్టు తీసేసి ఫ్రెంచ్ ఫ్రైస్ ఆకారంలో పొడవుగా కట్ చేయండి. ఆ తర్వాత కట్ చేసిన బంగాళాదుంపలను వెంటనే నీటిలో వేయండి. దీంతో అవి నల్లగా కావు. ఈ బంగాళాదుంప ముక్కలను నీళ్లలో 5 నుంచి 6 నిమిషాల వరకు ఉంచాలి.
ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయండి. నీళ్లు వేడయ్యాక కొద్దిగా ఉప్పు వేసి తర్వాత బంగాళాదుంపలు వేయండి. దీంట్లో 5 నిమిషాల పాటు వాటిని ఉడికించండి. ఆ తర్వాత బంగాళాదుంప ముక్కలను నీట్లో నుంచి బయటకు తీసి కాటన్ క్లాత్ లో పెట్టి ఆరబెట్టండి. తర్వాత మొక్కజొన్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో నీళ్లు పోసి సన్నని పేస్ట్ లా చేసుకోండి.
ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేయండి. నూనె వేడయ్యాక బంగాళాదుంప ముక్కలను మొక్కజొన్న పిండి పేస్ట్ లో ముంచి నూనెలో వేయండి. ఇవి లేత బంగారు రంగులోకి మారిన తర్వాత బయటకు తీసి టిష్యూ పేపర్ పై వేయండి.
టిష్యూ పేపర్ మీద ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ను పెట్టడం వల్ల వాటిలో ఉండే ఎక్స్ ట్రా ఆయిల్ మొత్తం పోతుంది. అందే టేస్టీ టేస్టీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయినట్టే. ఇక వీటిపైన పైన చాట్ మసాలా, కారం వేసి బాగా కలపండి. ఆ తర్వాత టమాటా సాస్ తో వేడి వేడిగా సర్వ్ చేయాలి. ఇంతే.. మార్కెట్ లో దొరికే ఫ్రెంచ్ ఫ్రైస్ ను మీరు ఇలా ఈజీగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.