Chewing Food: భోజనం తినేటప్పుడు ఒక్కో ముద్దను ఎన్ని సార్లు నమలాలో తెలుసా?
Chewing Food: భోజనం చేసేటప్పుడు ఒక్కో ముద్దను ఎంత సేపు నములుతున్నారో.. మీరు ఎప్పుడైనా గమనించారా? ఆహారాన్ని బాగా నమిలి తినకపోతే ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని డాక్టర్స్ చెబుతున్నారు. మరి ఆహారాన్ని ఎంత సేపు నమిలి తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ బిజీ లైఫ్ లో సరిగ్గా భోజనం చేయడం కూడా చాలామంది మరిచిపోతున్నారు. ఏదో భోజనం చేసే టైమ్ అయిందని నాలుగు ముద్దలు నోట్లో పెట్టుకొని మమ అనిపిస్తున్నారు. తిన్న కాస్త ఆహారమైనా సరిగ్గా నమలకపోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అవేంటంటే..
అజీర్ణం
తినే ఆహారం ఏదైనా చిన్న ముక్కలుగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే నమలడానికి వీలుగా ఉంటుంది. లేదా తినేటప్పుడు బాగా నమిలినా జ్యూస్ లా మారి త్వరగా అరుగుతుంది. లేదంటే ముక్కలుగా ఉన్న ఆహారం కడుపులోకి వెళితే అరగడానికి కష్టమవుతుంది. జీర్ణవ్యవస్థ మీద ఒత్తిడి పడుతుంది. దీంతో కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు రావచ్చు. సరిగ్గా నమలని ఆహారం వల్ల కడుపులో యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, లివర్ కి సంబంధించిన ఇబ్బందులు వస్తాయని డాక్టర్స్ చెబుతున్నారు.
పోషకాలు శరీరానికి అందవు
ఆహారం బాగా నమిలితే ఎంజైమ్స్ రిలీజ్ అయి ఆహారం మొత్తం సరిగ్గా జీర్ణమవుతుంది. నమిలకుండా తొందరగా మింగేస్తే శరీరం పోషకాలను పూర్తిగా గ్రహించలేకపోతుంది.
బరువు పెరగడం
బాగా నమిలి తింటే మెదడుకు పొట్ట నిండినట్లు సంకేతాలు అందుతాయి. దీనివల్ల తక్కువ తినగలం. తొందరగా మింగేస్తే ఎక్కువ తినేస్తాం. దీంతో బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది.
ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది
ఆహారాన్ని నమలకుండా డైరెక్ట్ గా మింగేస్తే గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు లేదా పెద్ద వారికి ఊపిరాడకపోవడం వంటి ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
ఒక్కో ముద్దను ఎంతసేపు నమలాలి?
నోట్లో పెట్టుకున్న ప్రతి ముద్దను కనీసం 20-30 సార్లు నమిలిన తర్వాతనే మింగాలి. ఒక్కో ముద్ద నమలడానికి కనీసం 12 నుంచి 14 సెకన్లు టైమ్ పడుతుంది.
తినేటప్పుడు టీవీ, ఫోన్ చూసే అలవాటు తగ్గించాలి. తొందరపడి తినకుండా, ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినాలి. తినే ముందు లేదా తర్వాత మాత్రమే అవసరమైన నీటిని తాగాలి. మధ్యలో తాగితే కడుపులో ఉండే యాసిడ్స్ డైల్యూట్ అయిపోయి ఫుడ్ సరిగ్గా అరగదు.