థైరాయిడ్ ఉన్నవారు గుడ్లు తింటే ఏమౌతుందో తెలుసా?
థైరాయిడ్ ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే థైరాయిడ్ సమస్య మరింత పెరుగుతుంది. అయితే థైరాయిడ్ పేషెంట్లు రోజూ ఒక గుడ్డును తింటే ఏం జరుగుతుందో తెలుసా?
గుడ్లు ప్రోటీన్ల పవర్ హౌస్. దీనిలో మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే చాలా మంది ఆరోగ్యంగా ఉండటానికి రోజూ ఒక గుడ్డును ఖచ్చితంగా తింటుంటారు. గుడ్లలో ఉండే ప్రోటీన్ మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి, కండరాల నిర్మాణానికి బాగా సహాయపడుతుంది.
వ్యాయామం చేస్తూ ప్రతిరోజూ జిమ్ కు వెళ్లేవారు లేదా హెల్తీగా బరువు తగ్గాలనుకునేవారు గుడ్లను తింటే మంచి ప్రయోజనం ఉంటుంది. అయితే గుడ్లలో ప్రోటీన్ తో పాటుగా ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి.
థైరాయిడ్ సమస్య ఉన్నవారికి కూడా గుడ్లు మంచి ప్రయోజకరంగా ఉంటాయి. గుడ్లలో ఉండే ప్రోటీన్లు, సెలీనియం, విటమిన్ డి, ఫ్యాటీ యాసిడ్స్ థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తాయి.
అందుకే థైరాయిడ్ పేషెంట్లు గుడ్లను తినాలని డాక్టర్లు చెప్తారు. ముఖ్యంగా హైపోథైరాయిడిజం ఉన్నవారు గుడ్లను తమ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అసలు గుడ్లు థైరాయిడ్ పేషెంట్లకు ఎలా సహాయపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
సెలీనియం
గుడ్లు థైరాయిడ్ ఉన్నవారికి ఎంతో ప్రయోజకరంగా ఉంటాయి. ఎందుకంటే దీనిలో సెలీనియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది థైరాయిడ్ గ్రంథిని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడానికి సహాయపడే యాంటీఆక్సిడెంట్.
ఇది శరీరంలో మంటను తగ్గించి థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేయడానికి సహాయపడుతుంది. మీకు తెలుసా? సెలీనియం లోపం వల్ల థైరాయిడ్ పనితీరు దెబ్బతింటుంది.
ప్రోటీన్ కు మంచి వనరు
గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది థైరాయిడ్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రోటీన్ల నుంచి అమైనో ఆమ్లాలు థైరాయిడ్ గ్రంథి హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి చాలా అవసరం. ఇంతేకాదు పుష్కలంగా ప్రోటీన్ ను పొందడం వల్ల జీవక్రియ సమతుల్యంగా ఉంటుంది. అలాగే థైరాయిడ్ పనితీరు మెరుగుపడుతుంది.
అయోడిన్ లభిస్తుంది
థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి అవసరమైన అయోడిన్ గుడ్లలో పుష్కలంగా ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్, ట్రైయోడోథియోనిన్ వంటి హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి అయోడిన్ చాలా అవసరం.
అందుకే థైరాయిడ్ ఉన్నవారు గుడ్లను తింటే రోజువారి అయోడిన్ అవసరం తీరుతుంది. థైరాయిడ్ పనితీరు కూడా మెరుగుపడుతుంది.
కొవ్వు ఆమ్లాలు
గుడ్లలో ఒమేగా -3, ఒమేగా -6 వంటి ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు మెండుగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడానికి, థైరాయిడ్ పనితీరును మెరుగుపర్చడానికి ఎంతగానో సహాయపడతాయి.
గుడ్లలో ఉండే కొవ్వు ఆమ్లాల సహాయంతో హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. ఇది థైరాయిడ్ పేషెంట్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.
బరువు
సాధారణంగా హైపోథైరాయిడిజం సమస్యలు ఉన్నవారు చాలా ఫాస్ట్ గా బరువు పెరుగుతారు. వీళ్లు తమ రోజువారి ఆహారంలో గుడ్లను చేర్చుకుంటే మంచిది. ఎందుకంటే గుడ్లలో ఉండే ప్రోటీన్ కంటెంట్ మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
అలాగే గుడ్లు వంటి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు జీవక్రియను నియంత్రించడానికి బాగా సహాయపడతాయి. దాని వల్ల మీరు బరువు పెరిగే అవకాశం ఉండదు.