బ్లాక్ రైస్ నిజంగా షుగర్ ఉన్నవారికి, గుండె జబ్బులు ఉన్నవారికి అంత మంచిదా?
బ్లాక్ రైస్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి, బరువు తగ్గడానికి, గుండె జబ్బులు, డయాబెటిస్ నియంత్రణకు సహాయపడతాయి.
మన దేవంలో బియ్యమే ఒక ప్రధాన ఆహారం. ఒక ఇండియాలోనే కాదు.. ప్రపంచంలోని చాలా దేశాల్లో బియ్యాన్ని చాలా ఇష్టంగా తింటారు. కానీ భారతదేశంలో ఇది చాలా ముఖ్యమైంది. ఎందుకంటే బియ్యం, పప్పు చారు టేస్ట్ ప్రతి ఒక్కరికీ ఇష్టమే. కొంతమంది రోజుకు రెండు పూటాలా అన్నాన్ని తింటే.. చాలా మంది మూడు పూటలా అన్నాన్నే తింటుంటారు. ఇది కడుపును నింపడమే కాకుండా.. మన శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. అయితే చాలా మంది వైట్ రైస్ నే ఎక్కువగా తింటారు. కానీ వైట్ రైస్ ను ఎక్కువగా తింటే లేనిపోని సమస్యలు వస్తాయి.
వైట్ ను రైస్ లో కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన బరువును పెంచడంతో పాటుగా రక్తంలో చక్కెర స్థాయిలను బాగా పెంచుతాయి. అందుకే ప్రస్తుత కాలంలో చాలా మంది వైట్ రైస్ ను తినడం తగ్గించారు. దీన్ని కొద్దిమొత్తంలో తింటూ.. జొన్న రొట్టెలు, చపాతీలు మొదలైన వాటిని తింటున్నారు. మీకు తెలుసా? తెల్ల బియ్యం ఊబకాయం, డయాబెటిస్, రక్తపోటుతో పాటుగా ఎన్నో వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఎందుకంటే దీనిలో వేరే బియ్యాల కంటే ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారు వైట్ రైస్ కు బదులుగా బ్రౌన్ రైస్ నే తింటారు. నిజానికి వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్ లు చాలా ఆరోగ్యకరమైనవి. ఆరోగ్యపరంగా చాలా మంది బ్లాక్ రైస్ ను ఎక్కువగా తింటున్నారు.
బ్లాక్ రైస్ ఎందుకు నల్లగా ఉంటుంది?
ఇలా చాలా ఇంట్రెస్టింగ్ విషయమే. నిజానికి బ్లాక్ రైస్ లో ఆంథోసైనిన్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది. దీనివల్లే ఈ బియ్యానికి నలుపు రంగు వస్తుంది. ఇదొక గొప్ప యాంటీ ఆక్సిడెంట్. అందుకే ఈ బియ్యం నల్ల రంగులో ఉంటాయి.
బ్లాక్ రైస్ లో అమైనో ఆమ్లాలు, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, జింక్, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, ఇనుము, రాగితో పాటుగా ఫ్లేవనాయిడ్లు, హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన శరీరాన్ని ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తాయి.
బ్లాక్ రైస్ లో ఫైబర్ కంటెంట్ మెండుగా ఉంటుంది. ఇది మీ కడుపును తొందరగా నింపి మీరు ఎక్కువగా తినకుండా చేస్తుంది. ఇది మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే మలబద్దకం సమస్య తగ్గడానికి కూడా సహాయపడుతుంది. దీనిలోని ఫైబర్ కంటెంట్ మీ శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతుంది. అలాగే మీ జీర్ణశక్తిని పెంచడంతో పాటుగా గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.
బ్లాక్ రైస్ లో ఫైటో న్యూట్రియెంట్స్, యాంటీ ఆక్సిడెంట్ల పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. ఈ ఆక్సీకరణ ఒత్తిడి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులొచ్చేలా చేస్తుంది. కాబట్టి బ్లాక్ రైస్ ను తినడం వల్ల దీనిలో ఉడే ఆంథోసైనిన్స్, గ్లైకోసైడ్స్, కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరానికి ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంచుతాయి. బ్లాక్ రైస్ లో 42 నుంచి 50 వరకు గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మత్తుగా పెంచదు. అందుకే డయాబెటీస్ పేషెంట్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది.