ప్రతిరోజూ 3 కప్పుల కాఫీ తాగితే ఏమౌతుంది?
కాఫీ తాగడానికి ఇష్టపడేవారు మన చుట్టూ చాలా మంది ఉంటారు. మరి.. రోజుకి మూడు కప్పుల కాఫీ రోజూ తాగితే ఏమౌతుంది? పరిశోధకులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం...
ఉదయం లేవగానే వేడి వేడిగా పొగలు కక్కే కాఫీ ని ఆస్వాదిస్తూ తాగుతుంటే ఎంత బాగుంటుంది. కాఫీ ని అమితంగా ఇష్టపడేవారు చాలా మంది ఉంటారు. రోజూ కాఫీ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది అని చాలా మంది నమ్ముతారు. అయితే కాఫీ తాగడం వల్ల మన జీవిత ఆయుష్షు పెరుగుతుందంటే మీరు నమ్ముతారా? మీరు చదివింది అక్షరాలా నిజం.
కాఫీ తాగడం వల్ల జీవితకాలం రెండు సంవత్సరాలు పెరుగుతుందని ఒక పరిశోధన చెబుతోంది. అయితే రోజుకు ఎన్ని కప్పుల కాఫీ తాగాలో ఈ పరిశోధనలో సమాచారం ఉంది.
కాఫీ
పోర్చుగల్‌లోని కొయింబ్రా విశ్వవిద్యాలయం చేసిన సమగ్ర అధ్యయనం, క్రమం తప్పకుండా కాఫీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేసింది. క్రమం తప్పకుండా కాఫీ తాగితే జీవితకాలం పెరుగుతుంది. దీర్ఘాయుష్షుకు కాఫీ సహాయపడుతుంది.
యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా , ఆసియా ప్రజల అభిప్రాయాలను సేకరించి ఈ పరిశోధనా నివేదికను రూపొందించారు. మొత్తం 85 అధ్యయనాల నివేదికల ఆధారంగా రోజుకు ఎంత కాఫీ తాగాలో సూచించారు.
85 అధ్యయనాలను పరిశీలించిన తర్వాత, రోజుకు మూడు కప్పుల కాఫీ తాగడం వల్ల సగటు వ్యక్తి జీవితానికి అదనంగా 1.84 సంవత్సరాలు పెరుగుతుందని ఈ అధ్యయనం తెలిపింది. రోజూ కాఫీ తాగడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని ఆ అధ్యయనంలో తేలడం విశేషం.
కాఫీలో మనల్ని ఉత్తేజపరిచే కెఫీన్‌తో సమృద్ధిగా ఉంటుంది. మితంగా తీసుకున్నప్పుడు, కెఫీన్ మీ శక్తి స్థాయిలను పెంచుతుంది. ఎందుకంటే ఇది మీ జీవక్రియ రేటును పెంచుతుంది. శక్తి విడుదలకు కారణమయ్యే మెదడులోని హార్మోన్ అడ్రినలిన్ విడుదలను పెంచుతుంది.
కాఫీ ఆరోగ్యానికి మంచిది అన్నారు కదా అని మరీ ఎక్కువగా మాత్రం తాగకూడదు. మరీ ఎక్కువ తాగితే ఆరోగ్య సమస్యలను తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది.