కోడి గుడ్డు తినేటప్పుడు చేయకూడని తప్పులు ఇవే
ప్రతి రోజూ మన డైట్ లో ఒక కోడి గుడ్డు చేర్చుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే.. ఈ గుడ్డు తినే విషయంలో మాత్రం కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూద్దాం...

మనం ఆరోగ్యంగా ఉండేందుకు ప్రోటీన్ తీసుకోవడం చాలా అవసరం. ఆ ప్రోటీన్ మనకు చాలా ఈజీగా లభించేది కోడి గుడ్డులోనే. అందుకే ప్రతిరోజూ కోడి గుడ్డును ఏదో ఒక రూపంలో తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. గుడ్డులో ప్రోటీన్ మాత్రమే కాదు.. విటమిన్లు, ఖనిజాలు కూడా ఉంటాయి. మాంసాహారం ఇష్టపడని చాలా మంది కూడా గుడ్డును మాత్రం తింటూ ఉంటారు.
కోడిగుడ్డులో విటమిన్ బి12 కూడా ఉంటుంది. మనకు వెంటనే ఎనర్జీ ఇవ్వడానికి కూడా సహాయపడుతుంది. ఒక సాధారణ గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్ వరకు ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలి అనుకునేవారు, బరువు తగ్గాలి అనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ ఇది.
ఎక్కువ పోషకాలున్న కోడి గుడ్డులో కేలరీలు తక్కువగా ఉండటం విశేషం. బరువు తగ్గాలనుకునేవారు కోడి గుడ్డును ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కోడి గుడ్డులో ఫోలేట్, విటమిన్ ఎ, విటమిన్ బి5, బి12, భాస్వరం, సెలెనియం అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. గర్భిణులు కూడా గుడ్డును ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే గుడ్డు తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేమిటంటే..
పచ్చి గుడ్డు విషయంలో..
కొంతమంది పచ్చి గుడ్లు తింటారు. కానీ వీటిలో సాల్మొనెల్లా అనే బాక్టీరియా ఉంటుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్ కు కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే పచ్చిగా మాత్రం తినకూడదు. ఉడికించిన గుడ్డు నుంచే శరీరానికి 90% ప్రోటీన్లు లభిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. పచ్చి గుడ్డు నుంచి కేవలం 50% ప్రోటీన్లు మాత్రమే లభిస్తాయి. అందువల్ల పచ్చి గుడ్డు కంటే ఉడికించిన గుడ్డు తినడమే మంచిదని నిపుణుల సలహా.
ఎప్పుడు తినాలి?
గుడ్లు తినే సమయం గురించి కూడా కొన్ని నియమాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. రాత్రి కంటే ఉదయం గుడ్లు తినడం ఆరోగ్యానికి మంచిది. ఉదయం గుడ్డు తింటే రోజంతా శక్తి లభిస్తుంది. ఉదయం అల్పాహారంలో గుడ్డు తింటే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఉదయం గుడ్డు తింటే కండరాలు కోలుకుంటాయి. బరువు పెరగాలనుకునేవారు రాత్రి గుడ్డు తినాలి.
గమనిక: పైన చెప్పిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సలహా పాటించడమే మంచిది.