బియ్యం నుంచి డ్రై ఫ్రూట్స్ వరకు.. వీటిని నానబెట్టకుండా తినకండి
డ్రైై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని చాలా మంది రెగ్యులర్ గా తింటుంటారు. అయితే ఈ డ్రై ఫ్రూట్స్ లోని మొత్తం పోషకాలను పొందాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నానబెట్టాల్సిన నట్స్ కొన్ని ఉన్నాయి. అవేంటంటే?

వేటిని నానబెట్టి తినాలి.
డ్రై ఫ్రూట్స్ చాలా మంచివి. వీటిలో మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని తింటే పోషకాల లోపం ఉండదు. శరీరం హెల్తీగా ఉంటుంది. అయితే ఏ ఫుడ్ ను అయినా సరే తినడానికి కొన్ని పద్దతులు ఉంటాయి. అప్పుడే వాటి పూర్తి ప్రయోజనాలను పొందుతాం. అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలను నానబెట్టే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
క్వినోవా
క్వినోవా మంచి హెల్తీ ఫుడ్, వీటిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో రకరకాల విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటాయి. ఈ పోషకాలన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చాలా మంది క్వినోవాను బరువు తగ్గడానికి తింటుంటారు. ఎందుకంటే ఇది కడుపును తొందరగా నింపుతుంది. ఎక్కువ ఆకలి కానీయదు. అలాగే మీరు కేలరీలు తీసుకోవడాన్ని తగ్గిస్తుంది. అయితే దీన్ని ముందు కొద్దిసేపు నానబెట్టిన తర్వాత వండాలని నిపుణులు చెబుతున్నారు.
నట్స్
డ్రై ఫ్రూట్స్ ను ఖచ్చితంగా తినేముందు నానబెట్టాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పప్పులను నానబెట్టడం వల్ల వాటిలోని ఫైటిక్ యాసిడ్ తగ్గుతుంది. దీంతో అవి సులువుగా జీర్ణం అవుతాయి. అంతేకాదు నానబెట్టడం వల్ల వీటిలో ఉండే మొత్తం పోషకాలు మన శరీరానికి అందుతాయి. కాబట్టి వీటిని నానబెట్టే తినడం అలవాటు చేసుకోండి.
ఎండు ద్రాక్ష
ఎండు ద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్ పోషకాలకు మంచి వనరులు. వీటిలో మన శరీరానికి అవసరమైన సూక్ష్మపోషకాలు, ఎన్నో రకాల విటమిన్లు మెండుగా ఉంటాయి. కిస్ మిస్ వంటి డ్రై ఫ్రూట్స్ ను నానబెట్టడం వల్ల అవి మెత్తబడి టేస్టీగా అవుతాయి. అలాగే పోషకాలు బాగా అందుతాయి. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.
బియ్యం
చాలా మంది బియ్యాన్ని కడిగేసి అలాగే పొయ్యి మీద పెట్టేస్తుంటారు. కానీ బియ్యాన్ని కడిగి కాసేపు ఖచ్చితంగా నానబెట్టాలి. ఎందుకంటే బియ్యంలో పోషకాల నిరోధకాలు, ఫైటిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి. మీరు బియ్యాన్ని నానబెడితే ఇవి తొలగిపోతాయి. అలాగే పోషకాల శోషణ మెరుగుపడుతుంది. అంతేకాకుండా బియ్యాన్ని నానబెట్టడం వల్ల అన్నం తొందరగా అవుతుంది. మీకు గ్యాస్ ఆదా అవుతుంది.
బీన్స్ , పప్పు ధాన్యాలు
కందిపప్పు, శెనగపప్పు, వేరుశెనగ, బీన్స్ వంటి పప్పు ధాన్యాలను కూడా ఖచ్చితంగా నానబెట్టాలి. ఎందుకంటే నానబెట్టడం వల్ల అవి మెత్తబడి తొందరగా ఉడుకుతాయి. దీంతో గ్యాస్ ఆదా అవుతుంది. వీటిలోని పోషకాలను కూడా మొత్తం పొందుతారు.