- Home
- Feature
- White Egg vs Brown Egg : ఫార్మ్ కోడిగుడ్లు తెల్లగా, నాటుకోడి గుడ్లు గోధుమ రంగులో ఎందుకుంటాయి? హెల్త్ బెనిఫిట్స్ ఎందులో ఎలా?
White Egg vs Brown Egg : ఫార్మ్ కోడిగుడ్లు తెల్లగా, నాటుకోడి గుడ్లు గోధుమ రంగులో ఎందుకుంటాయి? హెల్త్ బెనిఫిట్స్ ఎందులో ఎలా?
ఫారం కోడి గుడ్లు తెలుపు రంగులో ఉంటాయి… అదే నాటుకోడి గుడ్లు గోధుమ రంగులో ఉంటాయి. రెండూ కోడి పెట్టిన గుడ్లే అయినప్పటికీ రంగుల్లో తేడా ఎందుకుంటుంది? దీని వెనుక ఉన్న అసలు సైన్స్ ఏంటి? ఏ గుడ్డులో ఎక్కువ పోషకాలు ఉంటాయి? అనేది తెలుసుకుందాం.

వైట్ ఎగ్స్ vs బ్రౌన్ ఎగ్స్
White Eggs vs Brown Eggs : మన అహారంలో కోడిగుడ్డు ఓ భాగమైపోయింది. ఎగ్ ను కర్రీగానే కాదు ఈజీగా ఉడకబెట్టి, ఆమ్లేట్ వేసుకుని తినవచ్చు. ఇందులో పోషకాలు కూడా ఎక్కువగా ఉండటంతో డాక్టర్లు సైతం తినమని ప్రోత్సహిస్తుంటారు. పిల్లలకు రోజూ గుడ్డు తినిపిస్తే బలంగా తయారవుతారని పేరెంట్స్ నమ్ముతారు... అందుకే కోడిగుడ్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.
అయితే సాధారణంగా దొరికే ఫారం కోడిగుడ్ల కంటే నాటు కోడిగుడ్డులో ఎక్కువ పోషకాలు ఉంటాయని అంటుంటారు... ఇందులో నిజమెంత? ఈ రెండు గుడ్లను కోడే పెడుతుంది... మరి రంగుల్లో తేడా ఎందుకుంటుంది? అనేవి తెలుసుకుందాం.
ఫారం కోడిగుడ్డు, నాటు కోడిగుడ్డు రంగులో తేడా ఎందుకుంటుంది?
గుడ్డు పెంకు రంగు పూర్తిగా కోడి జన్యువుల (Genetics) మీద ఆధారపడి ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే కోడి ఏ జాతికి చెందినది అనేదాన్ని బట్టే అది పెట్టే గుడ్డు రంగు ఉంటుంది. గుడ్డు తయారయ్యే చివరి దశలో కోడి గర్భాశయంలో కొన్ని రంగులు పెంకుపై చేరతాయి... వీటివల్లే గుడ్డుకు రంగు వస్తుంది.
గుడ్డు పెంకు కాల్షియం కార్బోనేట్‌తో తయారవుతుంది... ఇది సహజంగా తెల్లగా ఉంటుంది. కాబట్టి అన్ని కోడిగుడ్లు మొదట తెల్లగానే తయారవుతాయి. నాటుకోడి గుడ్డు తయారయ్యేటప్పుడు ఆ కోడి పునరుత్పత్తి నాళం చివరి భాగంలో పెంకుపై 'ప్రోటోపోర్ఫిరిన్ IX' (Protoporphyrin IX) అనే సహజ రంగు పూతలా ఏర్పడుతుంది. ఈ రంగు వల్లే గుడ్డుకు బ్రౌన్ కలర్ (గోధుమ రంగు) వస్తుంది. ముఖ్యంగా ఈ రంగు పెంకు పైభాగంలో మాత్రమే ఉంటుంది. అందుకే బ్రౌన్ గుడ్డును పగలగొట్టి చూస్తే లోపల తెల్లగానే కనిపిస్తుంది.
నాటు కోడిగుడ్డు vs ఫారం కోడిగుడ్డు... ఎందులో పోషకాలు ఎక్కువుంటాయి?
చాలామంది నాటుకోడి పెట్టే గోధుమ రంగు గుడ్లలో పోషకాలు ఎక్కువని అనుకుంటారు. కానీ సైన్స్ మాత్రం గుడ్డు పెంకు రంగుకు, లోపల ఉండే ప్రోటీన్, కొవ్వు లేదా విటమిన్లకూ ఎలాంటి సంబంధం లేదని చెబుతుంది. అంటే ఫారం కోడి పెట్టే తెల్లని గుడ్లు, నాటు కోడి పెట్టే గోధుమ రంగు గుడ్లలో పోషకాలు దాదాపు సమానంగానే ఉంటాయన్నారు.
వైట్, బ్రౌన్ గుడ్ల రుచిలో కూడా తేడా ఉండదు.. రంగును బట్టి రుచిని నిర్ణయించలేం. కోడికి ఎలాంటి మేత పెడుతున్నారు, అది పెరిగే వాతావరణంపైనే గుడ్డు రుచి, పోషకాలు ఆధారపడి ఉంటాయి. నాటుకోళ్లు సహజ వాతావరణంలో తిరుగుతూ పెరగడం వల్ల అవి పెట్టే గుడ్లలోని పచ్చసొన కొంచెం ముదురు నారింజ రంగులో ఉండొచ్చు. ఇది ఆ కోడి తినే ఆహారం (గడ్డి, పురుగులు) వల్లే కానీ, పెంకు రంగు వల్ల కాదు.
కోడి గుడ్డు రంగుకు మరిన్ని కారణాలు...
కోడి జన్యువులే గుడ్డు రంగుకు ప్రధాన కారణమైనప్పటికీ కొన్ని ఇతర అంశాలు కూడా ప్రభావితం చేయొచ్చు.
కోడి వయసు : కోడికి వయసు పెరిగేకొద్దీ, అది పెట్టే గుడ్ల రంగు కొద్దిగా మసకబారవచ్చు.
ఒత్తిడి, అనారోగ్యం : కోడికి ఏదైనా అనారోగ్యం లేదా ఎక్కువ ఒత్తిడి ఉంటే, గుడ్డు పెంకు రంగు మారే అవకాశం ఉంది.
పోషకాహారం : కోడికి అవసరమైన కాల్షియం, ఇతర మినరల్స్ ఆహారంలో తక్కువగా ఉంటే, అది గుడ్డు నాణ్యతను, రంగును ప్రభావితం చేస్తుంది.
చివరిగా చెప్పేదేంటంటే నాటుకోడి గుడ్లు బ్రౌన్‌గా ఉండటానికి దాని జాతి జన్యువులే కారణం. గుడ్డు ఆరోగ్యాన్ని దాని పెంకు రంగును బట్టి అంచనా వేయొద్దు. కోళ్లు ఆరోగ్యంగా, సహజమైన ఆహారం తింటున్నాయా లేదా అనే దానిపైనే గుడ్డు అసలైన నాణ్యత ఆధారపడి ఉంటుంది.

