Idli Capital: మనదేశంలో ఏ నగరాన్ని ఇడ్లీ రాజధానిగా పిలుచుకుంటారు?
Idli Capital: మనదేశంలో ఇడ్లీ దొరకని ఊరే ఉండదు. ఎక్కడికెళ్లినా ఇడ్లీ చాలా సులువుగా దొరికేస్తుంది. అయితే మనదేశంలో ఒక నగరాన్ని ఇడ్లీ రాజధానిగా పిలుచుకుంటారు. ఆ నగరం పేరేమిటో తెలుసా?

ఇడ్లీ రాజధాని ఏది?
దక్షిణ భారతదేశానికి చెందిన ఇడ్లీ… ఉత్తర భారతదేశంలో కూడా చాలా పాపులర్ అయిపోయింది. ఇప్పుడు ఇండియన్స్ ఉండే ఏ దేశంలో అయినా ఇడ్లీ దొరికేస్తుంది. మెత్తగా ఉండే ఇడ్లీలు చిన్న పిల్లలు కూడా తినేలా ఉంటాయి. అయితే మనదేశంలోని ఒక నగరానికి ఇడ్లీతో చాలా స్పెషల్ కనెక్షన్ ఉంది. అదే చెన్నై. ఇక్కడి ప్రజలకు ఇడ్లీల మీద ఉన్న ప్రేమ, టిఫిన్ కల్చర్ వల్ల చెన్నైకి 'ప్రపంచ ఇడ్లీ రాజధాని' (World Idli Capital) అనే పేరు వచ్చింది.
చెన్నై ఫుడ్ కల్చర్‌లో ఇడ్లీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మాత్రమే కాదు.. స్నాక్స్, లేట్ నైట్ ఫుడ్‌గా కూడా ఇక్కడ ఇడ్లీలను అధికంగా తింటారు. 'ఇన్‌క్రెడిబుల్ ఇండియా' పోర్టల్ కూడా చెన్నై ఫేమస్ ఫుడ్స్‌లో ఇడ్లీని చేర్చింది. పాతకాలం నాటి టిఫిన్ సెంటర్ల నుంచి మోడ్రన్ రెస్టారెంట్ల వరకు ప్రతిచోటా ఇడ్లీ మెనూలో పక్కాగా ఉంటుంది.
చెన్నైలో రకరకాల ఇడ్లీలు
మనదేశంలో సాధారణంగా బియ్యం, మినప్పప్పు నానబెట్టి రుబ్బిన తర్వాత ఆ పిండితో ఇడ్లీలు చేస్తారు. ఇడ్లీ పాత్రలో ఆవిరి మీద ఉడికిస్తే వేడివేడి ఇడ్లీలు సిద్ధమవుతాయి. కానీ చెన్నైలోని వేర్వేరు ప్రాంతాలు, హోటళ్లలో ఇడ్లీ రుచి, వడ్డించే విధానంలో చాలా వెరైటీలు కనిపిస్తాయి.
చెన్నైకి, ఇడ్లీకి మధ్య ఉన్న బంధం ఈనాటిది కాదు. ఎన్నో ఏళ్లుగా ఇడ్లీ, దోశ, వడ ఇక్కడి టిఫిన్లలో మొదటి స్థానంలో ఉంటాయి. ముఖ్యంగా ఉడిపి హోటళ్లు ఈ సౌత్ ఇండియన్ టిఫిన్లను బయట కూడా పాపులర్ చేశాయి. త్వరగా రెడీ అవ్వడం, కడుపు నిండటం, ఎక్కడైనా ఈజీగా దొరకడం వల్లే ఇడ్లీకి ఇంత క్రేజ్ వచ్చింది.
ఎన్నో రకాల ఇడ్లీలు!
చెన్నైలో కేవలం మామూలు తెల్లటి ఇడ్లీలు మాత్రమే కాదు.. పొడి ఇడ్లీ, స్టఫ్డ్ ఇడ్లీ లాంటి ఎన్నో వెరైటీలు దొరుకుతాయి. ఇడ్లీల మీద చెన్నై వాసులు ఎన్నో ప్రయోగాలు కూడా చేశారు. 2015లో చెన్నైకి చెందిన ఒక వ్యాపారి జంతువులు, నంబర్లు, రకరకాల ఆకారాల్లో ఏకంగా 1,000 రకాల ఇడ్లీలను తయారు చేసి రికార్డు సృష్టించాడు.

