GDP: ఒక దేశ GDP అంటే ఏమిటి? భారతదేశ జీడీపీ ఎంత? అది పెరిగితే ఏమవుతుంది?
GDP: ఒక దేశానికి జీడీపీ చాలా ముఖ్యమైనది. దేశ ఆర్థిక స్థితిని ఇది తెలియజేస్తుంది. మనదేశ జీడీపీ ఎంతో తెలుసా? దాన్ని ఎలా లెక్కిస్తారు? ఈ వివరాలన్నీ సులువుగా అర్థమయ్యేలా ఇక్కడ ఇచ్చాము చదవండి.

GDP అంటే ఏమిటి?
ఒక దేశంలో ఒక నిర్దిష్ట కాలంలో (సాధారణంగా ఏడాది లేదా మూడు నెలల్లో) తయారైన వస్తువులు, అందించిన సేవల మొత్తం మార్కెట్ విలువనే స్థూల దేశీయోత్పత్తి (GDP) అంటారు. ఒక దేశం ఎంత అభివృద్ధి చెందుతోంది? అక్కడ వ్యాపారాలు ఎలా సాగుతున్నాయి? ప్రజల కొనుగోలు శక్తి ఎలా ఉంది? ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడే ముఖ్యమైన కొలమానం జీడీపీ. ఒక దేశ సరిహద్దుల పరిధిలో ఒక నిర్ణీత కాలంలో తయారైన వస్తువులు, అందించిన సేవల మొత్తం విలువను జీడీపీ అంటారు. సాధారణంగా మూడు నెలలకు ఒకసారి, ఏడాదికి ఒకసారి దీన్ని లెక్కిస్తారు. ఉదాహరణకు మన దేశంలో తయారైన కార్లు, బట్టలు, ఆహార పదార్థాలు, ఐటీ సేవలు, బ్యాంకింగ్ సేవలు ఇలా అన్నింటి విలువను కలిపి జీడీపీని అంచనా వేస్తారు. దీని ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం, అభివృద్ధి ఎలా ఉందో తెలుసుకోవచ్చు.
రెండు రకాల జీడీపీలు
జీడీపీలో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. మొదటిది నామమాత్రపు జీడీపీ (Nominal GDP). ఇందులో వస్తువులు, సేవల ప్రస్తుత మార్కెట్ ధరల ఆధారంగా లెక్కలు వేస్తారు. రెండోది వాస్తవ జీడీపీ (Real GDP). ఇందులో ధరల పెరుగుదల ప్రభావాన్ని తొలగించి లెక్కిస్తారు. అందువల్ల దేశంలో నిజంగా ఉత్పత్తి ఎంత పెరిగిందో తెలుసుకోవడానికి వాస్తవ జీడీపీ ఉపయోగపడుతుంది. భారతదేశంలో జీడీపీ అంచనాలను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ గణాంక కార్యాలయం (NSO) విడుదల చేస్తుంది. సాధారణంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి జీడీపీ గణాంకాలు ప్రకటిస్తారు. ఏడాది మొత్తానికి సంబంధించిన అంచనాలు కూడా విడుదల చేస్తారు.
మనదేశ జీడీపీ ఎంత?
మన దేశ జీడీపీలో సేవల రంగం, పరిశ్రమల రంగం, వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషిస్తాయి. ఐటీ, బ్యాంకింగ్, రవాణా, వ్యాపార సేవలు సేవల రంగంలోకి వస్తాయి. కర్మాగారాలు, నిర్మాణ రంగం పరిశ్రమల విభాగంలో ఉంటాయి. పంటల సాగు, పశుపోషణ, చేపల పెంపకం వ్యవసాయ రంగంలో భాగం. జీడీపీ పెరిగితే వ్యాపారాలు విస్తరించడం, పెట్టుబడులు పెరగడం, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది. అదే జీడీపీ తగ్గితే వ్యాపారాల ఆదాయం తగ్గడం, నిరుద్యోగం పెరిగే ప్రమాదం ఉంటుంది. అయితే జీడీపీ పెరిగిందంటే ప్రజలందరి ఆదాయం పెరిగినట్లు కాదు. పేదరికం, విద్య, వైద్యం, జీవన ప్రమాణాలు తెలుసుకోవడానికి ఇతర గణాంకాలను కూడా పరిశీలించాలి. ప్రస్తుతం భారతదేశ జీడీపీ (GDP) 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.346.36 లక్షల కోట్లుగా ఉంది. ఈ రూ.346.36 లక్షల కోట్లు నామమాత్రపు జీడీపీ. ధరల పెరుగుదల ప్రభావాన్ని తొలగించిన వాస్తవ జీడీపీ రూ.323.12 లక్షల కోట్లు.









