- Home
- Feature
- Train: రైలులో ప్రయాణిస్తున్నప్పుడు చైన్ లాగితే ఏం జరుగుతుంది? చైన్ ఎవరు లాగారో ఎలా తెలుస్తుంది?
Train: రైలులో ప్రయాణిస్తున్నప్పుడు చైన్ లాగితే ఏం జరుగుతుంది? చైన్ ఎవరు లాగారో ఎలా తెలుస్తుంది?
Train: రైలు ప్రయాణంలో ఉన్నప్పుడు... సడెన్ గా.. ఎమర్జెన్సీ చైన్ లాగితే ఏం జరుగుతుంది? సినిమాల్లో చూపించినట్లు వెంటనే రైలు ఆగుతుందా? దీని వెనక మెకానిజం ఎలా పని చేస్తుంది..?

రైలులో చైన్ లాగితే ఏం జరుగుతుంది?
రైలు ప్రయాణం అంటేనే ఒక మధురమైన అనుభూతిని ఇస్తుంది. కిటికీ పక్కన కూర్చొని బయట ప్రకృతిని ఆస్వాదించడం చాలా మందికి నచ్చుతుంది. అయితే.. రైలు లో ప్రతి బోగీలోనూ... మనకు ఎమర్జెన్సీ కోసం.. ఓ చైన్ ఉంటుంది. ఆ చైన్ లాగితే రైలు ఆగుతుంది అని కూడా అందరికీ తెలిసే ఉంటుంది. ఒక వేళ ఆ చైన్ లాగితే ఏం జరుగుతుంది? చైన్ లాగిన వెంటనే రైలు ఆగుతుందా? అసలు.. ఎవరు చైన్ లాగారు అనే విషయం ఎలా తెలుస్తుంది? ఈ చైన్ లాగిన వెంటనే రైలు ఆగడం వెనక ఏం జరుగుతుందో తెలుసా?
చైన్ లాగిన మరుక్షణం ఏం జరుగుతుంది?
సినిమాల్లో చూపించినట్లు ఎమర్జెన్సీ చైన్ లాగగానే రైలు వెంటనే బ్రేక్ వేసినట్లు ఆగిపోదు. సినిమాల్లో చూపించినట్లుగా... రియల్ లైఫ్ లో.. వెంటనే ట్రైన్ ఆగిపోదు.
గాలి పీడనంలో మార్పు: ఇండియన్ రైల్వేస్ ఆపరేటింగ్ మాన్యువల్ ప్రకారం, ఎయిర్-బ్రేక్ రైళ్లలో ఈ అలారం చైన్ బ్రేక్ పైప్‌కు ఒక ప్రత్యేక వాల్వ్ ద్వారా కనెక్ట్ చేసి ఉంటుంది. ఎవరైనా చైన్ లాగగానే ఆ వాల్వ్ తెరుచుకుని గాలి బయటికి వస్తుంది. దీనివల్ల బ్రేకింగ్ సిస్టమ్‌లో పీడనం తగ్గిపోతుంది.
డ్రైవర్ స్పందన: బ్రేకింగ్ సిస్టమ్‌లో పీడనం తగ్గడాన్ని లోకో పైలట్ గేజ్ ద్వారా గుర్తించి, రైలు వేగాన్ని క్రమంగా తగ్గించి సురక్షితంగా రైలుని ఆపుతాడు. అయితే కదులుతున్న రైలు వెంటనే ఆగిపోదు. ఆగడానికి చాలా ఎక్కువ సమయమే తీసుకుంటుంది.
అలర్ట్ సిస్టమ్: డ్రైవర్ మూడు సార్లు హార్న్ మోగించడం ద్వారా గార్డుకు, సెక్యూరిటీ సిబ్బందికి అలారం చైన్ యాక్టివేట్ అయిందని సంకేతం ఇస్తాడు. అంతేకాకుండా, గాలి పోయేటప్పుడు వచ్చే విపరీతమైన శబ్దం వల్ల ఏ బోగీలో చైన్ లాగారో సిబ్బంది సులభంగా గుర్తిస్తారు. ఆ తర్వాత రైలు ఆగుతుంది. వెంటనే, రైల్వే సిబ్బంది రంగంలోకి దిగుతారు. ఏ బోగిలో చైన్ లాగారో పరిశీలించి, అక్కడికి వెళ్లి సమస్య ఏంటో కనుక్కుంటారు. ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. ఆ తర్వాత మళ్లీ చైన్ మెకాజినమ్ రీసెట్ చేసి, బ్రేకింగ్ సిస్టమ్ అంతా సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేసిన తర్వాత మళ్లీ రైలు కదులుతుంది.
రైల్లో చైన్ ఎప్పుడు లాగాలి..?
రైల్లో చైన్ ఎప్పుడు పడితే అప్పుడు లాగకూడదు. ఎవరికైనా తీవ్రమైన ప్రాణాపాయ ఆరోగ్య సమస్య తలెత్తినా, ప్రమాదవశాత్తు ఎవరికైనా ఏదైనా జరిగినా, మంటల చెలరేగినా.. ఇలాంటి సందర్భాల్లో ప్రయాణికులు చైన్ లాగొచ్చు.
స్టేషన్ మిస్ అయ్యిందని చైన్ లాగొచ్చా..?
చాలా మందికి ఉండే పెద్ద అనుమానం ఇది. ఒకవేళ దిగాల్సిన స్టేషన్ దాటిపోతే చైన్ లాగి దిగొచ్చా అనుకుంటారు. కానీ పొరపాటున కూడా ఇలా చేయకూడదు. మీరు బోర్డు అయిన ట్రైన్ మారినా, స్టేషన్ దాటిపోయినా, లేదా సామాను మరచిపోయినా చైన్ లాగడం నిషిద్ధం. మీ చిన్న వ్యక్తిగత పొరపాటు లేదా తొందరపాటు నిర్ణయం వల్ల ఆ ఒక్క రైలు షెడ్యూల్ మాత్రమే కాకుండా, దాని వెనుక వచ్చే ఎన్నో రైళ్లు ఆలస్యం అవుతాయి. దీనివల్ల వందలాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకే, సొంత లాభం కోసం ఎప్పుడూ చైన్ లాగకూడదు.
చైన్ లాగితే ఏం జరుగుతుంది..?
సరైన కారణం లేకుండా, సరదా కోసం, మీ సొంత లాభం కోసం చైన్ లాగితే.. రైల్వే అధికారులు మిమ్మల్ని శిక్షించే అవకాశం ఉంటుంది. రైల్వే చట్టం-1989, సెక్షన్ 141 ప్రకారం.. తగిన కారణం లేకుండా రైలు కమ్యూనికేషన్ వ్యవస్థకు విఘాతం కలిస్తే ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష, ₹1,000 వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.

